Suryaa.co.in

Andhra Pradesh

చీరాలలో ఎప్పుడో వచ్చిన ఫిషింగ్ హార్బర్ కి ఒక్క ఇటుక పేర్చలేదు

– జగన్ రెడ్డి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితులలో లేరు
– టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి

చీరాలలో ఎప్పుడో వచ్చిన ఫిషింగ్ హార్బర్ కి ఒక్క ఇటుక పేర్చలేదని, జగన్ రెడ్డి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితులలో లేరని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు యధాతథంగా మీకోసం…

నిన్న ముఖ్యమంత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నిజయోకవర్గంలోని రామాయపట్నానికి వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన పోర్టుకు మళ్ళీ శంకుస్థాపన చేశారు. గతంలో తెలుగుదేశ ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లు రద్దు చేయడం, కాంట్రాక్టర్లని బెదిరించి చేసిన వాటికే రెండవ సారి శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలని మోసం చేశాడని ఎన్నికలకు ముందు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలవుతోంది. ఇంతకాలం మీరు ఏం చేశారు? ఎన్నికలు వచ్చే రెండు సంవత్సరాల ముందు వచ్చి శంకుస్థాపన చేసి ప్రజలని మభ్యపెట్టడం మోసం చేయడం కాదా?

జగన్ రెడ్డికి నిజంగా ఈ ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత గడచిన ఈ మూడు సంవత్సరాలలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేసుంటే నేడు అనుబంధ పరిశ్రమలు వచ్చుండేవి కాదా? ఇప్పుడొచ్చి ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు, లక్ష ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. చీరాలలో ఎప్పుడో వచ్చిన ఫిషింగ్ హార్బర్ కి ఒక్క ఇటుక కూడ పేర్చలేదు. ఒంగోలు నియోజక వర్గంలో రామాయపట్నంలో ఫిషింగ్ హార్బర్ కి జీవో ఇచ్చి సంవత్సరం గడిచినా అక్కడ ఒక్క పనికి అతీ గతీ లేదు.

జగన్ రెడ్డి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితులలో లేరు. ప్రజలలోకి జగన్ రెడ్డి అరుదుగా వస్తారు, ఒకవేళ వచ్చినా తప్పుడు సంకేతాలను ప్రజలలోకి పంపిస్తున్నారు. జీవో ఇచ్చి ఏడాది గడిచినా ఏమీ చేయని జగన్ రెడ్డి లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పడం హాస్యస్పదం. గతంలో రామయపట్నంలో ఏషియన్ పేపర్ పల్ప్ కి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎంఓయూ కుదుర్చుకొని శంకుస్థాపన చేసి, 25వేల మందికి ఉపాధి కల్పించారు. అటువంటి పరిశ్రమని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రద్దు చేయడం వాస్తవం కాదా?

రద్దు చేసిన పరిశ్రమ స్ధానంలో మరొక పరిశ్రమని ఏమైనా తీసుకొచ్చారా? రద్దు చేసిన పరిశ్రమల వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రజలు ఉపాధిని కోల్పోయారు. చిలకలూరి పేట, నెల్లూరు జిల్లాలోని కావలి చుట్టు పక్కల ప్రాంతాలలో సుబాబుల్, జామాయిల్ తోటలు అధికంగా ఉన్నాయి. పరిశ్రమ వస్తే అధిక రేట్లు వచ్చే పరిస్థితి ఉంది. నిన్న శంకుస్థాపన కార్యక్రమంలో రైతులకు మంచి భరోసా ఇస్తారు అని ఎదురు చూసిన రైతులని జగన్ రెడ్డి నీరు గార్చారు. గత ప్రభుత్వం ఏషియన్ పేపర్ పల్ప్ ద్వారా 25వేల మందికి ఉపాధి ఇస్తుందని చెబితే, వేగంగా పరిశ్రమలు వస్తాయని చెప్పారు కాని ఒక్క పరిశ్రమతోనైనా ఎంఓయూ కుదుర్చుకున్నారా?

ఏయే పరిశ్రమలు అక్కడ పెడుతున్నారో చెప్పగలరా? ఎందుకు మాయ మాటలు చెప్పి ప్రజలని మోసం చేస్తున్నారు జగన్ రెడ్డి. రంగపట్నం పోర్టు ఇంకో రెండు సంవత్సరాలలో పూర్తయ్యే పరిస్థితులలో అదానీ గ్రూపుకి పోర్టుని ఎందుకు ఇచ్చారు? జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 2019 డిసెంబర్ లో స్టీల్ ప్లాంటుకి శంకుస్థాపన చేయడం వాస్తవం కాదా? లిబర్టీ అనే దివాళ తీసిన సంస్థతో ఎంఓయూ చేసుకోవడం వాస్తవం కాదా? నేడు ఆ సంస్థ ఎందుకు వెనక్కి పోయింది? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్టీలు ప్లాంట్ ని కడతానని చెప్పి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క ఇటుక కూడ ఎందుకు వేయలేదు. రెండు సంవత్సరాలలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జగన్ రెడ్డి మళ్లీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకొనే విధంగా చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈ రెండు సంవత్సరాలలో పోర్టు పనులు పూర్తి అవుతాయా? జగన్ రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందులలో బస్ షెల్టర్ ని నిర్మించలేని వారు, పోర్టు ఫిషింగ్ హార్బర్, లక్ష ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడాన్ని ఏ ఒక్కరు కూడా నమ్మరు. జగన్ రెడ్డి కేసులలో ఎ2గా ఉన్న విజయసాయి రెడ్డి అల్లుడుకి సంబంధించిన కంపెనీలకి పోర్టుకి సంబంధించిన పనులని అప్పగించడం నిజం కాదా? ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటి కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడచినా నిర్మాణం చేయలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ట్రిపుల్ ఐటి పూర్తి అయిఉండేదని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి వివరించారు.

LEAVE A RESPONSE