Suryaa.co.in

Features

లిఫ్ట్ ఇచ్చారంటే.. ఫైన్ కట్టాలంతే!

– మనకు తెలియని మాయ‘దారి’ ట్రాఫిక్ సెక్షను ఇది

రోడ్డు పక్కన పాపం ఎవరో వృద్ధుడు లిఫ్ట్ అడిగాడు కదా అని జాలితో మీరు ఆ వృద్ధుడిని ఎక్కించుకోవాలని అనుకుంటున్నారా?
దారినపోతుండగా ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని చొంగ కార్చుకుని, కూర్చోబెట్టుకోవాలని అనుకుంటున్నారా?
పాపం నడవలేని వికలాంగుడిపై బోలెడంత జాలి ప్రదర్శించి, అతనికి లిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?
అయితే బరాబర్ మీ జేబుకు చిల్లుపడినట్లే.
అదేంటి? ఏదో మానవతాదృక్పథంతో వారికి లిఫ్ట్ ఇస్తే, మా జేబుకు ఎందుకు బొక్క పడుతుందనుకుంటున్నారు కదా? క్లౌడ్‌బరస్ట్ కాలంలో ఏమిటీ కామెడీ అనుకుంటున్నారా?
యస్. మీరు చదువుతున్నది అక్షరాలా నిజమే.
ఎందుకంటే..ఎవరినయినా లిఫ్ట్ ఎక్కించుకుంటే ట్రాఫిక్ పోలీసులకు లక్షణంగా చలానా చెల్లించాల్సిందేనట.

అవునండీ.. ఇప్పటివరకూ దేశ ప్రజలెవరికీ తెలియని, 66/192 సెక్షన్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమట. ఈ దిక్కుమాలిన సెక్షను ఒకటుందని ఇప్పటివరకూ మీకు ఎవరికయినా తెలుసా? ఊహు. తెలియనే తెలియదు. మహా అయితే సిగ్నల్ జంపింగులు, త్రిబుల్ రైడింగులు, హెల్మెట్ లేకపోతేనో, బండినడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడితేనే చలాన్లు వేస్తారని విన్నాము గానీ, ఇలా లిఫ్ట్ ఇస్తే చలాన్లు వేసే మాయదారి సెక్షన్ల గురించి.. అసలు ఆ చలాను ఎవరు? ఎందుకు వేశారో తెలుసుకుందాం రండి.

రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైన చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం…

నితిన్ నాయర్ ముంబైలో ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.

విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు.

కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు. ( అపరిచుతులకు ఇచ్చే దానినే లిఫ్ట్ అంటారు)
తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.సో.. లిఫ్ట్ ఇచ్చే అలవాటున్న విశాలహృదయులు జేబులో ఎక్స్‌ట్రా ఓ 1500 రూపాయలు కూడా పెట్టుకుని రోడ్డెక్కండి.

LEAVE A RESPONSE