– ఎమ్మెల్సీ బీటీ నాయుడు
ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు:-
ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు, ధర్మ శాస్త్రాలు “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని చెప్తున్నాయి. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టకపోతే రాజకీయాలలోకి రావడమే వృథా అన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…“నందమూరి తారక రామారావు మాటలను స్ఫూర్తిగా తీసుకుని నారా చంద్రబాబు నాయుడు జూన్ 11, 2018 నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. మూడు పూటల పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను చంద్రబాబు నాయుడు తెరిచారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి తెలుసు.
రూ.15కే మూడు పూటలా భోజనం బాబు ఘనత:-
సాధారణంగా భోజనానికి ఒకపూటకు రూ.60/-లు ఖర్చు అయితే కేవలం పూటకు రూ.5/- ల చొప్పున రోజుకు రూ.15/-లకే పేదలకు మూడు పూటలా భోజన వసతి కల్పించారు. అన్న క్యాంటీన్లను అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. సుమారు పూటకు 300 పైగా జనాభా అన్న క్యాంటిన్లలో భోజనం చేస్తున్నారు. కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు, యాచకులు సైతం అత్యంత నామమాత్రపు ఖర్చుతో మూడు పూటలా కడుపునింపుకునేందుకు అన్న క్యాంటీన్లు వేదికగా నిలిచాయి. రాష్ట్రంలో అన్ని క్యాంటిన్లలలో దాదాపు రోజుకు 2.25లక్షల మందికి ఆకలి తీర్చారు.
అన్న క్యాంటీన్లపై జగన్ రెడ్డి విషప్రచారంతో మూతవేశారు:-
జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లను విరుద్ధంగా 2019 ఆగష్టు 1న మూసివేశారు. జగన్ రెడ్డి, జగన్ రెడ్డికి సలహాదారు ప్రశాంత్ కిషోర్, వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ల పై దుష్ర్పచారం మొదలు పెట్టారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణలో అవినీతి జరిగిందంటూ, రాబడి లేని వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం ఏముందంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటులో రూ.50లక్షలు ఖర్చు చేసినా, 216 క్యాంటీన్లకు రూ.100కోట్లు మాత్రమే ఖర్చు. కానీ రూ.150కోట్ల అవినీతి జరిగిందని, రూ.2 లక్షలతో చేపట్టే నిర్మాణానికి రూ.50లక్షలు ఖర్చు చేశారని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు. పక్కా ప్రణాళికతో తప్పుడు ఆరోపణలు చేసి అన్న క్యాంటీన్లని మూసివేశారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లని ఉగాది నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న ఎక్కడ అన్న క్యాంటీన్ల గురించి ప్రస్తావించిన సందర్భాలు కూడ కానరావడం లేదు. కనీసం అన్న క్యాంటీన్ల గురించి అక్షయ పాత్ర వ్యవస్థతో చర్చ జరిపింది కూడ లేదు.
పేదలకు అన్నం పెడుతుంటే వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు:-
టీడీపీ నాయకులు, మరికొందరు మంగళగిరి, నందిగామ పలు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లని ప్రారంభిస్తే జగన్ రెడ్డి, అతని మంత్రులు, వైసీపీ నాయకులు అందరు కలిసి అసలు ప్రారంభించకూడదని ధ్వంసం చేశారు. పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు బనాయించారు. పేదవాడికి అన్నం పెడుతున్నందుకు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. జగన్ రెడ్డికి పేదవాడికి కడుపునింపుకోవడం ముఖ్యం కాదు వాళ్ళ ఖజానాని నింపుకోవడమే లక్ష్యం. అందుకే స్పష్టంగా రాబడి లేని వ్యవస్థని కొనసాగించుకోవాల్సిన అవసరం ఏంటని మాట్లాడుతున్నారు.
జగన్ రెడ్డి తమిళనాడు వైపు చూడు:-
పక్కనున్న తమిళనాడులో జయలలిత పేరు మీద అమ్మ క్యాంటిన్లు నడుస్తున్నాయి. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను మూసివేసేదే లేదు, పేరు మార్చే ప్రసక్తే లేదు అన్నారు. చివరికి జయలలిత ఫోటోలతోనే క్యాంటీన్లను కొనసాగిస్తున్నారు. టీటీడీలో మొట్ట మొదట అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టింది నందమూరి తారక రామారావు. డొక్క సీతమ్మ బ్రిటీష్ కాలములో స్వాతంత్రానికి పూర్వమే అన్నదాన కార్యక్రమాలు చేశారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు చేస్తే కక్షపూరిత చర్యతో జగన్ రెడ్డి మూసివేశారు. వివాహ కానుకలు, పండుగ కానుకలు, పేద విద్యార్థులు చదువుకునే విదేశీ విద్యని రద్దు చేశారు. దాదాపు 6లక్షల మందికి ఇచ్చిన నిరుద్యోగ భృతిని రద్దు చేశారు. రైతు రుణాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రద్దు చేస్తే దాన్ని కూడ ఆపివేశారు.
జగన్ రెడ్డి లాభాల కాంక్షతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం:-
జగన్ తన ఖజానా లాభ, నష్టాలు గణాంకాలు వేసుకుంటూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని భ్రష్టు పట్టిస్తున్నాడు. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రజలని మభ్యపెట్టడానికి పత్రికలలో ప్రచురించడానికి బటన్ నొక్కి చేసే ఖర్చులో కొంత అయిన పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టడంలో ఉపయోగించాలి. బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశంపార్టీ వైపు ఉంటారు కనుక వారంటే జగన్ రెడ్డికి కక్ష.
అన్న క్యాంటీన్లు తెరవకుంటే ఉద్యమం తప్పదు:-
వైసీపీ ప్లీనరీ సమావేశాలలో, మీడియా సమావేశాలలో ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్తున్నారే కాని పేదల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెంచేశారు. సామాన్యుడు కనీసం పల్లె వెలుగు బస్సులో కూడ ప్రయాణించే పరిస్థితి లేకుండా టిక్కెట్ ధరలు అన్యాయంగా పెంచారు. కరెంటు ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా ధరలు పెరిగే పరిస్థితి. పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాడు. మళ్లీ అదే ప్రణాళికతో ప్రజల మధ్యకు వస్తున్నాడు. నేడు ప్రజలు తిరిగబడి వారికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించాలి. అన్నక్యాంటీన్లను తక్షణమే ప్రారంభించాలి. లేదంటే ప్రజల పోరాటాలకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ తరపున భారీ ఉద్యమం చేపడతాం” అని హెచ్చరించారు.