– క్యాసినో బండారాన్ని మేం అప్పుడే బయటపెట్టాం
-చికోటి మాధవరెడ్డితో వైసీపీ నేతల బంధాన్ని బయటపెట్టాలి
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్
రాష్ట్రంలో విపరీత ధోరణితో పాలన సాగుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వం జీవం పోస్తోంది. గత సంక్రాంతి సమయంలో గుడివాడనందు ఆనాటి మంత్రి కొడాలినాని నిర్వహించిన క్యాసినో జూదంలో వేలాదిమంది తమ డబ్బులు వదిలించుకొని రోడ్డున పడ్డారు. వందలాది కుటుంబాలు బజారున పడ్డాయి. క్యాసినో ద్వారా కొడాలి నాని నిలువు దోపిడి చేశారు. పది వేల రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు. దాదాపు 18 వేల మంది పాల్గొన్నారు. ఎంట్రీ ఫీజు ద్వారా 180 కోట్లు చేతులు మారాయి. ముఖ్యమంత్రి సహచరులు ఏ రకంగా రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారో సీఎం ఆలోచించాలి. గేమింగ్, డ్యాన్సులు అందర్-బాహర్, లోన-బయట, తీన్ పత్తీ, బ్లాక్ జాక్ ఇలా ఇష్టమొచ్చినట్లు ఆటలు సాగాయి. చేతులు మారిన డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో తేలాలి. ఆయన పార్టనర్ గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఆనాడు తాము ఎంతగానో గగ్గోలు పెట్టాము.
క్యాసినో జరిగిన ప్రాంతం చూడడానికి కూడా తమను వెళ్లనీయలేదు. అవినీతిలో తలమునకలై పీకల లోతులో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం క్యాసినో జరిగిన స్థలం చూపిస్తాం, ఆ విధానం వివరిస్తామంటే పట్టించుకోలేదు. పోలీసులు అస్సలు వినలేదు. ఈ కేసులో పోలీసులు తప్పించుకోలేరు. అక్కడ ఏమీ జరగలేదని సర్టిఫికెట్ ఇచ్చారు. డీజీపీ సవాంగ్, ఎస్పీ సత్యానందం, ఎంక్వైరీ ఆఫీసర్ గా ఉన్న శ్రీనివాస్, పోలీసులకు ముసలం పుట్టింది. ఎందరి జీవితాలనో నాశనం చేసిన పాపం ఊరికే పోదు. మేము గగ్గోలు పెడితే మామీదను తిరగకేసులు పెట్టారు. మీ మీదనే కుట్ర కేసులు పెట్టటం అవినీతి కి కొమ్మకాశారనేందుకు నిదర్శనం.
శాసనసభలో ప్రస్తావిస్తే రిపోర్టు కాల్ ఫర్ చేస్తున్నాం, వస్తుంది అన్నారు. ఆ రిపోర్టు ఏమైందో ఇంతవరకు తెలియదు. సీఎంకు అవినీతి అంటే ఇష్టం. అవినీతి చేసేవారిని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అవినీతి చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను చాలా గౌరవంగా పలకరిస్తారు. నూజివీడు డిఎస్పీ రిపోర్టు ఇంతకాలం ఉంటుందా? క్యాసినో గురించి ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. ఆనాడే చికోటి ప్రవీణ్ గురించి చెప్పాం. అతను వంశీకి అత్యంత సన్నిహితుడని చెప్పాం. రుజువులున్నాయి. చికోటి ప్రవీణ్ నా ఫ్రెండ్ కాదు, క్యాసినోకి నాకు సంబంధం లేదు అని వంశీ చెప్పగలడా? దీనిపై ఎలాంటి ఎంక్వైరీ జరపకుండానే 8నెలలు కాలం గడిపేశారు. ఈ క్యాసినో వ్యవహారం అంతటితో పోలేదు, రావణకాష్టంలా కాలుతూనే ఉంది. ఇప్పటికీ సెగ తగులుతూనే ఉంది. ఈ క్యాసినో సెగ ఏపీ పోలీసులకి తప్పకుండా తగులుతుంది. కేరళ రాష్ట్రం నుంచి వందలాదిమంది గుడివాడలో జరిగిన ఈ క్యాసినోకి వచ్చారు. ఇక్కడ గేమ్ వన్ సైడ్ గా జరిగిన విధానాన్ని చూసి కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కేరళ వాళ్లు ఏపీకి వెళ్లి కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వైనం చూసి కేరళా ప్రభుత్వం కూడా నివ్వెరపోయింది. ముఖ్యమంత్రికి సిస్టమ్స్ తెలియదు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి అవగాహన ఉందా? జూన్ 10,11,12,13 నాలుగు రోజులు నేపాల్ లో జపా జిల్లా మోచీ నగర్ లో హోటల్ మోచీక్రౌండ్ లో ఆల్ ఇన్ వన్ ఈవెంట్ పేరుతో క్యాసినో నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నానీ, శాసనసభ్యుడు వంశీ సన్నిహితుడు చికోటి ప్రవీణ్ నిర్వహించాడు. మన వాళ్ల ప్రమేయం కూడా ఉంటుంది. ఏపీ నుంచి ఏలూరు, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విజయవాడ, విశాఖపట్నం నుంచి జూదక్రీడాకారులు వెళ్లారు. వీరికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీరికి చికోటి ప్రవీణ్ ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. ఫ్లైట్ చార్జీలు, ఫైస్టార్ హోటల్ ఖర్చు, భోజనం, అక్కడ అశ్లీల నృత్యాలు చూడ్డానికి, అక్కడ బసచేయడానికి ఒక్కొక్కరి వద్ద 3 లక్షలు వసూలు చేశారు. వీరికి మందు, విందు సకల సౌకర్యాలు కల్పించారు. ఆ ఫ్లైట్ లో సగం మంది క్రీడాకారులు అధికార పార్టీకి చెందినవారు వెళ్లారంటున్నాను. ఆ ఫ్లైట్ లో మాజీ బూతుల మంత్రి, ఎమ్మెల్యే వంశీ, వీరి స్నేహ బంధం అంతా సగం మంది వెళ్లి వుంటారు. చికోటి ప్రవీణ్ మీ పార్టీకి సన్నిహితుడే. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన జూద క్రీడాకారుల వివరాలు బయటపెట్టగలరా? ధైర్యం ఉంటే బయట పెట్టాలి. మీ ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? ఈ క్యాసినోకి వెళ్తున్నవారు చెప్పారా? నేపాల్ లో క్యాసినో జరిగితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ 8 చోట్ల దాడి చేయడానికి కారణం అవినీతి పార్టీకి చెందిన చాలా మంది పెద్దలు ఈ క్యాసినో లో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవటమేననే సమాచారం ఉంది.
అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు నల్లధనాన్ని వైట్ అమౌంటుగా మార్చుకుంటున్నారు అనేది సమాచారం. ముఖ్యమంత్రి దీని పైన విచారణ జరిపారా? మన రూపాయి ధనాన్ని నేపాల్ వెళితే అక్కడ కరెన్సీగా చికోటి ప్రవీణ్ బృందం మార్చి మనీ లాండరింగ్ చేస్తారు. ఇలా మార్చిన ధనాన్ని లావోస్ లోని వారి బ్యాంకు ఖాతాలలో నిక్షిప్తం చేస్తారు. లావోస్ లోని డబ్బు కిప్ ఆంధ్రప్రదేశ్ లోకి మిలియన్లకు మించి రావడంతో ఆర్బిఐ కూడ నేపాల్, లావోస్ లో ఏం జరిగిందని, ఇన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఎలా జరిగిందని ఉలిక్కిపడింది. చికోటి ప్రవీణ్ భాగోతంతో బూతులు మంత్రి, వంశీ క్యాసినో బండారం బయట పడింది. కేరళ వాళ్లు ఎంత మంది గుడివాడ క్యాసినోలో డబ్బుని పోగొట్టుకున్నారో గుట్టు రట్టయింది.
పోలీసులు గుడివాడ క్యాసినో మీద ఏం రిపోర్టు ఇచ్చారు?. పోలీసులు నిజనిర్థారణ కమిటీని ఎందుకు వెళ్లనివ్వలేదు?. నిజనిర్థారణ కమిటీ మీద తప్పుడు కేసులు ఎందుకు బనాయించారో అన్ని విషయాలు బయటికొస్తాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చూస్తూ ఊరుకోదు. ఎనఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎలా పనిచేస్తుంది?, ఆరోపణలు ఉన్న వారు ఎవరెవరు హాజరవుతున్నారో అందరికి తెలుసు. చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి, బూతులు మంత్రి, వంశీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి ప్రత్యేకం ఏం కాదు. జగన్ రెడ్డి తెలుసుకోవాలి. అందరి భాగోతాలు బయట పడతాయి. అధికార పార్టీ వైసీపీకి చెందిన వారు అనేక మంది గుట్టు రట్టవుతుంది. ఇక్కడ సంపాదించిన డబ్బంతా నేపాల్, లావోస్ తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా చేరిందో వివరంగా అన్ని నిజాలు నిర్థారితమవుతాయి. పారదర్శకంగా పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి తమ నాయకులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలకు అండగా నిలవడం వల్ల నేడు ఇంతటి చెడ్డపేరు వచ్చింది.
వర్ల రామయ్య అనే నా మీద అక్రమంగా కేసులు పెట్టించడంలో చూపించిన శ్రద్ధ తప్పుదోవ పడుతున్న నాయకులని దారిలో పెట్టడానికి చూపించుంటే నేడు ఈ దుస్థితి పట్టేది కాదు. 11 నుంచి 13 వరకు ఎవరు నేపాల్ వెళ్లారో ఇన్ టలిజెన్స్ డిపార్టమెంటుకి ప్యాసెంజర్ల లిస్ట్ ని బయట పెట్టే దమ్ముందా ? ఆ వివరాలు బయటికొస్తే వైసీపీ ప్రభుత్వం నిట్టనిలవున కూలిపోతుంది. జగన్ రెడ్డి మనోరంజక క్రీడలకు ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రజారంజక పరిపాలనకు కాదు. చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి, వైసీపీ నాయకులు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వాళ్లందరిని బయటకు తీసుకురావాలి. ప్రధానీ మోడీ కూడ తెలుసుకోవాలి ఈ విషయం ప్రజల పట్ల కేంద్రం చిత్తశుద్ధిని తెలియపరుస్తుంది. ఎనఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ క్షుణ్ణంగా విచారణ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య టీడీపీ తరపున డిమాండ్ చేశారు.