– హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు
అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన ఐదుగురు యువకుల్లో నలుగురి మృతదేహాలను నేవీ సిబ్బంది శనివారం గుర్తించారు. రెండు హెలికాప్టర్లతో తీరం వద్ద గాలింపు చేపట్టగా
గోపాలపట్నం, తూచికొండ, యలమంచిలి, మరో ప్రాంతానికి చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు.
విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి ఆచూకీ కోసం నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్ట్ గార్డులు, మెరైన్ పోలీసులు మత్స్యకారుల సహాయంతో తీరంలో గాలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా సీతపాలెం సముద్రతీరంలో శుక్రవారం ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. సరదాగా స్నానానికి దిగిన వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు కొన ఊపిరితో ఉండగా మత్స్యకారులు రక్షించారు.
తెదేపాకు చెందిన ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు బృందం ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న అనకాపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనాకుమారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ప్రకటించాలని కోరారు.