– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప వ్యాఖ్య
బండి సంజయ్ కు భయపడి ’చేనేత బీమా‘ పథకాన్ని ఆగస్టు 7 నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప అన్నారు. రెండ్రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏడాది కింద కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో ’చేనేత బీమా‘ ను ప్రకటించారని… ఏడాదైనా చనిపోయిన ఒక్క చేనేత కార్మికుడి కుటుంబానికి కూడా బీమాను ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారని అన్నారు.
ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ కుమ్మరి శంకర్, రాష్ట్ర నాయకులు సుధాకర్ శర్మ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ… ఆగస్టు 7న చేనేత కార్మికులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు సంజయ్ ప్రకటించారని చెప్పారు. పైగా ప్రజా సంగ్రామ యాత్ర కూడా ప్రారంభం కానుండటంతో భయపడిన టీఆర్ఎస్ ప్రభుత్వం దిగొచ్చి చేనేత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిందని సంగప్ప తెలిపారు.
కేసీఆర్ ఏ పథకం ప్రకటించినా ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయ లబ్ది కోసమే చేస్తారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు దళిత బంధు ద్వారా దళితులను… చేనేత బీమా నేతన్నలను వలలో వేసుకోవాలని ప్రయత్నించారని… ఎన్నికలైపోగానే ఆ రెండింటినీ మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
మళ్లీ మునుగోడు ఎన్నికలొస్తున్నట్లు ప్రచారం కావడం… మరోవైపు సంజయ్ ఆందోళనకు సమాయత్తం కావడంతో వీటిని ద్రుష్టిలో ఉంచుకుని కేటీఆర్ హడావుడిగా చేనేత బీమాను ప్రకటించారని పేర్కొన్నారు. అనంతరం 3వ పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ మీద రాసిన ‘ సలసల మరిగే నెత్తురు…’ పాటల సీడీని ఆవిష్కరించారు.