Suryaa.co.in

Andhra Pradesh

రేషన్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం

  • వైయ‌స్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, ఎన్. రెడ్డప్ప
  • 60 శాతం మందికే కేంద్రం బియ్యం పంపిణీ
  • బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3 వేల కోట్లు ఖర్చు
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

రేషన్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంద‌ని వైయ‌స్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, ఎన్. రెడ్డప్పలు ధ్వ‌జ‌మెత్తారు. గురువారం ఎంపీలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ప్ర‌జా పంపిణీ, ఆహార భద్రతా పథకాల కింద రాష్ట్రానికి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు అసలు పొంతన లేదు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తాం. వాస్తవాలకు విరుద్ధంగా, “కేంద్రం నుంచి తీసుకునే రేషన్ ఎక్కువ.. ప్రజలకు పంచేది తక్కువ” అంటూ ఈనాడు, ఇతర పత్రికల్లో ఆ కథనాలను ప్రచురించి, రాష్ట్రంలోని పేద ప్రజల్లో గందరగోళ పరిస్థితిని సృష్టించారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదారి పట్టించడమే. ఒకవేళ ప్రింటింగ్‌ మిస్టేక్‌ పడిందా? లేక మరొకటా అనే దానిపై కేంద్ర మంత్రిని కలిసి స్పష్టత కోరతాం. ఇటువంటి వార్తలు ప్రజలలోకి వెళితే ఏవిధమైన తప్పుడు సంకేతాలు వెళతాయనేది గమనించాలి.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే డోర్ డెలివరీ విధానం తెచ్చి, ప్రజల గడప వద్దకు వెళ్ళి రేషన్‌ పంపిణీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి, ఈ విధానాన్ని దేశంలోని మిగతా కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఎక్కడా అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ గారు ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారని చెప్పవచ్చు.

వాస్తవానికి, మన రాష్ట్రంలో బీపీఎల్ కు దిగువున ఒక కోటి 54 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. అయితే, కేంద్రం 89లక్షల కార్డుదారులకు మాత్రమే బియ్యం కేటాయిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 లక్షల కార్డుదారులకు బియ్యం అందిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 3వేల కోట్లు పేదలకు ఖర్చు చేస్తోంది. బియ్యం కోటా పెంచాలని, ముఖ్యమంత్రిగారు పలుమార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి విజ్జప్తి చేశారు.

అదే కేంద్ర ప్రభుత్వం, ఎన్ ఎఫ్ ఎస్ ఏ పథకం కింద.. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు 76శాతం మంది జనాభాకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. మన విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చేసరికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేవలం 60 శాతం జనాభాకు మాత్రమే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఒక పక్క రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేయడంతోపాటు, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విధులు విషయంలోనూ పదే పదే అన్యాయం జరుగుతోంది. రాష్ట్రం తరఫున పలుమార్లు వినతులు సమర్పించినా.. ఇప్పటివరకూ కేంద్రం పట్టించుకోలేదు.

కేంద్రానికి సంబంధం లేకుండా 24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. ఏపీలో 96 శాతం బియ్యం పంపిణీ పేదలకు వెళుతోంది. మిగతా రాష్ట్రాల్లో మనకంటే తక్కువగానే బియ్యం పంపిణీ జరుగుతుంది.

అదికూడా రాష్ట్రంలో సార్టెక్స్‌ బియ్యాన్ని ప్రజలకు అందించడం జరిగింది. రేషన్‌ పంపిణీలో ప్రతినెలా ఎంతో కొంత మిగులు ఉంటుంది. అది వచ్చే నెలకు సర్ధుబాటు అవుతూ ఉంటుంది. అది అన్నిరాష్ట్రాల్లో జరిగే కార్యక్రమమే. అటువంటిది ఏపీకి బియ్యం కేటాయింపుపై తప్పుడు నివేదిక ఇవ్వడం బాధాకరం. అది కూడా పార్లమెంట్‌లో చెప్పడంపై సంబంధిత శాఖ మంత్రిగారిని అడుగుతాం. దీన్ని సవరించి రాతపూర్వకంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తాం.

ఎంపీ వంగా గీత మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అత్యంత పకడ్బందీగా, అవినీతికి తావు లేకుండా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, పక్కదారి పట్టకుండా నేరుగా నిరుపేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను అందిస్తున్నారు.

పేదవాళ్లు, వృద్ధులు, దివ్యాంగులు, కూలిపనులకు వెళ్లేవారు, గంటల తరబడి రేషన్‌ షాపుల వద్ద వేచి ఉండకుండా, నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే వాహనాల్లో నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు జరుగుతోంది.

రాష్ట్రంలోని అయిదున్నర కోట్ల జనాభాలో సుమారు నాలుగున్నర కోట్లమందికి … అంటే రాష్ట్ర జనాభాలో 80శాతం మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందిస్తున్నారు. పార్లమెంట్లో సాధారణంగా తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉండదు. అయితే క్లరికల్‌ మిస్టేక్‌, ఇన్‌ఫర్మేషన్‌ అందించడంలో తప్పు కావచ్చు, లేక ఈ మూడేళ్ల కాలుక్యులేషన్‌లో సమాచార లోపం వల్ల కావచ్చు, కేంద్రం కొంత తప్పుడు సమాచారాన్ని పార్లమెంటులో ఇచ్చింది. ఈలోపలే ఈనాడు, తదితర పత్రికల్లో తప్పుడు సమాచారం రాసి, ప్రభుత్వంపై నిందలు వేయడమే కాకుండా, ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారు. కేంద్రం ఇచ్చిన సమాచారం కన్నా మరింత తప్పుడు సమాచారం జోడించి కథనాలు ప్రచురించడాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మా పార్టీ ఎంపీల తరఫున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాచార వ్యవస్థ అనేది ప్రజలకు మేలు జరిగేలా ఉండాలే తప్ప, వారికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు.

ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ పేదవారికి అండగా ఉంటుంది. పేదలకు రావాల్సిన ప్రతి రూపాయి వారికి అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. పీడీఎస్‌ లెక్కల గణనలో ఏపీకి అ‍న్యాయం జరిగిందని 2020-21లో నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించాం. దీనికి నీతి ఆయోగ్ ఛైర్మన్ కూడా అంగీకరించారు. అలాగే యూపీ, గుజరాత్‌, మహారాష్ట్ర కన్నా ఏపీలో పేదలు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని చెప్పాం.

LEAVE A RESPONSE