- తక్షణమే స్కావెంజర్స్ ను నియమించేలా ఒత్తిడి తెండి
- ఉపాధ్యాయ సమస్యలపై సర్కార్ తీరును ఎండగట్టండి
- బండి సంజయ్ కు తపస్ ఉపాధ్యాయుల వినతి
- టీచర్ల పక్షాన పోరాడతామని బండి హామీ
‘‘ సార్… రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కంపు కొడుతున్నాయి. స్కావెంజర్లు లేకపోవడంతో పాఠశాలలను క్లీన్ చేసేవాళ్లు… టాయిలెట్లు శుభ్రపరిచే వాళ్లు లేరు. దీనివల్ల విద్యార్థులకు రోగాలొచ్చే ప్రమాదముంది. తక్షణమే అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి‘‘ అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కోరారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 3వ రోజు పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ ను తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాశం క్రిష్ణమూర్తి, జైని వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు బండి సంజయ్ ను కలిసి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు స్కావెంజర్ల నియామకం వంటి అంశాలపైనా వినతి పత్రం అందజేశారు. గత మూడేళ్లలుగా టీచర్లు బదిలీలకు నోచుకోలేదని, పదోన్నతుల ఊసే ఎత్తడం లేదని వారు వాపోయారు.
317 జీవో విషయంలో స్థానిక ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు అంతర్ జిల్లాల బదిలీలక నోచుకోలేదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన టీచర్లకు బెన్ ఫిట్స్ ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలన్నీ సావధానంగా విన్న బండి సంజయ్ కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని, టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా టీచర్ల పక్షాన బీజేపీ పోరాడుతుందని… తక్షణమే పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.