– రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సివేరి దొన్నుదొర, ఎం. దారు నాయక్
గిరిజన ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక కనీసం వారి సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016 లో గిరిజనులకు నాణ్యమైన విద్య అందించాలని 81 స్కూళ్లను గిరిజన గురుకులాలుగా మార్చడం జరిగింది.
అంతేకాకుండా ఆ స్కూళ్లలో రూ.126 కోట్లతో క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేసి జాతీయ క్రీడలకు గిరిజన పిల్లలను ప్రోత్సహించడం జరిగింది. టిడిపి హయాంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఒక్కోదానికి రూ.12 కోట్లు కేటాయించి మౌళికసదుపాయాలు ఏర్పాటు చేస్తే.. నేడు జగన్ రెడ్డి నాడు నేడు పేరుతో రంగులేస్తూ హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 301 ఉపాధ్యాయ ఖాళీలను ఎస్టీలతో భర్తీ చేసింది.
గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను 100% గిరిజనులతోనే భర్తీ చేసేలా జీవో ఎం.ఎస్ నెం.3 ను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టేసినా.. జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం అప్పీల్ కు కూడా వెళ్లలేదు. శాసన సభలో దీనిపై కనీసం తీర్మానం చేయలేదు. తరాతరాలుగా విద్యకు దూరమైన గిరిజనుల పిల్లలు ఇప్పుడిప్పుడే విద్యోన్నతి వైపు అడుగులు వేస్తుంటే నేడు జగన్ రెడ్డి వాటిని రద్దు చేయాలని చూస్తున్నాడు. ఈ నెల 9న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేదికగా జగన్ రెడ్డి గిరిజన వ్యతిరేక విధానాలను ఎండగడుతాం. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.