Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం నేతలకు కులాల ప్రస్తావన ఎందుకు?

ఏపీలో పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో కులమతాల చిచ్చు పెట్టాలని చూస్తున్నారని తెలుగదేశం నేత నారా చంద్రబాబు నాయుడు అంటుంటే, ఆయన పుత్రరత్నం లోకేష్‌ ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పెత్తనం మొత్తం ఒక సామాజికవర్గానికి అప్పజెప్పారని రంకెలు వేయడం సిగ్గుచేటు. మత, కుల వివక్ష లేకుండా సామరస్యంతో సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ఇలాంటి విషబీజాలు నాటి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది తెలుగుదేశం. తప్పుపట్టడానికి కారణాలేవీ కనిపించని పచ్చ పార్టీ నేతలు కులం ప్రస్తావనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారుపైనా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారు.

తెలుగుదేశం రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకడుగు ముందుకేసి తన పర్యటన అనుభవం పేరుతో ఏపీ రాజకీయాలకు కుల విశ్లేషణ జోడిస్తున్నారు. తాను ఇటీవల రెండు నెలలు అమెరికాలో ఉండగా అక్కడ అన్ని కులాల తెలుగువారు తనతో మాట్లాడారని 76 సంవత్సరాలు నిండిన బుచ్చయ్య చౌదరి తన పార్టీ సమావేశంలో చెప్పారట. మంచిదే, అట్లాంటిక్‌ మహాసముద్రం దాటి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లినాక కులమత భేదాలు లేకుండా అందరితో భేటీ కావడం సంతోషం. కాని, ముఖ్యమంత్రి జగన్‌ కులంవారిలో కూడా రాష్ట్ర పరిస్థితిపై బాగా ఆవేదన ఉందని చౌదరి గారు వాపోయారు. మిగిలిన అన్ని కులాలకు భిన్నంగా ముఖ్యమంత్రి కులస్తులు ఆలోచిస్తారని అనుకున్నారు బుచ్చయ్య. అలాకాకుండా వారు సైతం ఆవేదన చెందుతున్నారనే విషయం ఆయన శోధించి తెలుసుకున్నారు.

ఇలాంటి గాలి కబుర్లు ఎవరిని మభ్య పెట్టడానికో ఈ సీనియర్‌ టీడీపీ ఎమ్మెల్యే చెప్పడం మరిచారు. ముఖ్యమంత్రి కులం వారికే ఎక్కువ మేలు జరుగుతోందని కొందరు ఈ పార్టీ నేతలు చెబుతుంటే, లేదు జగన్‌ కులం వారూ అసంతృప్తితో ఉన్నారని బుచ్చయ్య వంటి వృద్ధ నేతలు ‘వెల్లడించడం’ చంద్రబాబు పార్టీలోని గందరగోళానికి అద్దం పడుతోంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో తెలుగుదేశం నేతలకు, కార్యకర్తలకు ఎవరైనా అమరావతిలో శిక్షణ ఇస్తే ఐదు కోట్ల ఆంధ్రులకు మేలు జరుగుతుంది.

LEAVE A RESPONSE