-ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని టిడిపి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.
-స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలువేసి నివాళులు అర్పించిన టిడిపి అధినేత
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన సమర యోధులకు నివాళి అర్పిద్దాం. హర్ ఘర్ తిరంగా ఒక మంచి పవిత్రమైన కార్యక్రమం. భారత దేశం ఎంతో గొప్ప పవిత్రమైన చరిత్ర కలిగిన దేశం. దేశానికి ఒక ఆదర్శమైన చరిత్ర ఉంది. ఇప్పుడు గర్వంగా జెండా చేతపట్టుకుని తిరుగుతున్నాం అంటే ఎందరో చేసిన త్యాగాలే కారణం. లక్షలాదిమంది వీరోచితంగా ప్రాణ త్యాగాలు చేయడంతో స్వాతంత్ర్యం సిద్ధించిది. వారి త్యాగాలను మనం నెమరువేసుకుంటుండాలి. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కొమరం భీం వరకు అందరినీ స్మరించుకోవాలి. ప్రతి భారతీయుడు గర్వంగా జెండా పట్టుకుని తిరిగాల్సిన సమయం ఇది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా…ప్రతి వారి గుండెలో జాతీయ భావం రావాలి. మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరముంది. ఆయన స్వాతంత్యం కోసం ఏమాత్రం అలుపెరుగక అవిశ్రాంతంగా పోరాడారు. స్వాతంత్యమే నా జన్మహక్కని రాజీలేని పోరాటం చేశారు. అందుకే ఆయన జాతిపిత అయ్యారు. ఆయనకు నివాళులర్పిద్దాం. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను కూడా తలచుకోవాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల ఫలితమే స్వాతంత్యం. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, కొమరం భీమ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటివారు ప్రాణ త్యాగాలు చేశారు. బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయారు. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడంతో స్వాతంత్యం వచ్చింది. వీరందరినీ స్మరించుకోవాలి. 75 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని సమీక్షించుకోవాలి. జాతికి పునరంకితం కావాల్సిన రోజు. రాజకీయాలు వదలి, ప్రాంత బేధాలు, కులమత బేధాలు వదలి గర్వంగా జెండా పట్టుకొని తిరగాలి.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. ప్రతి ఒకరి గుండెల్లో జాతీయ భావాలు రావాలి. దేశ భక్తి రావాలి. దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాదు….నేను దేశానికి ఏమి ఇచ్చాను అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అప్పుడే ఈ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ 75 ఏళ్లలో దేశం ఎన్నో విజయాలు సాధించింది. విదేశీయుల దాడులు, పాలన కారణంగా దేశం చాలా కోల్పోయింది. నాటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకు చేసిన పాలనను మనం గుర్తు చేసుకోవాలి. రాజకీయ నాయకులు ప్రభుత్వాలలో ఉండి తీసుకువచ్చే పాలసీలు ప్రజల జీవితాలను మార్చాలి. క్రీడల్లో విజయాలతో క్రీడాకారులు మన కీర్తి చాటుతూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారు. స్వాంతంత్ర్యం వచ్చిన తరువాత హరిత విప్లవం లాంటి అనేక విప్లవాలు వచ్చాయి. ఒకప్పుడు దేశంలో తిండి లేక ఆకలితో జనం చనిపోయారు. అలాంటిది ఇప్పుడు ప్రపంచానికే తిండి పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో వచ్చిన హరత విప్లవం, పాల విప్లవంతో పెనుమార్పులు వచ్చాయి. తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. దానికి మనమందరం గర్వపడుతున్నాం. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. స్వాతంత్యం సిద్దించడంలో తెలుగువారి పాత్ర అధికంగా ఉంది. స్వాతంత్ర్యానికి ముందు…తరువాత తెలుగు వారు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా…వచ్చే 25 ఏళ్లు ఏం చెయ్యాలి అనే లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి కావచ్చు…ఒక వ్యవస్థ కావొచ్చు….వచ్చే 25 ఏళ్లు ఏమి చెయ్యాలి అని నిర్ధిష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి. ఆశయ సాధన కోసం పనిచేయాలి. అప్పుడే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చ. పాలకులు తీసుకున్న నిర్ణయాలతో దేశంలో పెను మార్పులు వచ్చాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య విషయంలో మార్పులు వచ్చాయి. హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి అడ్రస్ గా ఉంది. దేశంలో ఉన్న యువశక్తిని ఉపయోగించుకుంటే దేశం అత్యున్నత స్థితికి చేరుతుంది. ఐటి రంగంలో, టెలికాం రంగంలో నాడు కీలక నిర్ణయాలు అమలు చేశాను. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉండడానికి నాడు చేసిన సంస్కరణలే కారణం. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చెయ్యాలి. ప్రపంచంలో అగ్రగామి చెయ్యాలి. ప్రాణ త్యాగాలు చేసిన సమర యోధుల కలలు నిజం చెయ్యాలి అంటే దేశం ఒక సంకల్పంతో పని చెయ్యాలి. విలువలతో కూడిన సమాజం ఆవిష్కృతం చెయ్యాలి. ఎంతో అభివృద్ది చెందినా ఇప్పటికీ పేదరికం ఉంది…నిరుద్యోగం ఉంది. ఆర్థిక అసమానతలను తొలగించే ఆర్థిక వ్యవస్థ రావాలి. పాలసీలు మార్చుకోవాలి. దేశంలో సంపద సృష్టించాలి. అందరికీ సమాన అవకాశాలు లభించేలా కార్యక్రమాలు చేపట్టాలి. రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…దీనికి చాలా బాధ పడాలి. ఆలోచించాలి. దేశానికి అన్నంపెట్టే రైతు కుటుంబానికి అన్నం పెట్టలేకపోతున్నాడు. దేశంలో 57 శాతం మంది రైతులు అప్పుల్లోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సరైన దిశగా ప్రయాణం సాగిస్తే రానున్న రోజుల్లో అమెరికా, చైనాల కంటే భారత దేశం ముందు ఉంటుంది. ఆ సామర్థ్యం దేశానికి ఉంది. రక్షణ రంగంలో మూడో స్థానంలో ఉన్నాం…..దేశానికి ఆహార ధాన్యాలు ఇవ్వగలుగుతున్నాం. దేశ రక్షణలో ఉన్న సైనికులను, ఇక్కడ మనం కోసం పని చేస్తున్న పోలీసులను గౌరవించుకోవాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవెయ్యాలి. జెండా ఎగురవెయ్యడం ద్వారా ప్రజల్లో ఒక స్ఫూర్తి రావాలి. తెలుగు దేశం దేశ అభివృద్దిలో భాగస్వామిగా ఉంది. టిడిపి ప్రభుత్వాలు తీసుకున్న పాలసీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. నాడు వాజ్ పేయి నా మాట మేరకు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ చేపట్టారు. దేశంలో రోడ్ కనెక్టివీకి ఇదే కారణం. మైక్రో ఇరిగేషన్ పై నాడు ఇచ్చిన సూచనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. దేశంలో నదుల అనుసంధానం జరగాలి. నీరు పుష్కలింగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక్క రోజున గోదావరిలో 300 టీఎంసీల నీరు సముద్రంపాలయ్యాయి. గంగ, గోదావరి, కావేరి నదులున్నాయి. ఈ నదులన్నింటిని అనుసంధానం చేయగలిగితే నీటి కొరత ఉండదు. రైతులకు సాగు నీటి కరువు పోవాలి.ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సివుంది. ఇవన్నీ పూర్తవ్వలంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి రావాలి. సమర్థత పెరగాలి. సంకల్పసిద్ధితో ముందుకు సాగాలి.