-స్వాతంత్ర్య ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి
-స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర తెలుసుకోవాలి
– ఎమ్మెల్సీ అశోక్ బాబు
స్వాతంత్ర్యోద్యమ నాయకుల త్యాగాలను నేటి తరం యువత, చిన్నారులు తెలుసుకోవాలని టీడీపీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అశోక్ బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పార్టీ కార్యాలయ సిబ్బందితో కలిసి అశోక్ బాబు ఆవిష్కరించి, అనంతరం మాట్లాడుతూ…ప్రపంచవ్యాప్తంగా ఉన్నభారతీయులంతా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని గుర్తుచేసుకుని, సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రస్తుత తరానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి మన పూర్వీకులు పడిన కష్టం గురించి తెలియని దుస్థితి దేశంలో ఉంది…ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి చెప్పే పరిస్థితి లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి, పింగళివెంకయ్య అనే పేర్లు మీడియాలో వార్తల రూపంలో రావడం వల్లనే నేటి తరాలు వారిగురించి తెలుసుకుంటున్నారు తప్ప, వారి త్యాగాలు తెలుసుకోలేకపోతున్నారని తెలిపారు.
జలియన్ వాలాబాగ్ ఘటనలో చనిపోయిన వారు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా వెయ్యి మంది ప్రాణాలొదిలారు..రెండు వేలమంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. భగత్ సింగ్ ను క్షమాపణ అడిగితే వదిలేస్తామని బ్రిటీషు వారు చెబితే, భగత్ సింగ్ తల వంచకుండా చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలొదిలాడని కొనియాడారు. పశ్చిమబెంగాల్ లో నీలిమందు తయారుచేయబోమని రైతులు తిరగబడితే, బ్రిటీషు వారు అక్కడి మహిళలను అర్థనగ్నంగా ఎండలో నిలబెట్టి వేధించినా, రైతులను హింసించినా మహిళలు సైతం తిరగబడి పంటను పండించడానికి నిరాకరించారని గుర్తుచేశారు. తాము ఏమి కోల్పోతున్నామనేదాని గురించి వాళ్లు ఆలోచించకుండా, దేశానికి స్వాతంత్ర్యం కావాలనే పట్టుదలతో మాన, ప్రాణాలను సైతం లెక్కచేకుండా త్యాగాలు చేశారని తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం అనేది ఎవరూ దోచుకోలేని ఆస్తి అని, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్న మనం దాన్ని కాపాడుకోవడంలోనూ దేశభక్తితో వ్యవహరించాలని కోరారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన వారి త్యగాలను మనం సరైన రీతిలో గౌరవించలేకపోతున్నామని, ఇప్పటికైనా మేల్కొని వారి త్యాగాలను గుర్తించి గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని, సంక్షేమాన్ని అమలు చేయడంలో పార్టీల విధానాలు, మార్గాలు వేరుగా ఉంటాయని తెలిపారు. సంక్షేమాన్ని అమలు చేయడంలో భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ మరే దేశంలోనూ ప్రపంచంలో లేదని వివరించారు. విదేశీ వస్తు బహిష్కరణ అని పిలుపునిచ్చిన సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని అనేక కుటుంబాలు విదేశీ వస్తువులను రోడ్డుమీద పడేసి తగులబెట్టి, ఒకటి రెండు జతలతో మనుగడ సాధించి తమ దేశభక్తిని చాటుకున్నారని, నేటి తరాలకు అటువంటి దేశభక్తి అలవడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పటి తరం వారికి ఉన్న దేశభక్తి నేటి తరాలకు ఎందుకు రావడంలేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని, మన వంతు ఈ దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను అధ్యయనం చేసి వారి నుండి స్ఫూర్తిని పొందాలని కాంక్షించారు. కేవలం జెండా వందనం చేసి, జనగణమన పాడి వెళ్లిపోతే దేశభక్తి కిందకు రాదని వెల్లడించారు.
స్వాతంత్ర్యోద్యమంలో సాయుధపోరాటాలు, హింసాయుత మార్గాలు ఏవీ సరైన ఫలితాలను ఇవ్వలేదు…కానీ గాంధీజీ అనుసరించిన శాంతియుత మార్గం సఫలీకృతం అయ్యిందని తెలిపారు. దేశం మొత్తాన్ని ఉద్యమంలోకి ఒకే తాటిమీదకు తీసుకువచ్చిన సిద్ధాంతం శాంతియుత సిద్ధాంతం మాత్రమేనన్నారు. దిండి ఉప్పు సత్యాగ్రహం సమయంలో పోలీసులు లాఠీలతో కొడుతున్నా, తలలు పగులకొడుతున్నా వందలాది ప్రజలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉప్పును తీసుకువచ్చి తమ దేశభక్తిని చాటుకున్నారని గుర్తుచేశారు. నేటికాలంలో ఒక దెబ్బకొట్టిన వ్యక్తిని పలురకాలుగా ఏ విధంగా ఇబ్బందులకు గురిచేయాలో ఆలోచిస్తున్న పరిస్థితులు నేడు ఉన్నాయి..ఈ తరహా ఆలోచనా విధానం సరికాదని వివరించారు. ఆహారం విలువకూడా నేటి తరానికి తెలియడం లేదని, ఆహారాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారని, పారవేస్తున్నారని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో వారంలో ఒక రోజు‘గురువారం’ దేశమంతా ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చి ఆహార కొరతను అధిగమించిన పరిస్థితులను నేటి తరాలు తెలుసుకోవాలని కోరారు. 75ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాలను చూస్తున్న నేటి ప్రజలు 100వ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ మహోత్సవాలను కూడా చూడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, ఎన్.ఆర్.ఐ విభాగం కో ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ మెంబర్ పోతుగంటి పీరయ్య, పరుచూరి కృష్ణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు.