– ‘కారు’తోనే కాంగ్రెస్ పయనం
– కేసీఆర్ పనైపోయింది
– కాంగ్రెస్ మునిగిపోయే నావ
– కాంగ్రెస్, కమ్యూనిస్టు క్యాడర్ బీజేపీవైపే
– మునుగోడు ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
– కనీవినీ ఎరగని రీతిలో 21న అమిత్ షా సభను సక్సెస్ చేద్దాం
– రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కమ్యూనిస్టు పార్టీలను ‘ఎర్ర గులాబీలు’గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని… ఆ పార్టీ నేతలే ఒకరికొకరు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయన్నారు. టీఆర్ఎస్ నియంత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ గెలుపుతో కేసీఆర్ అహంకారాన్ని అణగదొక్కాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశారని, ఈ నేపథ్యంలో భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ఈనెల 21న మునుగోడులో జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ క్రుషి చేయాలని కోరారు.
మధ్యాహ్నం రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్దనున్న ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరంవద్ద జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….
టిఆర్ఎస్ పార్టీ ‘అవినీతి, నియంతృత్వ, కుటుంబ’ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ. బహిరంగ సభకు ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా’ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు.. మునుగోడు సభను విజయవంతం చేద్దాం. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మనం ప్రజలను పిలిస్తే చాలు. ఇవాళ ఏ సర్వే చూసినా… బీజేపీకే పట్టం కడుతున్నాయి. సర్వేలపై ఆధారపడం… ప్రజలను మాత్రమే నమ్ముకుంటున్నాం.
మునుగోడు ఉప ఎన్నిక 2023 లో తెలంగాణలో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త మునుగోడు బహిరంగసభను విజయవంతం చేయడానికి నడుం బిగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను తేలిగ్గా తీసుకోవద్దు. పార్టీ భవిష్యత్‌కు ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త మునుగోడులో పార్టీ విజయం కోసం 24I7 పనిచేయాలి. పెద్దనాయకులు, చిన్ననాయకులు అన్న తారతమ్యం లేకుండా పోలింగ్‌బూత్ ఇన్‌ఛార్జ్‌గా సైతం పనిచేసి వారికి కేటాయించిన పోలింగ్ బూతుల్లో బిజెపి పార్టీకి మెజార్టీ తీసుకురావాల్సిందే.
తెలంగాణ సీఎం కెసిఆర్ గ్రాఫ్ పడిపోయింది. కెసిఆర్ ను ప్రజలు విశ్వసించడం లేదు. వికారాబాద్ సభే ఇందుకు నిదర్శనం. మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి తరలించినా… వికారాబాద్ లో జరిగిన కేసీఆర్ సభ ఫెయిల్ అయింది. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారు. మునుగోడులో ఎగిరేది కాషాయ జెండానే. మునుగోడు లో బీజేపీ vs trs యుద్ధం నడుస్తోంది. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు. ప్రజలకోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. రాజగోపాల్ రెడ్డి ని ప్రజలే గెలిపించుకుంటారు. ‘రాజగోపాల్ రెడ్డి రాజీనామా’ తోనే ‘గట్టుప్పల్’ మండలాన్ని ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నాము. పాదయాత్రలో ప్రజలు తండోపతండాలుగా… స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలు కలిసే మునుగోడు ఎన్నికలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. ఆ పార్టీలో లీడర్లంతా ఒకరికొకరు బహిరంగంగానే కొట్టుకుంటున్నారు. చివరికి కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ కూడా రాజీనామా చేశారు. పార్టీలో పద్దతిగా ఉండే మర్రి శశిధర్ రెడ్డి కూడా ఈరోజు పార్టీ అధ్యక్షుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే… కాంగ్రెస్ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇగ కమ్యూనిస్టుల విషయానికొస్తే…ఆ లీడర్లు ఎర్ర గులాబీలు. లీడర్లంతా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు. కేసీఆర్ ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారు. అందుకే విసిగిపోయిన కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజా సమస్యల కోసం టీఆర్ఎస్ పై పోరాడుతున్న బీజేపీ పక్షాన నిలుస్తున్నారు.
కాంగ్రెస్ లో కొట్లాటలను, టీఆర్ఎస్ కు అమ్ముడుపోతున్న తీరుతో ఆ పార్టీ క్యాడర్ సైతం బీజేపీతోనే ఉంది. గత జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు బీజేపీకే ఓటేశారు. రేపు మునుగోడు లోనూ అదే జరుగుతుంది. నిన్న వికారాబాద్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా అనలేదు.’మునుగోడు ఉప ఎన్నిక’ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక.
ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘బీజేపీ సిద్ధాంతాలు చాలా గొప్పవి. ఈ పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అహంకారం తలకెక్కింది. మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా కలవడు. ఈనె 21న జరిగే సభను మనమంతా కలిసి సక్సెస్ చేసి కేసీఆర్ అహంకారాన్ని అణిచివేద్దాం. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పుకు నాంది కావాలి’’ అని అన్నారు.