– మరో 10 లక్షల మందికి ఈ నెల నుండి పెన్షన్
-ముఖ్యమంత్రి కి వెయ్యి కార్ల తో భారీ స్వాగతం
– సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLC ప్రభాకర్ రావు, నగరానికి చెందిన MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి లతో జరిగిన సమావేశంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రహదారుల అభివృద్ధి, లింక్ రోడ్ల నిర్మాణం, ఫుట్ పాత్ ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతనంగా ప్లై ఓవర్ లు, అండర్ పాస్ లను నిర్మించినట్లు వివరించారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థులు, వృద్ధులు రోడ్లు దాటేందుకు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులతో హైదరాబాద్ నగరం ప్రముఖ నగరాలలో ఒకటిగా నిలిచిందని అన్నారు. మరో వైపు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నగరంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ
పథకాలు అందే విధంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఆసరా పెన్షన్ ల క్రింద ప్రభుత్వం ఇప్పటి వరకు 36 లక్షల మందికి ఆర్ధిక సహాయం అందిస్తుండగా, నూతనంగా మరో 10 లక్షల మందికి ఈ నెల నుండి పెన్షన్ లు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే అన్నారు.
. దేశం అబ్బురపడే విధంగా వజ్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయని, ఈ నెల22 వ తేదీన LB స్టేడియంలో నిర్వహించే ముగింపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న TRS ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారని, తమ ఇంటి పార్టీ గా భావించి ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ నెల 20 వ తేదీన మునుగోడు లో జరిగే సభకు హాజరయ్యే ముఖ్యమంత్రి కి వెయ్యి కార్ల తో భారీ స్వాగతం పలకనున్నట్లు తెలిపారు.