-దమ్ముంటే డిస్కంల బకాయిలపై శ్వేత పత్రం విడుదల చెయాలి
-సీఎం అనాలోచిత విధానాలే ఈ దుస్థితికి కారణం
-కేంద్రాన్ని బదనాం చేయడం వెనుక పెద్ద కుట్ర
-మునుగోడు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం
-రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయండి
-మునుగోడు ప్రజలు బీజేపీవైపే ఉన్నారు
-కాంగ్రెస్ పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
రాష్ట్రంలో మరోసారి కరెంట్ ఛార్జీల పెంచి ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ తీరువల్ల విద్యుత్ సంస్థలకు రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, తద్వారా కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ దుస్తితి నుండి బయటపడేసేందుకే కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్సేంజీల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే… డిస్కంలతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు ఎన్నెన్ని బకాయిలున్నాయనే అంశంపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జనగామ జిల్లా ఖిలాషపూర్ సమీపంలోని పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
సీఎం నిత్యం ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి జిమ్మిక్కులు. పవర్ ఎక్సేంజీల నుండి పవర్ కొనకుండా కేంద్రం నిషేధం విధించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నడు. కరెంట్ ఛార్జీలు పెంచి ఏటా రూ.6 వేల కోట్ల భారం ప్రజలపై మోపిండు. మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు సీఎం కుట్ర. అందులో భాగంగానే కేంద్రంపై దుష్ప్రచారం.
ఉచితానికి కేంద్రం వ్యతిరేకం కానేకాదు.. ఉచితం పేరుతో ప్రజలకు ఏ విధంగా నష్టం చేస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నారనే విషయాన్ని గుర్తించడం లేదు. కరెంట్ ఉమ్మడి జాబితా. ఇది మీ అయ్య జాగీరనుకుంటున్నవా? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానంటే వ్యతిరేకించలేదు. కానీ డిస్కంలకు కట్టాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించడం లేదు. డిస్కంలు ఇప్పటికే 60 వేల కోట్ల బకాయిలున్నయ్. దీంతో కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ దివాళా తీసినయ్.తద్వారా కరెంట్ ఉత్పత్తి సంస్థలు మూతపడి దేశమంతా అంధకారమయ్యే ప్రమాదముంది.
ఇయాళ ఒక చిట్టీ వేస్తాం.. కేసీఆర్ లాంటోడు చిట్టీ ముందే ఎత్తుకుంటడు.. ముంచతడు.. ఆ తరువాత ఇంకో దగ్గర చిట్టీ వేసి ఎత్తి వాళ్లను ముంచతుడు.. ఇయాళ రాష్ట్రంల కూడా అదే పరిస్థితి. డిస్కంలకు వేల కోట్ల బకాయి పెట్టిండు.. అవి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నయ్. అవి కట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల నుండి రూ.17 వేల కోట్లకుపైగా బకాయిలున్నయ్. ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల బకాయిలున్నయ్. పాతబస్తీ కరెంట్ బకాయిలు ఏటా వెయ్యికోట్లున్నయ్. 8 ఏళ్లలో 5 వేల కోట్లకుపైగా బకాయిలున్నయ్. ఉచిత కరెంట్ అంటూ… ఫాంహౌజ్ కు విపరీతమైన కరెంట్ వాడుతున్నవ్. ప్రభుత్వ శాఖలు వాడుకునే కరెంట్ కు డబ్బులియ్యడం లేదు. ఓల్డ్ సిటీ బకాయిలు వసూలు చేయవు. దీంతో ఆ భారమంతా ప్రజలపై పడుతోంది.
పవర్ ఎక్సేంజ్ వద్ద కరెంట్ కొనడమంటే షేర్ మార్కెట్ మాదిరిగానే… ఏ రోజుకారోజు ధరలు పెరగొచ్చు… తగ్గొచ్చు.. తద్వారా ప్రజలపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం డిస్కంల బకాయిలు చెల్లించాలి… ప్రజలపై భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో పవర్ ఎక్సేంజ్ ల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధం విధించింది.
ఇందులో తెలంగాణ ఒక్కటే కాదు.. మరో 13 రాష్ట్రాలున్నయ్. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నయ్… ఏపీ సహా మరో 5 రాష్ట్రాలు బకాయిలు చెల్లించామని రిపోర్ట్ పంపితే… వాళ్లకు బహిరంగ మార్కెట్లో కరెంట్ కొనే అవకాశాన్ని ఇచ్చాయి. మరి కేసీఆర్ ఎందుకు డిస్కంలకు కరెంట్ బకాయిలు చెల్లించరు.?
రాష్ట్ర ప్రభుత్వం 1350 కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్రానికి సమాచారం పంపితే అదే వెబ్ సైట్లో పెట్టారు. కానీ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు మాత్రం రూ.50 కోట్లు మాత్రమే బకాయి ఉందన్నడు. ఇగ మంత్రి అయితే అసలు ఒక్క రూపాయి కూడా బాకీ లేం… అంతా చెల్లించినట్లు మాట్లాడుతున్నడు.. ఇందులో ఏది వాస్తవం? వాళ్ల మాటల్లో పొంతనే లేదు.
కేసీఆర్ ది ఒకటే ఆలోచన… ఈ రాద్దాంతం చేసి మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచే కుట్రకు సిద్ధమైండు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపే కుట్ర ఉంది. విద్యుత్ సంస్థలను నమ్ముకుని 50 వేల మంది సిబ్బంది ఉన్నారు. గతంలో ఏటా ఒకటో తారీఖున జీతాలు చెల్లించేవారు.. ఇప్పుడు జీతాలు వస్తాయా? రావా? అనే పరిస్థితి. అధికారులతో అన్నీ అబద్దాలు చెప్పిస్తుండు… విద్యుత్ సంస్థలు పూర్తిగా మూతపడే దుస్తితి.
అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి బయటకు వెళ్లాలని ఆలోచిస్తున్నరు.బాయికాడ కరెంట్ ఫ్రీ…. ఇంటికాడ కరెంట్ బిల్లుల మోత… ఒక్కో ఇంటికి గతంలో వంద రూపాయల బిల్లు వస్తే.. ఇప్పుడు 200 దాటింది. మళ్లా కరెంట్ ఛార్జీలు పెంచితే.. అది వెయ్యి రూపాయలు దాటే ప్రమాదం ఉంది.రాష్రాన్ని ఏ విధంగా అభివ్రుద్ధి చేయాలనే ఆలోచనే లేదు. ఎంతసేపూ కేంద్రాన్ని ఎట్లా బదనాం చేయాలి? ఉచిత కరెంట్ కు కేంద్రం వ్యతిరేకం… అని దుష్ప్రచారం చేస్తున్నడు. ఒక కాగితం చూపి కరెంట్ ఇవ్వకుండా నిషేధం విధించారనే దుష్ర్పచారం చేస్తున్నడు.
దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలలో తెలంగాణ ర్యాకింగ్ ఎంత? జెన్ కోకు ఉన్న అప్పులెన్ని? సింగరేణి, ఎన్టీపీసీకి ఉన్న అప్పులెన్ని? విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రైవేటు సంస్థల వద్ద బకాయిలెన్ని? వీటన్నింటిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి. కేసీఆర్ ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు.. ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టడానికే దుష్ప్రచారం.కరెంట్ పై కోర్టుకు వెళుతున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… కోర్టుకు వెళితే కేంద్రం కూడా ఆధారాలతో సహా కోర్టు ముందుంచుతుంది. బకాయిల విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నయ్..
నరేంద్రమోదీకి ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేదు… తప్పు చేస్తే సరిదిద్దడమే . ఫ్రీ కరెంట్ ఇయ్యొద్దని ఎవరు చెప్పారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కచ్చితంగా ఉచిత కరెంట్ ఇవ్వాలనే చెప్పినం… మోటార్లకు మీటర్లు పెట్టాలని ఇన్నాళ్లు దుష్ర్పచారం చేసిండు. జనం నమ్మలే.. డిస్కంల బకాయిలు చెల్లించకపోవడంవల్ల మొత్తం కరెంట్ రాకుండా రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే దుస్థితి రాబోతోంది.
డిస్కంలకు బకాయిలివ్వడు.. ఆ డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కొన్న కరెంట్ కు డబ్బులివ్వడు.. అవి బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించలేక మూతపడే దుస్థితి.పవర్ ఎక్సేంజీల్లో అడ్డగోలు రేట్లు పెట్టి కరెంట్ కొంటే భారం ఎవరి మీద పడతది? ఇప్పటికే కరెంట్ ఛార్జీల బారం మోపి రూ.6 వేల కోట్ల భారం మోపిండు. మళ్లీ పెంచి మరో రూ.4 వేల కోట్ల భారం మోపబోతున్నడు. జనంపై భారం మోపితే చూస్తూ ఊరుకుందామా? కచ్చితంగా డిస్కంలకు బకాయిలు కట్టాల్సిందే… కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని కుట్రకు తెరలేపిండు. ప్రణాళిక లేకుండా ప్రజలపై భారం మోపే ఇలాంటి పార్టీలకు ఓట్లేయద్దని కోరుతున్నా…
మునుగోడులో రేపు జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను దిగ్విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నా.కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పాదాభివందనమే కాదు… పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ కు ఓటేయరు. ఈసారి మునుగోడు ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారు. కమ్యూనిస్టులు ఎంగిలి మెతుకుల కోసం కేసీఆర్ వద్ద మోకరిల్లారు. ఆ పార్టీ కార్యకర్తలే లీడర్లను ఛీ కొడుతున్నాయి. నా పాదయాత్రలో కమ్యూనిస్టు కార్యకర్తలు వచ్చి మద్దతిస్తున్నారు. మునుగోడులో ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని టీఆర్ఎస్ చూస్తోంది.