- హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. .న్యాయం మా పక్షానే ఉంది
- ప్రభుత్వ వేదికలపై కేసీఆర్ ప్రధానిపై రాజకీయ విమర్శలా?
- 8 ఏండ్లలో ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు స్పందించడం లేదు?
- మేం అభివ్రుద్ధిపై మాట్లాడుతుంటే మతతత్వ పార్టీ అంటూ విద్వేషాలు రగిలిస్తవా?
- మత విద్వేషాలు రగిలించి బీజేపీపై నెట్టే కుట్రకు కేసీఆర్ యత్నం
- సీతమ్మను కించపర్చిన మునావర్ ఫారుఖీని రప్పించడం అందులో భాగమే
- లిక్కర్ స్కాంలో నీ కుటుంబ పాత్రపై తెలంగాణ ప్రజలు తలదించుకునే స్థితి
- దాసోజుతో మాట్లాడిన నా వ్యాఖ్యలను టీఆర్ఎస్, కాంగ్రెస్ వక్రీకరించి ట్రోల్ చేస్తున్నాయి
- దమ్ముంటే ఆ రెండు పార్టీల నేతలు ఆ వీడియోను పూర్తిగా బయటపెట్టాలి
- ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో కుటుంబ సభ్యుల పాత్రపై దేశమంతా చర్చ జరుగుతుంటే తెలంగాణ సమాజమంతా తలదించుకునే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై చర్చను దారి మళ్లించేందుకే మత కల్లోలాలు స్రుష్టించి ఆ నెపాన్ని బీజేపీ పై నెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజా సమస్యలపైనా, 8 ఏండ్లలో కేంద్రం ఇచ్చిన నిధులపైనా మాట్లాడుతుంటే… కేసీఆర్ మాత్రం దానిపై మాట్లాకుండా ఎంఐఎంతో మత విద్వేషాలు రెచ్చగొట్టడం సిగ్గు చేటన్నారు.
అందులో భాగంగానే సీతమ్మ వారిని కించపరుస్తున్న మునావర్ ఫారుఖీ అనే కమెడియన్ ను హైదరాబాద్ కు రప్పించి మత విద్వేషాలకు తెరదీశాడన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే 8 ఏండ్ల పాలనలో చేసిన అభివ్రుద్ధి ఏమిటో చెప్పాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ సిగ్గు లేకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.
సాయంత్రం హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, ఎర్రం మహేష్ తదితరులతో కలిసి మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం కుట్ర చేసింది. మాకు కోర్టులపై నమ్మకం ఉంది. న్యాయం ఎప్పటికైనా గెలుస్తందనే నమ్మకంతోనే కోర్టును ఆశ్రయించాం. గౌరవ న్యాయ స్థానం మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. పాదయాత్రను వెంటనే ప్రారంభిస్తాం. దీనిపై పాదయాత్ర ప్రముఖ్ ప్రకటన చేస్తారు. సీఎం చేసిన నీక్రుష్టమైన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.
ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవంలో కేంద్రంపైన, బీజేపీపైన కేసీఆర్ ఇష్టానుసారంగా నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నరు.ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అధికారులంతా కూర్చున్నచోట మీ పాలనలో జరిగిన అభివృద్ధి చేసినవో చెప్పాలి… లేకుంటే నాకు చేతగాలేదు.. చేతులు ముడుచుకుని ఫాంహౌజ్ లో పడుకున్న విషయాన్ని చెప్పాలి.
కానీ అందుకు భిన్నంగా దేశ ప్రధానిపైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ రాజకీయ వేదికగా మారుస్తావా?ప్రగతి భవన్ నుండే రాజకీయ విమర్శలు చేయకూడదు. అవసరమనుకుంటే తెలంగాణ భవన్ వెళ్లి రాజకీయ విమర్శలు చేయాలి.ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న తప్పిదాలు.. అధికారులు చేస్తున్న పొరపాటు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా..
కేసీఆర్ రంగారెడ్డి సభలో చెప్పిన మాటలన్నీ కోతలే.. నువ్వు ప్రసంగిస్తున్నసమయంలోనే జనం సభ నుండి లేచిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. చివరకు బఠానీ అమ్ముకునే ఆవిడకు గిరాకీ లేకుండా పోయింది. 8 ఏండ్లలో తెలంగాణలో చేసిన అభివ్రుధ్ధి ఏంది? రంగారెడ్డి జిల్లాకు ఒరగబెట్టిందో ఏమిటో స్పష్టం చేయాలి.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 20 శాతం కూడా పూర్తి కాలేదు. దానికి కారణం ఎవరు ప్రధాని గారా? నువ్వు?
ఆ ప్రాంతంలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్.. ఎంత మందికి పెన్షన్లు ఇచ్చినవ్? రేషన్ కార్డులు ఇచ్చినవో సమాధానం చెప్పాలి….మేం ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఏ నియోజకవర్గానికి వెళ్లినా కేంద్రం గత 8 ఏండ్లలో ఆ నియోజకవర్గానికి ఎన్ని నిధులిచ్చిందో స్పష్టంగా వివరిస్తున్నాం.
మరి నువ్వు ఏ జిల్లాకు పోతే… ఆ జిల్లాకు ఎన్ని హామీలిచ్చావో.. అందులో ఎన్ని అమలు చేశావు? ఎన్ని నిధులు ఖర్చు పెట్టావో చెప్పగలవా?…నువ్వు ఏ పని చేయలేదు కాబట్టే మళ్లీ మోసపు మాటలు చెబుతున్నవ్..నిజాయితీగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లయితే లబ్దిదారుల లిస్ట్ విడుదల చెయ్… అట్లాగే కేంద్రం ఇండ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించే దమ్ముందా? దళిత బంధు ఎందుకిస్తలేవ్? నీ కార్యకర్తలకు తప్ప ఎవరికైనా ఇచ్చినవా?
మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్న మాట్లాడుతున్న నీకు… మూసీ నీళ్లను పంపిన. స్నానం చేసినవా? మిషన్ భగీరథ నీళ్లు కూడా బాటిల్ లో పట్ట పంపిస్తా… తాగే దమ్ముందా? నువ్వు తాగతానని ప్రకటిస్తే … మిషన్ భగీరథ గొప్పదని చెబుతా… మిషన్ భగీరథ వెనుక పైపుల దందా ఎవరిదో తెల్వదా? కృష్ణా జలాల విషయంలో మొట్టమొదట ద్రోహం చేసింది దక్షిణ తెలంగాణకే …అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేసిన. క్రిష్ణా పరివాహక ప్రాంతం 68 శాతం ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం 575 టీఎంసీల నీళ్లు రావాలె.. కానీ నువ్వేం చేసినవ్.. అప్పటి ఏపీ సీఎంతో కుమ్మక్కై 299 టీఎంసీల వాటాకే ఒప్పుకుని అగ్రిమెంట్ పై సంతకం పెట్టింది నువ్వు కాదా? ఆ తరువాత మూడు నాలుగు సార్లు జరిగిన అపెక్స్ సమావేశంలోనూ ఏనాడూ ఈ అంశంపై ఎందుకు నోరు విప్పలేదు? నేను దీనిపై గట్టిగా నిలదీస్తే.. స్పందిస్తవా?
పోనీ ఒప్పుకున్న 299 టీఎంసీల నీటినైనా పూర్తిగా వాడుకున్నావా? లేదే…. పైగా మాకు అన్యాయం జరుగుతోందంటూ లేఖలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తవా? గత ఏడేళ్లుగా కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని పదేపదే లేఖలు రాస్తే…నాన్చి నాన్చి ఇటీవల ఉఫసంహరించుకున్న విషయం వాస్తవం కాదా? మేం అభివ్రుద్ది గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటూ మత విద్వేషాలు రగిలిస్తూ బీజేపీపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడైనా మత కల్లోలాలు జరిగాయా? బీజేపీ పేరు చెప్పి మత ఘర్షణలకు పాల్పడే కుట్రకు టీఆర్ఎస్ తెరదీసింది.
హైదరాబాద్ పాతబస్తీలో మత ఘర్షణలకు కుట్ర. మునావర్ ఫారుఖీ దేశభక్తుడా? సీతమ్మ వారిని కించపర్చిన మునావర్ ఫారుఖీ అనే కమెడియన్ ను తెలంగాణ కమెడియన్ కేసీఆర్ ఎందుకు అనుమతిచ్చినవ్. ఈ సమయంలో ఆయనను పిలిపించడంలో ఆంతర్యమేంది? కుహానా సెక్యూలర్ వాదులు ఎందుకు స్పందించడం లేదు? ఆయన షోకు 500 మంది వస్తే 2 వేల మంది పోలీసుల భద్రత కల్పించాల్సిన అవసరం ఏంది? బ్రిటీష్ టోపీ పెట్టి యాక్టింగ్ చేస్తున్న కేసీఆర్ జోకర్ ను తలపిస్తున్నడు.
లిక్కర్ స్కాంలో నీ కుటుంబ పాత్రపై జరుగుతున్న చర్చను చూసి తెలంగాణ సమాజం తల దించుకుంటోంది. దీనిపై ఎందుకు నోరు విప్పడం లేదు? లిక్కర్ స్కాం నుండి దారి మళ్లించేందుకు మునావర్ ఫారూఖ్ ను పిలిపించి మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కేసీఆర్ పని. ఈ ఘర్షణలకు కారణం బీజేపీ అంటూ మా పై నెట్టే కుట్రకు తెరదీయడం సిగ్గు చేటు. కేసీఆర్ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మత ఘర్షణలు స్రుష్టించి ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నడు. మేం అభివ్రుద్ధి గురించి మాట్లాడితే నువ్వు మతం గురించి రెచ్చగొడతవా? మేం మతం గురించి చర్చకు రాలేదు.. అభివ్రుధ్ధి గురించి చర్చకు సిద్దమా?
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే తెలంగాణలో మత ఘర్షణలకు కుట్ర చేస్తే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్న సమయంలో కూడా ఎక్కడా మత ఘర్షణలు జరగలేదు.. మరి ఇప్పుడెందుకు పాతబస్తీలో మత ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలి. ప్రజలు పిడికిలి బిగించే ఉన్నరు.. కవులు, మేధావులతోపాటు కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి టీఆర్ఎస్ పాలనను బొంద పెట్టేందుకు రడీగా ఉన్నరు. ఇకనైనా కేసీఆర్ మత చాందసవాదంతో తెలంగాణలో అల్లర్లు స్రుష్టించే ప్రయత్నం చేయొద్దు.. తెలంగాణ ప్రజలు అభివ్రుద్ది కోరుకుంటున్నరు. వాతావరణం టీఆర్ఎస్ కు అనుకూలంగా లేదని మత ఘర్షణలు స్రుష్టించేందుకు చేస్తున్న కుట్రలను కేసీఆర్ ఇకనైనా ఆపాలి.
తెలంగాణ ప్రజలారా… సంయమనం పాటించండి. వాస్తవాలను గమనించండి. కేసీఆర్ కుటుంబ కుట్రలో బలికాకండి. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మతతత్వ పార్టీలు. వాళ్లే మత విద్వేషాలు రగిలిస్తున్నారు.
ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరగబోతోంది. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అథిగా రాబోతున్నరు. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నా…
మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ… నేను బిస్తర్ సర్దుకుని పాదయాత్రకు రావాలని యువతకు నేను పిలుపునిస్తే.. పిస్తోల్ తీసుకుని రావాలన్నట్లుగా టీఆర్ఎస్ దుష్ప్చచారం చేస్తున్నరు.
నేను దాసోజు శ్రవణ్ తో మాట్లాడిన మాటలను దమ్ముంటే పూర్తిగా బయటపెట్టాలి. నా మాటలను వక్రీకరించి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ట్రోలింగ్ చేస్తున్నయ్. టీఆర్ఎస్ చేసిన ట్వీట్లను కాంగ్రెస్ ట్వీట్ చేస్తుంది. రెండు పార్టీలు ఒక్కటే.. ఈ రెండు పార్టీలు మూర్ఖులు… దయచేసి ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..