అది మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గ్రామంలోని 17వ వీధి. అక్కడ వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. దానితో పాటు వృద్ధుల సంఖ్య ఎక్కువ. ఆ రోడ్డు లోపల అడుగుపెట్టాలంటే అదొక యజ్ఞం. ఎందుకంటే అసలక్కడ రోడ్డు లేదు. అంతా బురద. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. మాకు రోడ్డు వేయండి మహాప్రభో.. మా వీధిలోకి గ్యాస్ బండి కూడా రావడం లేదు. ఆటోలు మేము రామని చెబుతున్నారు. రోజూ ద్విచక్రవాహనాలపై వెళుతున్న మాకు యాక్సిడెంట్లు అవుతున్నాయంటూ.. ఆ వీధి ప్రజలు గ్రామ పంచాయితీ ఆఫీసు, కార్పొరేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కు లేదు. వారిచ్చిన అప్లికేషన్లు ఏ చెత్తబుట్టలో సుఖనిద్రపోతున్నాయో ఎవరికీ తెలియదు.
దీనితో ఆ వీధి ప్రజలంతా చివరి ప్రయత్నంగా టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తమ గోడు వినిపించుకున్నారు. అదేంటీ.. మంగళగిరి ప్రజలు గెలిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లకుండా, విపక్ష నేత గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన లోకేష్ దగ్గరకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది కదా? కట్టకట్టుకుని తన దగ్గరకు వచ్చిన ఆ జనాలను.. మీరు నాకు ఓటు వేయలేదు కదా? ఓటేసి గెలిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల దగ్గరకే వెళ్లమని సగటు రాజకీయ నాయకుడిలా మాట్లాడకుండా.. వచ్చిన వారికి టీ, బిస్కెట్లు ఇచ్చి వినతిని తీసుకున్నారు.
అక్కడ రోడ్డు లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ‘నేను మాట్లాడతా’నమ్మా నని వారికి హామీ ఇచ్చి పంపేసిన లోకేష్.. ఇంజనీరు,కాంట్రాక్టరును పిలిపించడం, ఆ రోడ్డుకు ఎస్టిమేట్ వేయించడం, తన సొంత ఖర్చుతో రోడ్డు వేయించడం చకచకా జరిగిపోయాయి. దీనితో ఆశ్చర్యపోవడం జనం వంతయింది. తనను ఓడించిన ప్రజలపై కక్ష కడుతున్న నేటి ఆధునిక కాలంలో, తనను ఓడించిన ప్రజల కోసం సొంత సొమ్ముతో రోడ్డు వేయించడాన్ని మంగళగిరి ప్రజలు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.