వేడెక్కుతున్న తిరుపతి రాజకీయం

– పట్టు బిగిస్తున్న వై ఎస్ ఆర్ సి పి
– ఉనికి కోల్పోకుండా జన సేన తంటాలు
– సరైన వ్యక్తి కోసం టి డి పి అన్వేషణ
– బలిజ సామాజిక వర్గం నుంచి టికెట్ కోసం కొత్త బేహారులు
( భాను)

తిరుపతి : రెండేళ్ళ తర్వాత 2024 లో జరగాల్సిన ఎన్నికలు ఏడాది ముందే జరిగినా, ఎదుర్కోవటానికి సిద్దం గా ప్రముఖ అధ్యాత్మిక, పర్యాటక కేంద్రం తిరుపతి లో అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. గత మూడేళ్ళు గా స్తబ్దుగా ఉన్న ప్రధాన ప్రతి పక్ష పార్టీలన్ని, ఇప్పుడిప్పుడే ఏదో ఒక సమస్య పై ఆందోళనలు చేస్తూ ప్రజల కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంబించాయి . ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒక రోజు పూర్తి గా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునే, “ ప్రజావాణి “ కార్యక్రమం నిర్వహించారు, అంతకు ముందు తిరుపతి లో పార్టీ పరిస్థితి పై స్థానిక నాయకత్వం తో సమీక్ష నిర్వహించారు.

ప్రధానంగా అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి , ఆయన కుమారుడు- తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, నగరం లోని 50 వార్డ్ ల్లో ఎన్నికలు బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్ బలోపేతం చేయటం పై కేంద్రీకరించారు.

నగరం లో అన్ని వార్డుల్లో తిరుగుతూ , స్థానిక పార్టీ కార్యాలయాలకు వెళ్తూ స్థానికంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులతో టచ్ లో ఉన్నారు. డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి ఈ పని ఒక క్రమపద్దతి లో తీసుకెళ్తున్నారు. నగరం లో అన్ని వార్డుల్లో ఒక్క వార్డు మినహా, అన్ని వార్డుల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన కలిసి వచ్చే అంశం. అలాగే తిరుపతి టౌన్ బ్యాంక్ లో, మొత్తం పాలక వర్గ డైరెక్టర్ పోస్ట్ లు గెల్చుకుని మంచి జోష్ మీద ఉన్నారు. ఇదే ఊపు ముందస్తు ఎన్నికల్లో కూడా చూపాలని సన్నద్ధమవుతున్నారు.

సరైన అభ్యర్థి కోసం టి డి పి అన్వేషణ
అధికారం లో ఉన్నప్పుడు గుంపులు గుంపులు గా టి డి పి అని.. పసుపు చొక్కాలు వేసుకుని హడావుడి చేసిన నేతలు ఎవరూ, ఇప్పుడు బయట కనబడటం లేదు. అధికారం లో ఉన్నప్పుడు, తిరుపతి నగరం లో హడావుడి చేసే చంద్ర బాబు నాయుడు సామాజిక వర్గం నాయకులు కూడా, ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరం గా ఉంటున్నారు.

మాజీ ఎమెల్యే సుగుణమ్మ, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నరసింహయదవ్, కార్పొరేటర్ ఆర్ సి ముని క్రిష్ణ , శ్రీధర్ వర్మ వంటి సెకండరీ నాయకులు మినహా, వై ఎస్ ఆర్ సి పి పార్టీ ని ధీటుగా ఎదుర్కోగల నాయకుడు తిరుపతి లో లేరు. నేరుగా చెప్పాలంటే సరైన మాస్ లీడర్ ఎవరు తిరుపతి లో, టి డి పీ కి భూతద్దం వేసి వెతికినా కనిపించటం లేదు. ప్రస్తుతం ఆ తరహా వ్యక్తులు , అర్ధబలం , అంగబలం ఉన్న వారి కోసం టి డి పి అధిష్టానం వెతుకుతున్నది. ముందస్తు ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఎదుర్కొనే పరిస్థితి లో ప్రతిపక్ష తెలుగుదేశం లేదు.

వచ్చే ఎన్నికల్లో టి డి పి నుంచి, అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొని కేడర్ ను, నాయకులను నడిపించగల మాస్ లీడర్ , అర్థబలం , అంగబలం కలిగిన వ్యక్తి కోసం బలిజ సామాజిక వర్గం నుంచి పరిశీలిస్తున్నారు. మాజీ ఎం ఎల్ ఎ సుగుణమ్మ కే , వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. టి డి పి లో ని మరో వర్గం మాత్రం.. కొత్త వారి కి , అది బలిజ సామాజిక వర్గం కి ఇస్తారని పేర్కొంటున్నారు. అయితే అధినేత చంద్రబాబు మది లో, తిరుపతి టికెట్ కి సంబంధించి ఎవరు ఉన్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

పార్టీ నిర్మాణం లేని…జనసేన
టి డి పి తో లేదా బి జె పి తో ఎన్నికల పొత్తు కుదిరి తే , తిరుపతి సీట్ నుంచి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంఎల్ఎ గా పోటీ చేయాల్సిందిగా కోరేందుకు స్థానిక నాయకులు ఆలోచనలో ఉన్నారు. అయితే తిరుపతి లో కేవలం కొందరు సెకండరీ లీడర్షిప్ తప్ప , పార్టీ కమిటిలు గానీ, వార్డ్ స్థాయిలో పార్టీ నిర్మాణం గాని లేవు. మీడియా లో అధికారపార్టీ పై విమర్శలు గుప్పించటం మినహా, నిర్దిష్టం గా ప్రజా సమస్యల పై పనిచేయటం లేదన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్ నాయకత్వం లేకపోవటం, ఎక్కువ గా యువత సినిమా ఆకర్షణ , అలాగే పవన్ కళ్యాణ్ సామాజికవర్గ ఓటు బ్యాంకు, తమను వచ్చే ఎన్నికల్లో గట్టేక్కిస్తుందన్న ఆలోచలనలో తిరుపతి జనసేన నాయకత్వం ఉన్నారు.

టి డి పి , జనసేన పార్టీ ల నుంచి ఈసారి తమకు ఎం ఎల్ ఎ టికెట్ కి అవకాశం ఉంటుందని కొందరు బలిజ సామాజిక వర్గం పెద్దలు ఆశ పెట్టుకుని ఉన్నారు. గతం లో టి డి పి లో పనిచేసి బయట కి వెళ్ళిన ఓక వ్యాపార వేత్త , తిరిగి టి డి పి లో చేరి తిరుపతి ఎం ఎల్ ఎ టికెట్ కి తనకన్నా అర్హులు లేరని , సమయం చూసి పార్టీ లో తిరిగి ప్రవేశించి, టికెట్ కి పోటి పడాలని , మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.

అలాగే మరొక ఫైనాన్స్ వ్యాపారి, తనకు యువత లో పట్టు ఉందని.. టికెట్ ఇస్తే ఎం ఎల్ ఎ గా పోటీ చేసేందుకు సిద్దమని అధిష్టానం దృష్టి లో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరు కాకుండా గతం లో పి ఆర్ పి లో చురుకుగా ఉండి, ఆ తరువాత టి డి పి కండువా కప్పుకున్న ఓ బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా, తన సామాజిక వర్గం ముఖ్యులతో సమావేశం అయి, వచ్చే ఎన్నికల్లో టి డి పి ఎం ఎల్ ఎ టికెట్ వస్తే తన గెలుపుకు కృషి చేయాలని కోరినట్లు సమాచారం.

Leave a Reply