Home » ఒక నాయుడు… పది తలలు..!

ఒక నాయుడు… పది తలలు..!

చంద్రబాబునాయుడు
ఏడక్షరాల పేరు

పది తలలు అంటే ఆయన రావణుడా?
కాదు…

ఓ సమస్య ఎదురైతే దాని పరిష్కారం కోసం అవసరమైతే దశావతారం ఎత్తగలిగిన ధీశాలి.

చంద్రబాబు అంటే…
ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు…

75 సంవత్సరాలు
45 సంవత్సరాల రాజకీయ అనుభవం
14 ఏళ్లు ముఖ్యమంత్రి
15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడు
ఉన్నత విద్యావేత్త
సమున్నత రాజకీయ వేత్త
విజనరీ
అపర చాణుక్యుడు
అనితర సాధ్యుడు
రాజనీతిలో ఆరితేరినవాడు
పని రాక్షసుడు
హైటెక్ ముఖ్యమంత్రి
హైదరాబాద్ అభివృద్ధి ప్రధాత
అమరావతి రూపశిల్పి
ఇవీ…
ఆయన గురించి జనం చెప్పుకొనే కబుర్లు

అయితే ఇక్కడో సందేహం… చంద్రబాబు అంటే ఇంతేనా?
ఇంకా ఏమైనా వుందా?

ఆయన గురించి పూర్తిగా తెలిసిన వారు, ఆయన్ని దగ్గర నుండి గమనించిన వారు అనుకొనే మాటలు చాలా ఉంటాయ్…

చంద్రబాబు అసలు మానవ మాత్రుడా?
లేక…
ఆయనకు అతీంద్రియ శక్తులేమైనా ఉన్నాయా?

2024 మే నెలలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఓ వైవు చండ్ర నిప్పులు చెరుగుతుంటే…
ఇంకో వైపు చంద్రబాబు గండ్ర గొడ్డలిలా కదన రంగంలో సాగుతున్నారు.
గుక్క తిప్పుకోకుండా ఆయన ఉపన్యసిస్తుంటే, చూపు మరల్చకుండా ఆయన్నే గమనిస్తూ లక్షలాది ప్రజలు.

రాష్ట్ర సమస్యలపై ఆయనకున్న అవగాహన, ప్రతీ అంశంపైనా సమగ్రమైన వివరణ ఇస్తూ సాగే బాబు ప్రసంగానికి ఫిదా అవ్వని వారుండరు.

శత్రులను ఎదుర్కోవడంలోనూ అదే సత్తా చూపడం ఆయనకే సాధ్యం!

ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్ లో పెట్టినప్పుడు బాబు పనైపోయిందని, ఇంకెంతో కాలం ఉండడని, ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించదని శత్రువులు కథలు కథలుగా చెప్పుకున్నారు.
ఈ వయసులో బాబు మళ్ళీ తేరుకోవడం కస్టమేనని సాక్షాత్తూ స్వంత పార్టీ వారే చెప్పుకున్నారు. జైలు నుండి విడుదలైన చంద్రన్నను చూసి జనం కొట్టిన జేజేలు చూసి నిఖిల ప్రపంచం నివ్వెరపోయింది.
అంటే భయంకరమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ (నిర్దోషిగా నిరూపణ కాకముందే) కేవలం బెయిల్ ఫై విడుదలైన ఆయనకు ఆ స్థాయిలో ఆదరణ లభించడం ఏంటి?
ఇదే చంద్రబాబుకున్న క్రెడిబులిటీ అంటే!
ఆయన జైలులో ఉండగానే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఆయనకు మద్దతుగా నిర్వహించిన మీటింగ్ సంచలనం సృష్టించింది.
వేలాది ఐటీ రంగ నిపుణులు, ప్రముఖులు ఆ సమావేశానికి తరలి వచ్చి సంఘీభావం ప్రకటించిన వైనం సాధారణ విషయం మాత్రం కాదు!
ఆ నేపథ్యంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, హైదరాబాద్ అంటే అదేదో తమ స్వంత జాగీరన్నట్టుగా ప్రవర్తించిన గులాబీ గుంపు అనతి కాలానికే అక్కడ దుకాణం మూసేయడం గమనించదగ్గ అంశం!

కట్ చేస్తే…

అదే ఉత్సాహం
అదే తెగువ
అదే పట్టుదల

ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఆయనే…

ఉదయం అనంతపురంలో ఉంటే
మధ్యాహ్నం విజయవాడ
సాయంత్రం శ్రీకాకుళం…

మళ్ళీ రాత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. నేతలతో అర్ధరాత్రి వరకూ సమీక్షలు…
తెల్లవారగానే మళ్ళీ ప్రజల్లోకి…

ఎప్పుడూ చిన్న జ్వరం కానీ, జలుబు కారణంగా కానీ ప్రచారం వాయిదా పడిన దాఖలాలు లేకపోవడం మానవ మాత్రులకు సాధ్యమా?

ఇతర నేతలను గమనిస్తే…
గట్టిగా నాలుగు మాటలు మాట్లాడితే గొంతు నొప్పి…

ఓ ఫర్లాంగ్ దూరం నడిస్తే చాలు కాళ్ళు సాగిలపడి కళ్ళు భైర్లు కమ్ముతాయి.

ప్రచారం ప్రారంభించిన రెండు రోజులకే జ్వరం కారణంగా షెడ్యూల్లో మార్పులు…
ఎందుకిలా అంటే…
పాపం ఏసీ గదులకు అలవాటు పడిన జీవితం. ఒక్కసారే ఇలా తిరగాలంటే అలవాటు ఉండాలి కదా? అంటారు సదరు నేతల అభిమానులు.

ఇక్కడే ఓ వాస్తవం చెప్పుకోవాలి.
చంద్రబాబుకు ఏ లోటూ లేదు. చంద్రబాబు తలుచుకుంటే చంద్రమండలంలో కాపురం పెట్టగలరు. ఆయనకు సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
అయినప్పటికీ ఆయన నిరంతరం జనంలో ఉండేందుకే ఇష్టపడతారు.
ఆయన జనంతో మమేకం అవుతారు.
అవును
జనమే ఆయన బలం… జనమే ఆయన బలహీనత కూడా..!

బాబు అవసరమా?
ఆయనకు రాజకీయాలు అవసరమా?
ఆల్రెడీ బాబుకు వయసైపోయింది కదా? అని కొందరు…
ఆయనకు 75 సంవత్సరాలొచ్చాయి. ఇక ఇదే చివరి ఛాన్స్ కావొచ్చేమో అని మరికొందరు అంటున్నారు.

పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కరుణానిది తన 95 సంవత్సరాల వయస్సులోనూ ముఖ్యమంత్రి గా పాలించారు కదా? అంటున్నారు బాబు భక్తులు!
అవును ఆంధ్రప్రదేశ్ లాంటి అస్తవ్యస్థ రాష్ట్రానికి బాబు అవసరం వుంది.

నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి… స్వర్ణాంధ్ర సాధకుడవై ముందుకు నడవాలి… అంటున్నారు ఆయన అభిమానులు.

బాబు మళ్ళీ రావాలి.
వస్తారని ఆశిద్దాం!

– శ్రీనివాస్ కృష్ణ దుద్దుపూడి
సీనియర్ జర్నలిస్ట్
రాజమహేంద్రవరం

Leave a Reply