Home » అవును.. అవి కనిపెట్టింది మన మేధావి జగనన్నే!

అవును.. అవి కనిపెట్టింది మన మేధావి జగనన్నే!

– థాంక్యూ కాదు… గుడ్ బై చెప్పాల్సిన సమయం
-జగన్‌ సార్ చేతిలో ‘ఇస్రో’ లేదు
-ఉంటే ‘వైసీపి ఉపగ్రహాలు’ తయారు

ఆంధ్రప్రదేశ్‌కి జగన్‌ అనే ఓ మహా మేధావి లభించడంతో కేవలం 5 ఏళ్ళలో రాష్ట్రం దశ, దిశ తిరిగిపోయాయి. మన మేధావి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఏడాది ముగింపు సమయంలో ఆ ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి చెప్పుకున్నట్లే సరిగ్గా మరో నెల రోజులలలో పదవిలో నుంచి దిగిపోబోతున్న మన మేధావి గురించి కూడా నాలుగు ముక్కలు చెప్పుకోవడం సబబే.యావత్ భారతదేశానికి ఢిల్లీ ఒక్కటే రాజధాని. కానీ దానిలో భాగమైన, రాష్ట్ర విభజన తర్వాత భౌగోళికంగా, జనాభా, ఆర్ధిక వనరులు, ఆదాయం పరంగా సగానికి తగ్గిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు మూడు రాజధానులు చాలా అవసరమని కనిపెట్టింది మన జగన్మోహన్‌ రెడ్డే. కానీ 5 ఏళ్ళ పాలన తర్వాత రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన క్రెడిట్ కూడా పూర్తిగా ఆయనదే.

భారత్‌కు స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలయ్యింది. ఈ సుదీర్గ కాలంలో దేశాన్ని పాలించినవారందరూ దేశాభివృద్ధి ద్వారానే దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్య వంటివి సమసిపోతాయని గట్టిగా నమ్మి ఆ దిశలో కృషి చేశారు. అందువల్లే నేడు భారత్‌ అగ్రదేశాల సరసన నిలబడగలిగే స్థాయికి ఎదిగింది.కానీ వారెవరూ కలలో కూడా ఊహించలేని కొత్త విషయాన్ని మన జగన్‌ సార్ కనిపెట్టి చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించడం, వాటితో ఉద్యోగాలు కల్పించడం కోసం నానా తిప్పలు పడటం కంటే, సంక్షేమ పధకాల ద్వారా జనాలకు డబ్బు పంచిపెడితే పేదరికం సమసిపోతుందని, దాంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గణనీయంగా అభివృద్ధి చెందుతుందని కనిపెట్టారు.

ఈ విధానాన్ని చాలా నిబద్దతతో అమలు చేస్తున్నారు కూడా. కానీ గిట్టనివారు ఆయన ఆలోచనలను అర్దం చేసుకోలేకపోతున్నారు అంతే!రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగోలేదని కనిపెట్టింది… దానిని ప్రక్షాళన పేరుతో అల్లకల్లోలం చేసిన క్రెడిట్ కూడా మన సారుదే!

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌, ఉద్యోగుల భవిష్యత్‌ రెంటినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు ‘జిపిఎస్’ ఫిట్ చేయాలనే గొప్ప ఆలోచన వచ్చింది మన సారుకే.

రాష్ట్రంలో మునిసిపల్, రెవెన్యూ, పంచాయితీరాజ్ మూడు శాఖలు, వాటిలో లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు పనిచేస్తుండగా, వాటికి సమాంతరంగా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను సృష్టించిన మహా మేధావి మన సారే!

ఇప్పుడు ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ కనిపెట్టింది మన సిఎం సారే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

అదృష్టవశాత్తు జగన్‌ సార్ చేతిలో ‘ఇస్రో’ లేదు. ఉండి ఉంటే దానిని కూడా ప్రక్షాళన చేసి ‘వైసీపి ఉపగ్రహాలు’ తయారు చేయించేవారేమో?

ఇదివరకు మేధావులైన పలువురు శాస్త్రవేత్తల గొప్పదనాన్ని ఈ ప్రపంచం గుర్తించలేక వారిని నానా మాటలు అంది. ఆ తర్వాత వారు మహా మేధావులని లోకం గుర్తించి కీర్తించడం మొదలుపెట్టింది. బహుశః జగన్‌ మేధావి అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ గుర్తించలేకపోతున్నారు.కానీ రాబోయే రోజుల్లో అందరూ తప్పకుండా గుర్తిస్తారు… ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన నష్టం, ఈ రుణభారం ఇప్పట్లో తీరేవి కావు వాటిని ప్రజలే భరించాలి కనుక!

ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చి ఇదే తాను ప్రజలకు చేసిన మేలు అని గొప్పగా చెప్పుకుంటూ, అందుకు ప్రజల చేత ‘థాంక్యూ సిఎం సార్’ అని చెప్పించుకుంటున్నారు కూడా.

మా నమ్మకం మా భవిష్యత్‌ అన్నీ నువ్వే అని అనుకునేలా రాష్ట్ర ప్రజలందరినీ గంపగుత్తగా హిప్నటైజ్ చేయాలనే గొప్ప ఆలోచన కూడా జగన్‌ సార్‌దే. ఇందుకు మరోసారి ‘థాంక్యూ సిఎం సార్’ అని చెప్పుకోవలసిందే. రాష్ట్రాన్ని పాలించి, అభివృద్ధి చేయమని ప్రజలు జగన్‌కు అధికారం కట్టబెడితే, అది చేయకపోగా ఇలా ప్రతీ వ్యవస్థలో వేలు పెడుతూ సజావుగా నడుస్తున్నవాటిని అల్లకల్లోలం చేస్తున్నారు.

ఈ విపరీత ఆలోచనలు, అనాలోచిత విధానాలు ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం హటాత్తుగా కుప్పకూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రజలందరూ కలిసి రక్షించుకోకపోతే ఆ తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు.

కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుని, సరైన నిర్ణయం తీసుకునేందుకే మూడు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. థాంక్యూ కాదు… గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ గ్రహిస్తే మంచిది.

-మంజరి
పొన్నూరు

Leave a Reply