Suryaa.co.in

Andhra Pradesh

నగదు జమ ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు?

-పోలింగ్‌ తేదీకి ముందే ఎందుకు చేస్తున్నారు?
-బటన్‌ ఎప్పుడో నొక్కారు..ఈరోజే వేయకుంటే ఏమౌతుంది?
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వండి
-జగన్‌ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూటి ప్రశ్నలు

పథకాల నగదు బదిలీకి సంబంధించి జగన్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. నగదు జమ ఇప్పటివరకు ఎందుకు చేయలేపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పోలింగ్‌ తేదీకి ముందు నగదు బదిలీ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలంటూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఒక్క రోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో పోలింగ్‌ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటారో వివరిం చాలని ఆదేశించింది. ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధిని కోరింది. ‘బటన్‌ నొక్కి చాలా వారాలైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుంది’ అని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. నిధుల జమకు ఏప్రిల్‌, మే నెలలో కోడ్‌ ఇబ్బంది ఉంటుందని ముందే తెలుసు కదా అని సీఈసీ పేర్కొంది. వారాలపాటు ఆపి పోలింగ్‌ ముందురోజే జమ చేయక పోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా, ఉంటే వాటి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన ఈసీ నిధుల జమపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదని లేఖలో పేర్కొంది.

LEAVE A RESPONSE