Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు

-పోలీసులకు వీక్లీ ఆఫ్, బకాయిలు మంజూరు
-హోం గార్డులకు వేతనాలు పెంపు, పోలీస్ రిక్రూట్ మెంట్‌లో 4% రిజర్వేషన్
-వెలిగొండ పూర్తి చేస్తా గోదావరి నీటితో ప్రకాశంలో ప్రతి ఎకరాకు నీరిస్తా
-ఆస్తి అడిగిన చెల్లిని పెయిడ్ బ్యాచ్‌తో బూతులు తిట్టిస్తున్న సైకో ఈ జగన్
-పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో ఉద్యోగుల పోరాటం స్పూర్తిదాయకం
-పేకాట, క్యాసినో డాన్‌ను జగన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టాడు
-ఎర్రచందనం దొంగను ఎంపీగా నిలబెట్టాడు
-పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు మీ పిల్లల భవిష్యత్తును ఒక్కసారి గుర్తు చేసుకోండి
-ఒంగోలు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు

ఒంగోలు : ఎన్నికల ప్రచారం చివరికి వచ్చింది. మరో రెండు రోజుల్లో ఎన్నికలున్నాయి. ప్రజాగళం 87వ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే స్థాయి స్పందన. పోలింగ్ రోజున ఇంతకు మించిన ఉత్సాహం చూపించాలి. ఓటు వేసే ముందు ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అవస్థల గురించి ఆలోచించండి. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదు. జీవితాల్లో మార్పులు రాలేదు. ఖర్చులు పెరిగాయి.

జీవన ప్రమాణాలు దిగజార్చారు. ఎన్నికలకు ముందు నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి, అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు.జగన్ రెడ్డి బాదుడుకు బలవ్వని పౌరుడే లేడు. దీనికి తోడు దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వేధింపులు, అరెస్టులు, కూల్చివేతలు, సెటిల్మెంట్లు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సైకోని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఓట్లు అడగడానికి సిగ్గుందా?

13వ తేదీన ప్రజల తిరుగుబాటు కనిపిస్తుంది. 13న జరిగే పోలింగు రాజకీయ పార్టీల కోసం కాదు.. ప్రజల బతుకుల కోసం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పాలన సాధించుకోవడం కోసం. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను దగా చేశాడు ఈ సైకో. డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలిచ్చాడు. ఒక్క డీఎస్సీ పెట్టలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. యువతలో మొదలైన తిరుగుబాటు, వారి ఉత్సాహం చూస్తుంటే బోర్డర్లో ఉన్న సైనికుల్లా కనిపిస్తున్నారు. జగన్ రెడ్డి అరాచకాన్ని అణచివేసేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు.

ఒక సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం పని చేస్తున్న నాయకుడు పవన్ కల్యాణ్. తన భార్యల గురించి జగన్ రెడ్డి మాట్లాడితే పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు జగన్ రెడ్డీ తల ఎక్కడ పెట్టుకుంటావ్. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల గురించి, వ్యక్తిగత విమర్శలు చేయడం అత్యంత హేయం. సొంత చెల్లిని కూడా అవమానించేవాడిని సైకో అనకుండా ఇంకేమైనా అంటామా?

ఇలాంటి సైకో మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? నన్ను అరెస్టు చేస్తే 80 దేశాల్లో సంఘీభావం తెలిపారు. అది నా సత్తా. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వారంతా కూడా పార్టీ కోసం పని చేస్తున్నారు. ఒక నాయకుడి కోసం అతని వల్ల బాగుపడిన వారు పోరాడుతామని ముందుకొస్తే అంత కంటే ఏం కావాలి? ఈనెల 13న జగన్ రెడ్డి కబ్జాలు, అరాచకాలు, అవినీతికి ముగింపు పలకడానికి ప్రజలంతా సిద్ధం కావాలి. ?

మన తాత.. మన తండ్రి నుండి మనకు వచ్చిన భూముల పత్రాలపై ఈ జలగ ఫోటో ఏంటి? మన వారసత్వం, మన కష్టార్జితంపై ఈ సైకో ఫోటో వేసుకోవడమేంటి? మనం అడగమని ఏమైనా చేస్తాననేలా వ్యవహరిస్తున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ ప్రభుత్వ పథకంపై అయినా నా ఫోటో ఉందా? గతంలో ప్రభుత్వ రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే.. ఇప్పుడు సైకో తన ఫోటో వేసుకుంటున్నాడు. అధికారంలోకి రాగానే.. ప్రభుత్వ రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాను.

జగన్ రెడ్డికి ప్రజల ఆస్తిపై కన్ను పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఒక కుట్రపూరితమైన జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు. మన భూముల రిజిస్ట్రేషన్స్ కు సంబంధించిన పత్రాలు తన వద్ద పెట్టుకుని జిరాక్స్ పేపర్లు ఇస్తాడంట. భూ రికార్డులన్నీ తన దగ్గర పెట్టుకుని మీ భూమి అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా అతని అనుమతి తీసుకోవాలి. 13వ తేదీన జగన్ రెడ్డి చీటీ మనమంతా ఏకమై చించాలి. ప్రజల భూములపై కన్నేసిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టే వరకు నిద్ర పోవద్దు.

అప్పుడెప్పుడో జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటి వరకు డబ్బులేయకుండా.. ఎన్నికలకు ముందు ఇస్తానంటున్నాడు. ఇది ఎన్నికల కోసం చేస్తున్న డ్రామా కాదా? అందుకే ఎన్నికల కమిషన్ చెప్పింది.. అప్పుడెప్పుడో బటన్ నొక్కావ్. ఇప్పుడు డబ్బులేస్తామంటే కుదరదని. ఇలాంటి దుర్మార్గుడికి మరోసారి ఓటేస్తామా?

చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని జగన్ రెడ్డి.. మిగిలిన వారికి న్యాయం చేస్తాడా? ఏ అన్న అయినా.. చెల్లెలి జీవితం బాగుండాలి, ఆస్తిలో వాటా కాదు అవసరమైతే మొత్తం ఇస్తానంటారు. కానీ, ఈ దుర్మార్గుడు చెల్లిని సైతం బూతులు తిట్టిస్తున్నాడు. ఇలాంటి సైకోని ఈ ఆడబిడ్డలు క్షమిస్తారా? నా తల్లి కష్టం చూసి.. దీపం పథకంతో వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించాను. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాను. ఉద్యోగాలు, చదువుల్లో రిజర్వేషన్లు కల్పించి మెరుగైన విద్య అందించాను. అలాంటివన్నీ నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. నాడు మనం తీసుకున్న నిర్ణయాలతో ప్రతి గడపనా ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఉండే పరిస్థితి నెలకొంది.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా. గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు తీసుకొచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాను.మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటానని గతంలోనే చెప్పాను. దళితులెప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. గతంలో ఏబీసీడీ కేటగిరీ తీసుకొస్తే.. రాజశేఖర్ రెడ్డి వల్ల దెబ్బ తగిలింది. అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా కేటగిరైజేషన్ తీసుకొస్తాను.

. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులకు పార్లమెంటులో మద్దతిచ్చి.. ఇప్పుడు సిగ్గు లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. నేను బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాను. కానీ, ఈ జగన్ రెడ్డి జీవితమంతా చీకటి పొత్తులే. నేను రాష్ట్ర కోసం పొత్తు పెట్టుకుంటే.. జగన్ రెడ్డి తన కేసుల కోసం లాలూచీ పడ్డాడు.

బ్రాహ్మణ కార్పొరషన్ ఏర్పాటు చేసి నిధులిస్తే.. ఈ జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు. అదే సమయంలో ప్రతి దేవస్థానంలో బ్రాహ్మణులకు అవకాశాలు కల్పిస్తాను. సమాజంలోని అన్ని వర్గాల వారిని అండగా ఉంటాను. వైశ్యులు వ్యాపారాలు కూడా చేసుకోలేని దుస్థితి కల్పించారు. జగన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే.. వ్యాపారాలను లాక్కుని అందులో వైశ్యుల్ని కూలీలుగా పెడతాడు. ఆక్వా రంగాన్ని బాగు చేస్తాను.

ఒక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అతన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట ఆడుతాడు. క్యాసినోకు వెళ్తాడు. మంత్రిగా ఉంటూ డబ్బులు దొబ్బేశాడు. అలాంటి వ్యక్తిని తీహార్ జైలుకు పంపిస్తారా.. అసెంబ్లీకి పంపిస్తారా? మరోవైపు.. దామచర్ల జనార్ధన్ అజాత శత్రువు. నమ్ముకుంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఐదేళ్ల పాలనలో ఈ ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశాడా? రూ.2516 కోట్ల ఖర్చుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దామచర్ల జనార్ధన్ ఒకవైపు.. చిల్లు గవ్వ పని చేయని సన్నాసి మరోవైపున్నారు. భూ కబ్జాలు, నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు. ఈ ఎమ్మెల్యే చరిత్ర ఇంకేమైనా ఉందా?

ఈ రోజు మనం తిరుగుబాటు చేయకుంటే.. మన ఆస్తులకు రక్షణ ఉండదు. మన జీవితాలకు భద్రత ఉండదు. ఈ రాజకీయ రౌడీలను అణగదొక్కుతా. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాను. ఎర్రజర్ల కొండ దగ్గర పట్టాలిచ్చి రూ.40 కోట్ల విలువైన మట్టి కొట్టేసిన స్మగ్లర్ ఇక్కడి ఎమ్మెల్యే. మరోవైపు.. ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే మామూళ్లకు ప్రతి ఒక్క వ్యాపారీ బలైపోయారు.

నల్లమల అడవుల్లోని ఎర్రచందనం మొత్తం కొట్టేసిన దొంగని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టారు. లారీల్లో బట్టలు, లారీల్లో బియ్యం, లారీల్లో డబ్బులు తెస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడా చూడలేదు. మా ఇంట్లో 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం. కానీ, ఐదేళ్లలో ఇంత సంపాదించడం చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. వీళ్ల దోపిడీ చూస్తుంటే మరోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే రాష్ట్రాన్ని ఉంచుతారా? మాగుంట శ్రీనివాసులు ఎక్కడైనా రూపాయి తప్పు చేయడం చూశారా? దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నాడు. మచ్చ లేకుండా నడుచుకున్నాడు. స్మగ్లర్లు, ల్యాండ్ గ్రాబర్లు, ఇసుక మాఫియా, మద్యం డాన్స్ తప్ప మంచి వారు వైసీపీకి అవసరం లేదు.

ఉద్యోగులకు హామీ ఇస్తున్నా. పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో మీ చొరవ అభినందనీయం. అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోతే డిమాండ్ చేశారు. క్యూలైన్లలో నిలబడి మరీ ఓట్లు వేశారు. 85శాతం ఓటింగ్ ఒక చరిత్ర. వీరి చిత్తశుద్ధి చూశాక నాకు బాధ్యత పెరిగింది. జీతాలు పెంచడానికి పీఆర్సీ ఇస్తాను. ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను. పోలీసులకు హామీ ఇస్తున్నా వీక్లీ ఆఫ్ అందిస్తా. హోం గార్డుల జీతాలు పెంచుతా. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పరిష్కరిస్తా. తక్కువ ధరకు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టుకోవడానికి తోడుంటాను. అన్ని రకాల సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తా.

అంగన్వాడీ, ఆశ వర్కర్లను కూడా అండగా నిలుస్తాను. హోం గార్డుల జీతాలను రూ.24 వేలకు పెంచుతాను. పోలీస్ రిక్రూట్ మెంట్లో హోం గార్డులకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తా. పొదుపు సంఘం యానిమేటర్లు, గోపాలమిత్ర, ఆరోగ్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను. చేతి వృత్తులందరికీ న్యాయం చేస్తాను. డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు అందిస్తాను. క్రిస్టియన్ ఆస్తులు కాపాడి వారకి రక్షణగా నిలుస్తాను. అన్ని వర్గాలను ఆదుకునే బాధ్యత నాది.

LEAVE A RESPONSE