హవ్వ … వినాయక విగ్రహాల ఏర్పాటుపై పన్నా?!

– కొన్ని వర్గాలకు రాయితీలు… హిందువులపై పన్నులా??
– ఏపీలో రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలి
– బాబు – మోడీ కలిసి మాట్లాడుకోవడం శుభ పరిణామం
– ఉద్యోగుల పై బైండోవర్ కేసులా?
– చట్టం ముందు అందరూ సమానమేనని అనుకున్నాం… కానీ కాదని హైకోర్టు తీర్పు చెబుతోంది
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఒక ఉపద్రవం వచ్చినప్పుడు రాజకీయ శక్తులన్నీ కలవాలి. ఆంధ్ర ప్రదేశ్ వరకైతే నా ఉద్దేశంలో అది జరుగుతుందని నమ్మకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడడం శుభ పరిణామం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కలసినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే ఎన్డీఏలో టిడిపి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏలో టిడిపి చేరడం, తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు.

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ పై తమ పార్టీ పెద్దల లో కలవరపాటు కనిపిస్తుందన్న ఆయన, నూటికి నూరుపాళ్ళు బిజెపితో టిడిపి కలుస్తుందని భావిస్తున్నానని, తనకైతే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వినాయక విగ్రహాల ఏర్పాటు పై పన్ను విధించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు రెండు, మూడు అడుగులున్న విగ్రహాలను ఏర్పాటు చేస్తే రోజుకు వెయ్యి రూపాయల చొప్పున, నవరాత్రుల వరకు పదివేల రూపాయల పన్ను విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇక మైక్ సెట్ కు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు అదనంగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మైక్ సెట్ కు 100 రూపాయలు అంటే 4 మైక్ సెట్ లను ఏర్పాటు చేస్తే 400 రూపాయలు. 50 నుంచి 100 వాట్ల విద్యుత్ కనెక్షన్ కు 2000 రూపాయలు వసూలు చేయడంతో పాటు పదివేల రూపాయలు డిపాజిట్ కింద జమ చేయాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇతర వర్గాల వారు జెరూసలేం, మక్కాలకు వెళితే ప్రభుత్వం రాయితీలను కల్పిస్తుందని, హిందువులు నిష్టగా జరుపుకునే పండగను ప్రోత్సహించకపోతే… ప్రోత్సహించక పోయారు. కానీ పన్నులు విధించడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇంట్లో పూజ చేస్తే కూడా గణేష్ టాక్స్, వినాయక టాక్స్ అంటూ పన్నులు వేస్తారేమోనని ఎద్దేవా చేశారు. గతంలో ముస్లిం రాజులు ఈ విధంగానే హిందువులపై పన్నులు వేశారని చరిత్ర చెబుతుందన్నారు. ముస్లిం రాజుల పాలనలో పన్నులు చెల్లించలేని హిందువులు తమ మతాన్ని మార్చుకున్నారని, అలాంటి భావనలే మన పరిపాలకులకు వచ్చాయా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

దేశంలో ఎక్కడ కూడా వినాయక విగ్రహాల ఏర్పాటు పై పన్నులు వేయలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వినాయక మండపాల వద్ద మైక్ సెట్ లను ఏర్పాటు చేస్తే డబ్బులు వసూలు చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం, మసీదులలో ఉన్న మైక్ సెట్ లకు పన్నులను వసూలు చేయగలదా? అంటూ ప్రశ్నించారు. విగ్రహాల ఏర్పాటుపై పన్ను వేయాలన్న వ్యామోహం పాలకులకు ఎందుకు వచ్చిందని నిలదీశారు. కరోనా నిబంధనల కారణంగా గత రెండు, మూడేళ్లుగా వినాయక ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకో లేకపోయారని, ఇప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలతో భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.

పది రోజుల ముందుగానే నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తీసుకువెళ్లే వాహనం నెంబరు, ఆర్సీ కాగితాలు, డ్రైవర్ లైసెన్సు ఇవ్వాలన్న నిబంధనలు ఎందుకనీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇక పంచాయితీ, మున్సిపాలిటీకి 500 రూపాయలు రుసుము చెల్లించాలని, అలాగే పోలీసులకు 500 రూపాయలు చెల్లించాలన్న నిబంధనలే మి టో తనకైతే అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడానికి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి దగుల్బాజీ సలహాదారులు ఎవరైనా ఈ దిక్కుమాలిన సలహా చెప్పారా?, లేకపోతే ముఖ్యమంత్రి కే ఈ ఆలోచన వచ్చిందా?? అని ప్రశ్నించిన ఆయన… ఈ తప్పుడు సలహా ఎవరిచ్చారో కానీ దాన్ని పెడచెవిన పెట్టాలని సూచించారు.

తక్షణమే గతంలో వినాయక చవితి ఉత్సవాలను, మండపాల నిర్వాహకులు ఎలా నిర్వహించేవారో, అలాగే నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. పాలకులు ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించరాదని, అన్ని మతాలను సమదృష్టితో గౌరవించాలని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. కొన్ని వర్గాలకు రాయితీలు ఇచ్చి, మరొక వర్గంపై పన్నులు వేయడం రాచరికంలో కుదిరింది కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో కుదరదని హెచ్చరించారు. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించాలన్న ఆయన, తమ పార్టీలో ఉన్న దైవ భక్తులైన నాయకులు సైతం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించాలని సూచించారు. పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరితే బాగుంటుంది కానీ, విగ్రహాలపై పన్ను ఏర్పాటు చేస్తామంటే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

ఓ పి ఎస్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి
ఓల్డ్ పెన్షన్ స్కీమును ( ఓ పి ఎస్) అమలు చేస్తామని ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీకి కట్టుబడి తక్షణమే అమలు చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయాలని కోరగా, అప్పటి ప్రభుత్వం కమీషన్ ను ఏర్పాటు చేసిందన్నారు.. తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా టిడిపి సీపీఎస్ రద్దుకు ఓకే చెప్పిందన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా… ఎవరైనా నాయకుడు చెప్పినట్టు చేయకపోతే, చొక్కా పట్టుకొని ప్రశ్నించాలని, రాజీనామా చేసే వరకు నిలదీయాలని ఉద్యోగులను రెచ్చగొట్టింది ఎవరని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

గ్యారంటీ పెన్షన్ స్కీం (జిపిఎస్) అమలుపై ఉద్యోగ సంఘాలను పిలిచి ముందే మాట్లాడాల్సి ఉండగా, కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడవు… వారిని కలిసే ప్రయత్నం చేయవంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఇక ప్రతి ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి 141 వ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి ఫోటోలను తీస్తున్నారని, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటే వారిపై 143వ సెక్షన్ కింద బైండోవర్ కేసులు పెట్టనున్నారని చెప్పారు. ఈ సెక్షన్ కింద కేసులు పెడితే ఉద్యోగులు కూడా నేరస్తుల జాబితాలో చేరుతారన్నారు. టీచర్లకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు… దేవుడు, గురువుల ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నించ వద్దంటూ హెచ్చరించారు. ఇప్పటికే టీచర్లను లిక్కర్ షాపుల వద్ద సేల్స్ మెన్ లాగా ఉపయోగించుకున్నారని, ఇక బాత్రూంలో ఫోటోలు తీయించి పారిశుద్ధ్య కార్మికులమాదిరిగా, ఫోటోగ్రాఫర్లను చేశారని ఎద్దేవా చేశారు. ఈనెల 5వ తేదీన గురుపూజ దినోత్సవం నాటికి ఎంతమంది ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు ఉంటాయో చూడాలన్నారు. బైండోవర్ కేసుల కింద నోటీసులు ఇవ్వడం వల్ల, ఒకవేళ ఉద్యోగులు నిరసన తెలియజేయాలనుకుంటే, కోర్టు పర్మి షన్ ద్వారా నే తమ నిరసనలను తెలియాల్సిందేనని చెప్పారు.

చట్టం ముందు అందరూ సమానమేనని తాను చదివానని, అలాగే భావిస్తూ వచ్చానని.. కానీ అందరూ సమానము కాదని తనకు తెలియదని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వి రమణ పదవీ విరమణ చేస్తున్న సమయానికే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచారణ నిమిత్తం, కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని హైకోర్టు తీర్పును ఇవ్వడం ఆశ్చర్యపరిచిందన్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును తప్పు పట్టలేమన్న ఆయన, చట్టం ముందు అందరూ సమానమే నని ఇన్నాళ్లు భావించానని.. కానీ ముఖ్యమంత్రి సమానం కాదని తీర్పు వచ్చిందని విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ సీబీఐ కోర్టు తప్పనిసరిగా హాజరుకావాలని అంటే మాత్రం, విచారణకు హాజరుకావాలని పేర్కొనడం విడ్డూరంగా ఉంద న్నారు.

కోర్టులు ఎప్పుడు విచారణకు హాజరు కమ్మని మాత్రమే ఆదేశిస్తాయని, అంతేకానీ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించవని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై సీబీఐ, సుప్రీంకోర్టుకు అప్పీలు కు వెళ్తుందా?, లేకపోతే హైకోర్టు తీర్పు పై గౌరవంతో వెళ్లలేదంటారా??, ఫార్మాలిటీ కోసమైనా అప్పీల్ కు వెళ్తారో లేదో చూడాలని వ్యాఖ్యానించారు.

ఆత్మహత్య అంటూ ప్రచారమా?
ఎస్వీఆర్ మీడియా లో రఘురామకృష్ణం రాజు ఆత్మహత్య అన్న శీర్షికతో సోషల్ మీడియా లో ప్రచారం చేయడం తనకు నవ్వు తెప్పించిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాను బతికే ఉండగానే ఆత్మహత్య అంటూ ప్రచారం చేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నదేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. గతంలో తనని హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని, కిడ్నాప్ చేసి, నక్సలైట్లు హత్య చేశారని ప్రచారం చేయాలన్న పథకాన్ని అమలు చేయబోయారని, ఇక పోలీసుల ద్వారా హత్య ప్రయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు చెప్పుకు వచ్చారు.

ఇక ఇప్పుడు ఏమో ఎస్ వి ఆర్ మీడియా ద్వారా ఆత్మహత్య అంటూ ప్రచారం చేస్తున్నారన్న ఆయన, ఈ మీడియా సంస్థ వెనుక సజ్జల ఉన్నారో లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారో తెలియదన్నారు. నేచురల్ గా బ్లడ్ క్లాట్ అయ్యే లా విషాన్ని తమ వాళ్ళు తెప్పించారని, ఈ విషాన్ని భోజన పదార్థాలలో కలిపితే అది భుజించిన వారు 15, 20 రోజుల వ్యవధిలో బ్లడ్ క్లా ట్ అయి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎస్వీఆర్ మీడియాలోనే కాకుండా , సాక్షి ఛానల్ లో కూడా ఈ కథనాన్ని వేసుకని, ప్రచారం చేసుకోవాలన్న ఆయన,తనకున్న ఆ ఒక్క కీడు కూడా తొలగిపోయిందని వ్యాఖ్యానించారు.

Leave a Reply