Suryaa.co.in

Editorial

కాంగ్రెస్‌లో ‘టీ ట్వంటీ’

– టికెట్లపై టీ కాంగ్రెస్‌లో పంచాయితీ
– అజారుద్దీన్‌పై మహేష్‌గౌడ్‌ విమర్శల బౌన్సర్లు
– టికెట్ల అమ్మకాలపై ఆరోపణల యార్కర్లు
– అజారుద్దీన్‌ది బాధ్యతారాహిత్యమన్న మహేష్‌గౌడ్‌
– మహేష్‌ గౌడ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో ఒకవర్గం కన్నెర్ర
– అజారుద్దీన్‌ వల్ల పార్టీ ఇమేజీ డామేజీ అవుతుందంటున్న మరో వర్గం
– ‘వర్కింగ్‌ ప్రెసిడెంట్‌’ వర్సెస్‌ ‘వర్కింగ్‌ ప్రెసిడెంట్‌’
– కాంగ్రెస్‌లో క్రికెట్‌ బంతాట
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇద్దరూ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్లే. అయినా సరే.. విమర్శల బౌన్సర్లు, ఆరోపణల యార్కర్లు వేసుకుంటున్నారు. ఒక ‘వర్కింగ్‌’.. ఇంకో ‘వర్కింగు’ పనితీరు-వైఫల్యంపై మీడియా సమక్షంలోనే పెద్ద పంచాయితీ పెట్టేశారు. ‘అసలు నీ టికెట్ల అమ్మకాల యవ్వారమేంద’ని నిలదీశాడు. దానికి ఇంకో వర్కింగ్‌ ఏమో.. ఇదే మా పద్ధతి దట్సాల్‌. నేను సుప్రీంకోర్టు కమిటీకే జవాబుదారీ’ని అంటూ బేఫికర్‌గా సమాధానిమిచ్చారు. ఇదంతా హైదరాబాద్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కి సంబంధించి, తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న టీ ట్వంటీ బంతాట!

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌గౌడ్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడితోపాటు- తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన అజారుద్దీన్‌పై.. విమర్శల బౌన్సర్లు, ఆరోపణల యార్కర్లు సంధించడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ఒకటే పార్టీ, ఒకే హోదా అయినప్పటికీ.. క్రికెట్‌ మ్యాచ్‌ వేదికగా టికెట్ల పంచాయతీకి దిగడం, రాజకీయ-క్రీడా రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లో ఈనెల 25న.. ఆదివారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న, ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల వ్యవహారం ఇప్పటికే వివాదంగా మారింది. అమ్మకాలకు పెట్టిన టికెట్లు కొద్దిసేపటికే అమ్ముడుపోవడం, టికెట్ల కోసం ఎగబడిన యువకులపై పోలీసులు లాఠీచార్జి చేసిన క్రమంలో, చాలామంది క్షతగాత్రులయిన వైనం హెచ్‌సీఏ నిర్లక్ష్య విధానానికి నిదర్శనంగా నిలిచింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని, పోలీసుల వైఫల్యాన్ని తూర్పాపట్టాయి. దానితో స్పందించిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌.. అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఉప్పల్‌ స్టేడియం ప్రభుత్వ భూమి కాబట్టి, దాని లీజు ఎంతవరకూ ఉందన్నదీ పరిశీలిస్తామని ఆయన మరో బాంబు పేల్చారు.

మరోవైపు టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు ఏకంగా పోలీసులు అజారుద్దీన్‌ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్‌…. మీడియా సమక్షంలో, తన సహచర టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడయిన అజారుద్దీన్‌ వైఫల్యాలను ఎండగట్టడం సంచలం సృష్టించింది.

టికెట్ల కొనుగోలుకు సంబంధించిన తొక్కిసలాటతో.. హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని, హెచ్‌సీఎ అధ్యక్షుడయిన అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. అందులో తన తప్పుంటే అరెస్టు చేసుకోవచ్చన్నారు. తామేమీ బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోలేదని, కాంప్లిమెంటు టికెట్లు కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు. 11,500 టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మామన్న అజారుద్దీన్‌.. తాము సుప్రీంకోర్టు కమిటీకి జవాబుదారులమని స్పష్టం చేశారు. దానితోపాటు క్రికెట్‌ గురించి ఓనమాలు తెలియని వారు కూడా విమర్శిస్తున్నారన్న ఆయన వ్యాఖ్యలు, అగ్నికి ఆజ్యం పోశాయి. అజారుద్దీన్‌ వివరణ పరిశీలిస్తే.. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్లుగా కనిపిస్తోంది.

కానీ టికెట్లు దొరకని అభిమానులతోపాటు.. రెండురోజుల క్రితం తొక్కిసలాటలో గాయపడిన ఆలియా తల్లి కూడా, ఈ దారుణానికి అజారుద్దీనే కారణమని ధ్వజమెత్తడం విశేషం. తమ పాపపై ఒక్కసారి 300 మంది పడ్డారని, పదినిమిషాల తర్వాత తమ పాపను బయటకు తీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దేవుడు దయ, మీడియా పుణ్యాన తన బిడ్డ బతికిందని ఆలియా తల్లి వ్యాఖ్యానించారు.

ఈ స్థాయిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన అజారుద్దీన్‌పై విమర్శల వర్షం కురుస్తుంటే.. అటు సొంత పార్టీ నుంచి కూడా ఆయనపై విమర్శలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్‌ కూడా, టికెట్ల అమ్మకాలకు సంబంధించి అభిమానులనే సమర్ధించి, అజారుద్దీన్‌ తీరును ఎండగట్టడం పార్టీ వర్గాలు ఆశ్చర్యపరిచింది.

హెచ్‌సీఎ హైదరాబాద్‌ బ్రాండ్‌ను దెబ్బతీసిందని, అసోసియేషన్‌తో ప్రభుత్వ పెద్దల ములాఖత్‌ వల్లే ఇదంతా జరుగుతోందని మహేష్‌గౌడ్‌ దుయ్యబట్టారు. జరిగిన ఘటనకు హెచ్‌సీఏ బాధ్యత వహించాలని, ఆసుపత్రిలో ఉన్న పాప ప్రాణాపాయంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో కొన్న టికెట్ల జాబితాతోపాటు, మార్కెట్‌లో ఉంచిన టికెట్ల జాబితా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. 38 వేల మందిని అనుమతించే విషయంలో హెచ్‌సీఎ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని మహేష్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఎవరి వివరణలో పొంతన లేదన్న మహేష్‌గౌడ్‌.. 32 వేల టికెట్లను మార్కెట్‌లో పెట్టాలని, కాంప్లిమెంటరీ పాసులు 8 శాతం మించకూడదని డిమాండ్‌ చేశారు. పార్టీలు-వ్యక్తులతో సంబంధం లేకుండా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

మహేష్‌గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టాయి. హెచ్‌సీఏకు స్వయంగా తమ పార్టీకి చెందిన అజారుద్దీనే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆయనపై ఆరోపణలు చేయడం వల్ల పార్టీ నష్టపోతుందన్న వాదనను, ఒక వర్గం తెరపైకి తెచ్చింది. మహేష్‌ వ్యాఖ్యల వల్ల అజారుద్దీన్‌ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, దానితో సహజంగా పార్టీ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

అయితే.. దీనిని పార్టీ కోణంలో చూడకూడదని మరో వర్గం వాదిస్తోంది. హెచ్‌సీఎ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ను, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్‌ను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేస్తోంది. లక్షలాది మంది అభిమానుల పక్షాన నిలబడటం రాజకీయ పార్టీ బాధ్యత అని, మహేష్‌గౌడ్‌ కూడా అదే చేశారని ఆ వర్గం వాదిస్తోంది. అభిమానులను ఇబ్బంది పెడితే, ఆ అప్రతిష్ట ఒక్క అజారుద్దీన్‌కు మాత్రమే కాదు. కాంగ్రెస్‌ పార్టీకీ నష్టమేనన్న లాజిక్కును తెరపైకి తెస్తున్నారు.

LEAVE A RESPONSE