నరసయ్య సార్ మాటలు.. ఫిరంగుల మోతలు..!

గుజ్జుల నరసయ్య సార్ మాటలు తుపాకి తూటాలు.. ఫిరంగుల మోతలు..!

వెంట్రుకలు నిక్క పొడిచే ఉపన్యాసం..!! కమ్యూనిస్టులు.. నక్సలైట్ల భావజాలాన్ని అడుగడుగునా అడ్డుకొని.. జాతీయ భావజాలం..హైందవ సైద్ధాంతిక ఉపన్యాసాలతో లక్షలాది మంది కార్యకర్తలకు సిద్ధాంతాన్ని నూరిపోసిన మహనీయులు వారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు శ్రీ గుజ్జుల నరసయ్య గారు తుది శ్వాస విడిచిన విషయాన్ని విద్యార్థి పరిషత్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సందర్భంలో (1998లో) ఏబీవీపీ మహాసభ ఒకటి పాలమూరులో జరిగింది. అప్పట్లో పాలమూరు నగరంలోని టౌన్ హాల్ సమావేశాలకు ప్రసిద్ధి. టౌన్ హాల్లో నిర్వహించిన ఏబీవీపీ సమావేశానికి హాజరైన నరసయ్య సార్ ఇచ్చిన ఉపన్యాసం ఇంకా మా చెవిలో మార్మోగుతూనే ఉంది. ఈ సమావేశానికి కోటకొండ, నారాయణపేట నుంచి మా అన్న పగుడాకుల సత్యనారాయణ (భాగ్ ప్రముఖ్) ఆధ్వర్యంలో వంద మందికి పైగా కార్యకర్తలము హాజరయ్యాము.

ఇటీవల భాగ్యనగర్ తార్నాక లోని ఏబీవీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కలిసి వారితో ముచ్చటించిన విషయం మరువలేనిది. పాతికేళ్ల క్రితం పాలమూరులో వారిచ్చిన ఉపన్యాసం గుర్తు చేశాను. దీంతో నరసయ్య సార్ సంతోషంగా నవ్వుతూ భుజం తట్టారు. ఎందరో విద్యార్థి వీరులను దేశభక్తులుగా.. జాతీయవాద సైనికులుగా తీర్చిదిద్దిన మహనీయులు నరసయ్య సార్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. కన్నీటి వీడుకోలు పలుకుతున్నాము.

– పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వ హిందూ పరిషత్
తెలంగాణ
9912975753
9182675010
90009 03060

Leave a Reply