నలుగురికీ నచ్చే “నరసరావుపేట”

– నేెను.. మా ఊరు
నరసరావుపేట కళలకు పెట్టింది పేరు. ఎందరో విద్యావంతులకు, కళాకారులకు, రాజకీయ ప్రముఖులకు నెలవు. పుట్డినూరి మట్టివాసనలు ఎప్పటికీ పరిమళమే..
గుంటూరు జిల్లాలో ప్రముఖ పట్టణం నరసరావుపేటలో ప్రాథమిక పాఠశాల నుంచీ 1987లో ఇంటర్మీడియేట్ వరకూ చదువుకున్న రోజులు మరవలేనివి‌. రామిరెడ్డి పేట లో మా సొంత ఇల్లుంది.
నా ప్రస్తుత ఉద్యోగ స్థాయికి ‌అపుడే బీజం వేశారు మా ఉపాధ్యాయులు.
దేశ విదేశాల్లో స్థిర పడ్డ పదవతరగతి పూర్వ విద్యార్థులమంతా ఈ మధ్యనే నరసరావుపేటలో కలిశాం ..కలిసిన మధుర క్షణాల్లో ఎన్నో నరసరావుపేట తీపి జ్ఞాపకాలను పంచుకున్నాం.
భ్రమరాంబ స్కూలు, గాలికోటయ్య స్కూలు, మునిసిపల్ హైస్కూలు విద్యలో చక్కని ఆరంభాన్నిస్తే, ఉన్నత విద్యకు మార్గాన్ని సుగమంచేశాయి పేరున్న కళాశాలలు ఎస్సెస్సెన్ కాలేజి, రెడ్డి కాలేజి, రఘురామయ్య కాలేజిలు.
నేను చదువుకున్న ఎస్సెస్ఎన్ కాలేజీని‌ ప్రముఖ సమాజ సేవకులు సుబ్బరామయ్య, నారాయణగారు స్థాపించారు. చుట్డుపక్కల వున్న గ్రామాలనుంచీ ఇంటర్ , డిగ్రి చదువులకోసమై నరసరావుపేట వచ్చేవారు.
పెద్ద భవనాలు, మైదానాలు వున్న కళాశాలలు ఇవి.
క్రికెట్, బాస్కెట్బాల్, కబడ్డి, ఖొ ఖొ ఎక్కువగా ఆడేవాళ్ళం.
కాలేజీల్లో, పట్టణంలో జరిగే ఎన్నో పోటీలు విద్యార్థులను‌ ఆకర్షించేవి. అపుడు ఇప్పట్లా మొబైల్స్ లేకపోవడంతో అందరం ఒకచోట సరదాగా కలుసుకునీ, పిచ్చాపాటీ మాట్లాడుకునే వీలుండేది.
మంచి చరిత్ర ఉందీ పట్టణానికి.
‘అట్లూరు’ అనే గ్రామంగా ఆవిర్భవించి క్రమేణా రాజావారు శ్రీ మల్రాజు వేంకట నరసింహారావు గారి పేరిట 1797 లో “నరసరావుపేట’ గా అవతరించింది. ఇక్కడున్న రాజుగారి కోట 24 అడుగుల సింహద్వారం గంధి గజేంద్ర ద్వారంతో అయిదు బురుజుల కోటగా ఆకర్షణీయంగా ఉండేది. రాణీవాసం, రాజుగారి ఆంతరంగిక గృహం ఉండేవి.
దాతృత్వం, ధైర్యసాహసాలకు పేరున్న రాజులు మల్రాజులు. పిండారీల బారినుంచి రక్షణ కోసం అప్పటి‌ ఓక్స్ దొర ఈ కోటలో తలదాచుకున్నారు. అప్పటి రాజావారు అశ్విక దళాలతో పిండారీలపై పోరు సలిపి, వారిని పారద్రోలటం ఒక గొప్ప చరిత్ర. ఈ చరిత్రను వింటూ పెరిగాం. ఇప్పటికీ ఈ వీరగాథలను ఇక్కడి ప్రజలు గుర్తుచేసుకోవడం ఒక విశేషం.
నరసరావు పేట నగర సంకీర్తనలకు మంచి పేరు. ప్రాతఃకాలాన, భక్తి‌ గీతాలను పాడుతూ భగవంతునికీ , ప్రజలకు మేలుకొలుపు నగర సంకీర్తనలలో ముఖ్యాంశాలు.
నగరంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న పాతూరు శివాలయం భక్తుల పారవశ్యానికి అద్దం‌ పడుతుంది. ఇక్కడ వున్న పుట్ట నాగులచవితి, నాగ పంచమి రోజున భక్తులతో క్రిక్రిరిసిపోతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం, పాతూరు‌ ఆంజనేయస్వామి దేవాలయం,పాండురంగ స్వామి,పట్టాభిరామస్వామి,సీతారామస్వామి,వాసవీకన్యకా పరమేశ్వరి దేవాలయాలు, వినుకొండ రోడ్ లోని భావ నారాయణస్వామి దేవాలయం , స్టేషన్ రోడ్ లోని ప్రసన్నాంజనేయస్వామి‌ దేవాలయం , శంకరమఠం, సాయి మందిరం తప్పక దర్శించాల్సిన‌ దేవాలయాలు.ప్రసిధ్ధి గాంచిన‌ రామిరెడ్డిపేట వీరాంజనేయ స్వామి వారి గుడి వీధిలోనే, ఆర్డీవో గారిల్లు వెనుక వీధిలో మా సొంత ఇల్లు ఇప్పటికీ ఉంది.
కోటి వేల్పుల కొండ కోటప్పకొండ ప్రక్కనే ఉంది. తిరునాళ్ళు అత్యద్భుతంగా జరుగుతాయి. పెద్ద పెద్ద విద్యుత్ ప్రభలను చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నంత అందంగా తయారవుతాయి.మూడు సంవత్సరాలు వరుసగా , నేనూ, నా స్నేహితులు‌ కలిసి‌ చిన్న ప్రభ కట్టి , దేవుళ్ళ బొమ్మలతికించి, చక్రాల బండిని తయారు చేసి తిప్పిన‌ సందర్భాలు మరువలేని‌ జ్ఙాపకాలు.వినాయక చచితి, సంక్రాంతి, ఉగాది పర్వదినాలు‌, ఉరుసు‌ఉత్సవం, క్రిస్మస్‌ సంబరాలతో మత సామరస్యం చక్కగా‌ఉండేది.క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు వైభవంగా జరిపే వినయకచవితి ఉత్సవాలు చూడవలసినదే.
శృంగేరీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ద మహాస్వామి వారు, ఇంకా చిదానంద భారతీ స్వామి వారు పూర్వాశ్రమంలో ఇక్కడివారే.ప్రముఖ రాజకీయవేత్తలు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు,కోడెల శివప్రసాద్ గారు, కాసు క్రిష్ణా రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడి వారే..సాహిత్యంలో పేరుగాంచిన కొప్పరపు కవులను గుర్తుచేసుకోవడం నా ధర్మం. ప్రముఖ రచయితలు చలం గారు, బీనాదేవి దంపతులు కొద్దికాలం నరసరావు పేటలో పనిచేశారు.కవులు అనిశెట్టి సుబ్బారావు గారు, వారణాసి వెంకటేశ్వర్లు గారు, మడకా సత్యనారాయణ గారు, చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారు, పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారు, లంకా సత్య నారాయణ గారు, రామిరెడ్డి గారు, యజ్ఙవాల్క్య శర్మ గారు, డా.దుగ్గిరాజు శ్రీనివాస రావు గారు, ప్రతాప రవిశంకర్ గారు, రత్నాకరం రాము గారు, పమిడి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, రామకోటేశ్వర రావు గారు, మల్లాది మంజుల మొదలైన సాహితీ వేత్తలు నరసరావుపేట వాస్తవ్యులే.సినీ గేయరచనలో ముందంజలో ఉన్న ప్రముఖులు రామజోగయ్య శాస్త్రి గారు ఇంటర్ లో మా క్లాస్ మేట్ అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉంది.‌తరగతులకు ఆలస్యంగా వస్తే అరచేతి పై కర్ర దెబ్బలేసి క్రమశిక్షణ నేర్పిన హెడ్ మాష్టర్ రమణమూర్తి గారు ధన్యులు.
ధనుర్విద్య ప్రదర్శించి విశ్వ విఖ్యాతినార్జించిన మిన్నికంటి వెంకఠెశ్వర్లు గారు మాకు హిందీ నేర్పిన మాష్టారు.
భారతంలో అర్జునిలా అయన గురి చూసివేసే బాణాలను ధనుర్విద్యను చూసి అచ్చెరువొందేవారం. బారతంలోని అర్జునుడు మా ముందు కనబడుతున్నాడనుకునే వాళ్ళం..ఒకరోజు అలా బాణాలు వేయాలని నేను కూడా సాహసించి అభాసుపాలయ్యాననుకోండి.చాలాకష్టమైన విద్య. లింగంగుట్ల సుబ్బారావు గారు, విశేషంగా వారి కుమార్తె మల్లికా రమ్య గారు విలువిద్య ప్రదర్శిస్తూ నరసరావుపేట కు ఎనలేని కీర్తిని తెచ్చారు.ఎస్సెస్సెన్ కళాశాల రాజనీతి శాఖాధిపతి ఎం అర్ కె మూర్తి గారు జాతీయ స్టాంపుల సేకరణ సంఘం స్థాపించి ప్రముఖ ఫిలాటలిస్ట్ గా పేరు పొందారు.పౌరాణిక సాంఘిక నాటకాలకు ఇక్కడ ఎంతో అదరణ. చింతామణి నాటకం ఎంతో పేరు పొందింది. ఇక్కడి గురజాడ కళామందిర్ లో ఎన్నో రంగస్థల నాటకాలు చూస్తూ పెరిగాను.బెల్లంకొండ సుబ్బారావు గారు, రాఘవ రావు గారు ,వివి స్వామి గారు, లతా లక్ష్మి గారు, హాస్యరస చక్రవర్తి అర్వపల్లి సుబ్బారావు గారు, ఎందరో మహానటులు ఇక్కడివారే..ఇక్కడ వైద్యానికి మంచి పేరు ఉంది. ఆర్ధోపెడిక్, జనరల్, ప్రసూతి వైద్యశాలలు, కంటి ఆసుపత్రులు మేలైన సేవలనందిస్తున్నాయి.పేరుగాంచిన వైద్యులు ఎందరో ఉన్నారు. అన్నపూర్ణమ్మ హాస్పిటల్ ఎంతో ప్రసిధ్ది. వారబ్బాయి డా. ప్రేమ్ చంద్ మా సహాధ్యాయి. ప్రస్తుతం హైదరాబాదులో పేరొందిన హార్ట్ స్పెషలిస్ట్‌ .‌
మా తాతయ్యగారు గండ్రకోట హనుమంతరావు గారి సంగీత కళాశాలకు అప్పుడు మంచి పేరు. లయన్స్ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్, రుక్మిణి స్త్రీ సమాజం మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండేవి.
ఇక్కడే చిత్రలేఖనం నేర్చుకున్నాను. ఎనిమిదవ తరగతి గదిలో గోడఫై రంగులతో వేసిన శివాజీ బొమ్మ అప్పటి మాష్టర్లకు నచ్చి చిత్రలేఖనంలో పైకొస్తావయ్యా అంటూ మెచ్చుకోవడం‌ పెద్ద ప్రోత్సాహం.
హైస్కూలు లో పద్య పఠన పోటి పెడితే ఫస్టు ప్రైజు గెలుచయకోవటం పద్యాలు రాయడానికి ప్రేరణనిచ్చింది.
నా మొట్టమొదటి కథకే కాకినాడ వారి సాహితీసమాఖ్య వారినుంచీ ప్రథమ‌బహుమతి‌ లభించింది. తెలుగు లెక్చరర్ గారుగా చేసిన నాన్నగారి ప్రోత్సాహంతో తెలుగు భాష అంటే మక్కువ పెరిగింది.
ఒకప్పుడు నీటి ఎద్దడ ి‌బాగా ఉండేది. పంపుల ముందు బారులు తీరి ఉండేవారు నగర వాసులు. కటకటల‌పేట అనేవారుకూడా..ఇపుడా లోటు లేదు. నగర పురపాలక‌ సంఘం కార్వవర్గం, వార్డ్ సభ్యులు, ఎంఎల్ ఏ, గారు, ఎంపీ గారు మునిసిపల్‌సిబ్బంది‌ అధికారులు‌ , పౌరులు ఎంతో చక్కగా‌ నగర అభివృధ్ది కోసం‌ పాటుబడుతున్నారు. అందరూ అభినందనీయులు.
సాంకేతిక విద్య చదవాలంటే దూర ప్రాంతాలకు‌ వెళ్ళవలసి వచ్చేది కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నత విద్యకూ అవకాశాలిస్తూ ఎన్నో ఇంజినీరింగ్ , ఫార్మసి కళాశాలలు నెలకొన్నాయి.వినోద సమయాలకు ఇక్కడ చాలా సినిమాహాల్స్ ఉన్నాయి. సంధ్య, చిత్రాలయ,నాగూర్వలీ, ఏంజల్‌టాకీస్, లక్షినరసింహ ధియేటర్ ల లో కొత్త సినిమాలు‌ ఆయా హీరోల అభిమానుల మధ్య చూస్తుంటే అదో ఆనందంగా ఉండేది. ఈలలు మిన్నంటేయి.
హోటల్ వసంతవిహార్లో టిఫిన్లు బాగుంటాయి. ఇక్కడ రాజకీయ, రంగస్థల ముచ్చట్లు వినాల్సిందే… దీనికి కొద్ది దూరంలో మిరపకాయ బజ్జీల బండీ ఉండేది.రద్దీ ఎక్కువ వుండేది.. వేడి వేడి గా బజ్జీలు చాలా బాగుండేవి..వేయడం, చకచకా అమ్ముడై పోవడం…చూస్తుంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉండేది. గారె , ఉల్లి బజ్జీలకు బాగా గిరాకీ…కొద్దు దూరంలో టీ బిస్కట్ల దుకాణాలు ఓ నాలుగు ఉండేవి. విపరీతమైన సందడి…ఇక్కడ ప్రపంచ వార్తలు కూడా ముందే తెలుస్తూ ఉంటాయి.
ఇంకొంచెం దూరంలో కోర్టు భవనాల సముదాయం ఉంది. సినిమాల్లోలా కోర్ట్ సీన్స్ ఉంటాయనుకొని చిన్నవయసపుడు..అంతగా తెలియక చూద్దామని వెళ్ళి అలా ఏమీ కనపడక నీరసంగా తిరిగి వచ్చాను.. సినిమాల్లో మాత్రమే అలా చూపిస్తారని తెలుసుకున్నా..ఓపాఠంగా.
ఇక్కడ న్యాయవాదులకు మంచి పేరు ఉంది. ..
గడియార స్తంభం చౌరస్తా లాగా నరసరావుపేటకు ఓ గుర్తింపు గా ఉండేది.‌ అ దగ్గరలోనే గరళకంఠుడిగా శివునిబొమ్మ పెద్ద విగ్రహంతో చూపరులను ఆకర్షిస్తుంది. చాలా అందంగా తయారు చేసిన శిల్పమిది. ఇక్కడ నా స్నేహితుని‌ మిఠాయి దుకాణం‌ ఉండేది. గులాబ్ జామ్, కలాకాని చాలా బాగుండేవి. సాయంత్రం‌ సమోసాలు అమ్మేవారు.వీధుల్లో గోలీ సోడా అమ్మేవారు..మా అమ్మగారు రోజు ఒకటి తీసుకునేవారు. నాకు అలా అవి అలవడి, ఇప్పటికి నిమ్మకాయ సొడా అంటే ఇష్టం.
ఇక్కడి ఫర్నీచరు దుకాణాలు చాలా ప్రసిద్ధి..చాలా నాణ్యత గలిగి చౌకగా దొరుకుతాయి. వాలు కుర్చీలు, మడత మంచాలు ఎక్కువగా అమ్ముడయ్యేవి.క్లాత్ , బంగారు, కిరాణా షాపులతో కిటకిటలాడుతూ ఉంటుందీ ప్రదేశం..స్వీట్స్ వ్యాపారం చేసే మల్లమ్మ పేరుతో మల్లమ్మ సెంటర్ చాలా బిజీ సెంటర్.మనసున్న వ్యాపారులే అందరూ‌..వ్యాపారం కోసమనే కాకుండా ఎంతో చక్కగా పలకరిస్తూంటారు.. వీరిలో చాలామందికి ఉన్న సామాజిక సేవా తత్పరతను మెచ్చుకోవలసినదే..కపిలవాయి కాశీరామారావు గారు, వనమా సుబ్బారావు గారు, నాగసరపు సుబ్బరాయ గుప్త గారు, ఎంజె మాణిక్యాలరావు గారు ….ఇంకా ఎందరో ప్రముఖులు నరసరావుపేటకు పేరు తెచ్చారు.
నిగనిగలాడుతున్న కూరగాయల కుప్పలతో కూరగాయల మార్కెట్టు , సంత , నాన్న గారితో పాటుగా వెళ్ళి సంచీ నిండా వారంపాటు సరిపోయే కూరలు తెచ్చేవాళ్ళం..బేరమాడుతూ ఏరుకుంటూ తీసుకున్నా, విసుక్కోకుండా నవ్వుతూ అమ్మేవాళ్ళను ఇప్పటికీ మరచిపోలేను.
పాండురంగారావు మాష్టారు, స్వామి మాష్టారు ట్యూషన్లంటే బాగా పేరు. పోటాపోటీగా ఉండేవి. చదువులో ముందంజలో ఉన్నానంటే పాండురంగారావు గారు ఇచ్చిన శిక్షణ మూలం.
మ్యాధ్స్ మూర్తి గారు బుర్రమీసాలతో చలాకీగా చెప్పే తీరు అద్భుతం..వారి ట్యూషన్లు క్రిక్కిరిసి పోయిఉండేవి.‌
నేను బిట్స్ పిలాని లో చేరి ముంబాయి, బెంగుళూరులలో ఉద్యోగంతో మంచి పొజిషన్ లో ఉన్నానంటే ..వీరందరూ ఇచ్చిన విద్య సరస్వతీ ప్రసాదం.. ఇలా చదువులకు నెలవైన నరసరావుపేట లో చదివి మా క్లాస్ మేట్స్ అందరూ …అక్షరాలా ‘అందరూ ” చక్కగా జీవితాల్లో స్థిర పడ్డారు. అదృష్టవంతులైన కొందరు‌ నరసరావుపేటలోనే స్థిరపడ్డారు. వాట్సాపు ద్వారా ఇప్పటికీ అందరం కలిసే ఉన్నాం.‌ దేశ విదేశాల్లో స్థిరపడ్డ స్నేహితులు నిగర్వంగా అందరితో కలిసిపోతూ ఉంటాం.
ఎన్నో మధుర జ్ఞాపకాలను నింపిన నరసరావుపేట నగరానికి ఇతోధికమైన సేవలు చేస్తున్నాం.
ఇక్కడి విద్య, భక్తి, సాహిత్య పవనాలు నన్నూ తాకి , ఒక రచయితగా , సామాజిక సేవకునిగా చిన్నచిన్న అడుగులు వేయిస్తోంది.ప్రస్తుతం‌ ఎంతో అభివృద్దిని‌‌‌ సాధిస్తూ రాజకియంగా సామాజికంగా, సాహిత్యపరంగా ముందుకు సాగిపోతున్న నరసరావుపేటతో మంచి అనుబంధాన్నిచ్చిన తల్లిదండ్రులు-‌ దండెంరాజు లక్ష్మీ నారాయణ రావు గారు, నాగేశ్వరీ దేవి గారు, తోబుట్టువులకు, నా కుటుంబానికి, ఇక్కడి గురువులకు, స్నేహితులకు, పెద్దలకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.
వారి స్పూర్తి తో నేను స్థాపించిన‌ శ్రీ దండెంరాజు ఫౌండేషన్, జీ -3 సెర్వింగ్ హ్యాండ్స్ సామాజిక సేవా సంస్థలు, ‘సాహితీ భారతి’ సాహిత్య సంస్థ ఇతోధికంగా మా‌ నరసరావుపేటలో కూడా కృతజ్ఙతా పూర్వకంగా నిస్వార్ధ సేవలందించడానికి‌ ముందుకు రాబోతున్నాయని తెలియజేయడానికి‌ సంతోషంగా ఉంది.

– దండెంరాజు రామశర్మ
9663526008