రంగనాయకమ్మ బౌతికకాయానికి మంత్రి కొడాలి నాని ఘననివాళి

– వానపాముల గ్రామంలో ఘనంగా ముగిసిన అంతిమయాత్ర
గుడివాడ, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృమూర్తి దివంగత యార్లగడ్డ రంగనాయకమ్మ (86) భౌతిక కాయానికి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బుధవారం ఘనంగా నివాళులర్పించారు. దివంగత రంగనాయకమ్మ ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. నలుగురు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పెద్దకుమారుడు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగనాయకమ్మ తుది శ్వాస విడిచారు. ఇటీవల గుడివాడ పట్టణం బేతవోలులోని చిన్న వంతెన దగ్గర పద్మశ్రీ యార్లగడ్డ తన తల్లిదండ్రులు దివంగత యార్లగడ్డ అంకినీడు- రంగనాయకమ్మ విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. కాగా రంగనాయకమ్మ భౌతికకాయాన్ని స్వగ్రామం పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంత్రి కొడాలి నాని దివంగత రంగనాయకమ్మ బౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంగనాయకమ్మ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైసీపీ నేత పాలడుగు రాంప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.