ఫ్యూడల్‌ సంస్కృతి-రాజకీయ వారసత్వం!

( దివికుమార్)
భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మరణానంతరం రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆవిడ హత్యానంతరం ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రులుగా మొత్తం 38 సంవత్సరాలపాటు మనదేశాన్ని ఏలారు. రాజీవ్‌గాంధీ కూడా హత్య గావించబడిన తర్వాత కాంగ్రెసు పార్టీ వారు సోనియా గాంధీని రాజకీయాల్లోకి అడుగిడమని, పార్టీకి నాయకత్వం వహించమనీ విజ్ఞప్తులూ, వేడికోళ్ళూ చేస్తున్నారు.
ఇటీవలే ఆమె రాజకీయ ఆరంగేట్రం జరిగింది. కాంగ్రెసుకి మెజారిటీ లభించి లేక ఇతర పార్టీల తోడ్పాటు పొంది, అధికారంలోకి తిరిగి రాగలిగితే, సోనియాగాంధీ భారత ప్రధాని కాగలిగినా ఎవరూ ఆశ్చర్యపోవలసింది లేదు. ఆమె ఇటలీ దేశస్తురాలు కనుక భారతదేశంలో కీలక పరిపాలనా బాధ్యత స్వీకరించటానికి వీల్లేదని బి.జె.పి వారూ, కాంగ్రెసు వ్యతిరేక పక్షాలూ కూడదంటున్నాయే తప్ప వంశపారంపర్య పరిపాలనా రాజకీయాల్ని ఆచరణలో చిత్తశుద్ధితో వ్యతిరేకించడం వల్లకాదు.
ఆంధ్రాలో ఏం జరిగింది?
ఆంధ్రాలో ఎన్టీరామారావు బతికుండగానే ఆయన తదనంతరం రాజకీయ వారసత్వం ఎవరిదనే ఘర్షణ వచ్చింది. ఎన్టీఆర్‌ భార్య, ఇద్దరు అల్లుళ్ళు, ఒక కొడుకు వారసత్వపు పగ్గాలందుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీరామారావుని ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తే ఆయన భార్య లక్ష్మీపార్వతి అధికార పీఠాన్ని శైవసం చేసుకుంటుందని ఎన్టీఆర్‌ మొదటి భార్య తాలూకు కుటుంబ సభ్యులంతా భయపడ్డారు. లక్ష్మీపార్వతిని రామారావు భార్యగా గుర్తించడానికి నిరాకరించారు. లక్ష్మపార్వతి నైతికంగా విలువలు లేని మనిషిగా విపరీత ప్రచారం గావించారు.
ఎన్టీరామారావు సినిమారంగంలో ఎన్ని ‘తిరుగుళ్లు’ తిరిగినా ఆయన్ను ‘మగ మహారాజు’ గా పరిగణించేసి విమర్శకు అతీతుడుగా నిలబెట్టారు. ఎన్టీరామారావు లక్ష్మీ పార్వతితో అక్రమ రహస్య సంబంధాలకు పరిమితం కాకుండా, బహిరంగంగా భార్యగా ప్రకటించుకోవటాన్ని ఆయన కుటుంబ సభ్యులూ, చాలామంది ఆయన అభిమానులూ జీర్ణించుకోలేకపోయారు. తాను అధికార పీఠం నుండి గెంటివేయబడినా, అప్పటి దాకా భజనలు చేసిన స్వంత పార్టీ భక్త బృందాలూ, వామపక్ష బావమరుదులూ (ఉభయ కమ్యూనిస్టులూ లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్‌ బావ మరుదులుగా ప్రకటించబడ్డారు) ఆకస్మికంగా ప్లేట్లు ఫిరాయించినా, లక్ష్మీపార్వతి కారణంగా తాను పదవీచ్యుతుడైనట్లుగా ప్రకటించకుండా తన అంచంచల ప్రేమను ఎన్టీఆర్‌ ప్రకటించుకున్నాడు.
రాజకీయ వారసత్వానికై తీవ్రంగా పోటీ పడ్డది ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మాత్రమే! స్వంత పార్టీ ‘బంధు-మిత్ర’ పక్షాలు కూడా కుటుంబ సభ్యులను బలపరచటానికే శిబిరాలుగా చీలిపోయాయి. ఈ కుమ్ములాటలో మిగిలిన పోటీదారులు ముగ్గుర్నీ దాదాపు జీరోలుగా మార్చేసి చంద్ర బాబునాయుడు తానే హీరోగా వారసుడుగా నిలబడి పోయాడు.
దేశంలో ఎలా ఉంది?
ఒక్క కేంద్రంలోనూ, ఆంధ్రాలోనే ఈ రాజకీయ వారసత్వపు జబ్బు మిగిలిపోలేదు. తమిళనాడులో గతంలో ఎంజీఆర్‌ చనిపోగానే ఆయన “స్వంత మనిషి” జయలలిత,యుం.జీ.ఆర్‌. భార్య జానకి అమ్మాళ్‌ రాజకీయ వారసత్వానికై తీవ్రంగా పోటీపడ్డారు. జయలలిత గెలుపొందింది. నీరాజనాలతో, మిరుమిట్ల వెలుగుల్లో కొద్దికాలం మెరిసిపోయింది. డి.ఎం.కే. నాయకుడు, ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, మద్రాసు నగర కార్పోరేషన్‌ మేయర్‌ అయ్యాడు. ముఖ్యమంత్రి వారసత్వానికై అంగలారుస్తున్నాడు. భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ని మనం చూడొచ్చు.
50 సంవత్సరాల ‘స్వతంత్ర, ప్రజాస్వామ్య’ భారతంలో వంశపారంపర్యంగా రాజకీయ వారసత్వం బదిలీ కావట మన్నది కుటుంబపు ఆస్తిపాస్తులు, బాధ్యతలూ బదిలీ అయినంత తేలికగా జరిగిపోవటం, పైన పేర్కొన్న కొద్ది ఉదాహరణలలోనే కాక దేశవ్యాపితంగా విస్తారంగా కనిపిస్తాయి.
దేవిలాల్‌ కొడుకు చౌతాలా, చరణ్‌సింగ్‌ కొడుకు అజిత్‌ సింగ్‌లు తండ్రులు బతికుండగానే వారి అండదండలతో రాజకీయాల్లోకి ఎక్కి వచ్చారు. మన రాష్త్రంలో జలగం వెంగళరావు, పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, బైరెడ్డి శేషశయనారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి కొడుకులు కూడా రాజకీయాల్లోకి, మంత్రి పదవుల్లోకి తండ్రుల అండదండలతో ఎక్కి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులూ, ప్రధానులూ కాలేకపోవచ్చుగానీ ఎం.ఎల్‌.ఏ.లూ, ఎం.పి.ల వరకూ కాగలిగారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పశువుల దాణా కుంభకోణంలో అరెస్టయి జైలు పాలవక తప్పనిస్థితి ఏర్పడ్డప్పుడు ఆయన భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రి పదవిని చేబట్టి “సహధర్మచారిణి” బాధ్యతల్ని రాజకీయాల్లో కూడా నెరవేర్చగలుగుతున్నది. పురాణకాలంలో సత్యభామను మరిపిస్తున్నది.
మంత్రి పదవిలో ఉంటూ మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి మరణించగా ఆయన భార్య వరలక్ష్మి వెంటనే ఎం.ఎల్‌.ఏ. కాగలిగింది. అలాగే ఒంగోలు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు మాగుంట పార్వతి భర్త సుబ్బిరామిరెడ్డి హత్యకు గురవటం వల్ల వారసత్వంగా ఆ పదవిని పొందింది. నెల్లూరు జిల్లా కోవూరు నుండి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎం.ఎల్‌.ఏ.గా ఒకటికి మించిన సార్లే గెలుపొందాడు. కాంగ్రెస్, తెలుగుదేశంలోనూ అసంతృప్త నాయకునిగానే వుండేవారు. 1989 ఎన్నికల ముందు తెలుగుదేశం
పార్టీ నుండి బయటికొచ్చి రాష్ట్రమంతా తిరిగి, పెద్ద మీటింగులు పెట్టి, ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారమే చేశాడు. “తిట్టిన తిట్టు తిట్టకుండా” అన్నంతగా విమర్శించాడు. ఆయన కాంగ్రెస్‌ ఎం.ఎల్‌.ఏ.గా చనిపోయిన వెంటనే 1993లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, కొడుకు ప్రసన్నకుమార్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ టిక్కట్టుతో ఎం.ఎల్‌.ఏ. అయిపోయాడు.
ఇదేదో కేవలం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలలోనే జరుగుతోందనుకుంటే పొరపాటే!
1978 అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి సి.పి.యం. రాష్ట్ర నాయకుడు గుంటూరు బాపనయ్య గారు గెలుపొంది, అనారోగ్య కారణంగా మరణించగా, ఆయన భార్య ధన సూర్యావతమ్మ ఉప ఎన్నికలలో సిపియం అభ్యర్థిగా, తన భర్త బాపనయ్య గారికి ఏకాలంలోనూ సాధ్యంకానంత మెజారిటీతో గెలుపొందారు. చెన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండిన కాంగ్రెసు పార్టీ అనాటి నిడుమోలు ఉప ఎన్నికలలో తమ అభ్యర్థులెవరిన పోటీ కూడా పెట్టలేదన్నది గమనించాల్సిన విషయం. అలాగే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సి.పి.యం ( తెలుగుదేశం బలపరచిన) ఎం.ఎల్‌.ఏ. పుతుంబాక వెంకటపతి మరణించగానే ఆయన భార్య భారతి ప్రస్తుత ఎం.ఎల్‌.ఏ.గా ఉన్నారు. అయితే ఆమె తమదైన క్రియాశీల కమ్యూనిస్టు రాజకీయాల్లో చురుకుగా ఉంటూ వస్తున్నారు.
ప్రత్యేకించి మనం గమనించాల్సిన అంశమేమిటంటే భర్తలు మరణించిన వెంటనే భార్యలు లేక కొడుకులు వారసత్వంగా పొందేది లక్షలాది ఓటర్ల, సానుభూతితో గెలుపొందే అధికారాన్నే గాని, వారి వారి పార్టీలలో జిల్తా, రాష్ట్ర, కేంద్ర కమిటీల స్థాయిలోని బాధ్యతాయుతమైన పార్టీ సభ్యత్వం మాత్రం కాదు.
భర్త లేక తండ్రి చనిపోగానే కుటుంబ బాధ్యత మీద పడినంత సులువుగా భార్యలకో లేక వుత్రులకో ఎలక్షన్లలో సీటు యివ్వటం, వారు సాధారణంగా గెలవటం జరుగుతోంది. భర్త లేక తండ్రిని కోల్పోయిన వారిపట్ల సహజంగా చూపించే సానుభూతి, ఎన్నికల్లోనూ, ఓట్లు పొందటంలోనూ ప్రదర్శతమవుతోంది. పై సంఘటనలన్నీ సర్వసాధారణాలు కాకపోయినా సాధారణ విషయాలుగానూ, పరిగణించాల్సినవిగానూ ఉంటున్నాయి.
ఫ్యూడల్ యుగ లక్షణం!
భూస్వామ్య యుగంలో రాజకీయ రూపం రాచరికంగా వుండేది. రాజు తనను తానే ప్రకటించేకునేవాడు. అయితే భుజబలం, అంగబలం ఆ శక్తిని ప్రసాదించేవి. భూస్వామ్య యుగంలో వృత్తి ఉత్పత్తిదారులు, వారి నడుమ సాంఘిక సంబంధాలు, రాజకీయ పదవులు అన్నీ ఒకతరం నుండి మరొక తరానికి వంశ పారంపర్యంగా చాలా సహజంగా అనగా ఒక సంస్కృతిగా జరిగిపోయేది. మౌర్యుల నుండి మొగలాయీల దాకా అనేక వంశాల రాజకీయాధికారాల్ని మన దేశం చవిచూసింది. ఫ్యూడల్‌ యుగంలో రాజు కొడుకు రాజూ, పురోహితుడు కొడుకు పురోహితుడూ, కరణం కొడుకు కరణం, రైతు కొడుకు రైతూ, చేతి (కుల) వృత్తుల వారి సంతానం చేతివృత్తుల వారుగా వంశ పారంపర్యంగా సుదీర్ధకాలం పొందారు.
పాశ్చాత్య దేశాల్లో కులవ్యవస్థ రూపంలో నిర్దిష్ట వృత్తులే పాటించాల్సిన నిబంధన వుండేది కాదు గానీ రాచరిక వారసత్వపు మౌలిక లక్షణాలు మనకు లాగానే వుండేవి.
జార్‌లు, లూయీలు, హెన్రీలు, ఛార్లెస్‌లు మొదలైన వంశాలు పాలించేవి. అయితే రాజకీయాధికారానికి క్రూరమైన పోటీ వుంటుంది కనుక అరుదుగా తప్ప పది తరాలు పరిపాలించిన వంశాలు చాలా తక్కువగా ఉండేవి.పాశ్చాత్య దేశాల్లో ఫ్యూడల్‌ రాచరికాలను ప్రజావిప్లవాలతో కూలదోసి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని, ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకుని, తమ తమ రాజకీయ ప్రతినిధుల్ని ప్రజలే ఎన్నుకునే పార్లమెంటరీ పద్దతిని ఏర్పాటు చేసుకున్నారు. ఇంగ్లాండు, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ దేశాలు ఈ విషయంలో ముందడుగు వేశాయి.
మనదేశంలో ఫ్యూడల్‌ రాచరికానికి వ్యతిరేకంగా సన్న సన్నగా తిరుగుబాట్లు, పోరాటాలు పొడసూపుతూండిన కాలంలో బ్రిటీషు వలసవాదులు రాజకీయాధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని తమ దోపిడీకి అనువైన వ్యవస్థల్ని నిర్మించుకుంటూ వచ్చారు. భూస్వామ్య విధానాన్ని సంస్కరించి, ప్రజల తిరుగుబాట్ల నుండి ఫ్యూడల్‌ ప్రభువులను బ్రహ్మాండమైన తమ సైనికశక్తితో కాపాడారు.ఓటింగు (ఆనాటికి పరిమితమే!) ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని మనదేశంలో 1937లో ప్రవేశ పెట్టింది బ్రిటీషువాడే! అయితే మనదేశంలో పాశ్చాత్య దేశాల్లోలాగా విప్లవాత్మక పరిణామాలు, ప్రజావిప్లవాల ద్వారాకాక పై నుండి రుద్దబడిన లేక చేయబడిన సంస్కరణలతో చిట్టి పొట్టి మార్పులు కొన్ని సంభవించాయి. మన ఉత్పత్తి విధానంలో (భూస్వామ్య – వంశపారంపర్య కుల వృత్తులలో) కొద్ది మార్పులు మాత్రమే సంభవించాయి.
గత 150 సంవత్సరాల తర్వాత కొత్తగా వచ్చిన వృత్తులు, ఉద్యోగాలలో పాతకాలపు వంశపారంపర్య వారసత్వం సాగటం లేదు. కొత్త వృత్తులకు కొత్త విద్యా, నైపుణ్య అర్హతలు అవసరమయినాయి. ఇంజనీరు, డాక్టరు, లాయరు, లెక్చరర్స్‌ వెల్దరు, మెకానిక్‌, డ్రైవరు… గతంలో లాగా వంశపారంపర్యంగా కాలేరు. అయినా చెప్పులు కుట్టటం, బట్టలు నేయటం, కుండలు చేయటం, పంటలు పండించటం, దేవుని కొలవటం (అర్చకత్వం) లాంటివి పాత తరహా కుల వ్యవస్థ పరిమితుల్లో ఇంకా సాగుతూనే వున్నాయి. అందుకు బలమైన సాంస్కృతిక కారణాలు వుండినప్పటికీ ముఖ్యమైనది మాత్రం భూస్వామ్య ఉత్పత్తి విధానం ఇంకా మన దేశంలో కొనసాగుతూ ఉండటమే. మనది అర్ధవలస – అర్ధ ఫ్యూడల్‌ వ్యవస్థగా ఉన్నది కనుకనే! ఒకవైపున సామాజ్యవాదుల సహకారంతో భారీ పరిశ్రమలు నడుస్తూ వుంటాయి. మరొక వైపు గ్రామీణ ప్రాంతాలలో కూలీల, కౌలుదార్లతో సాగించే వ్యవసాయ తదితర ఉత్పత్తులూ విభిన్న వృత్తులూ కొనసాగుతూ వుంటాయి. ఈ ఉత్పత్తి విధానపు ప్రధాన లక్షణాలతోపాటు, వేల సంవత్సరాల ఫ్యూడల్‌ సంస్కృతీ ప్రభావం వెంటాడుతూ వుంటుంది. కనుక ప్రజలు మానసికంగా వంశపారంపర్య వృత్తులను ఆమోదించే స్థితిలో వుంటారు. అంతే సులువుగా రాజకీయ వారసత్వాన్ని కూడా కుటుంబీకులకు లభించటాన్ని సహజ విషయంగా భావిస్తారు.
ఆధునిక వారసత్వాలు!
ఈ భూస్వామ్య వ్యవస్థ యొక్క వారసత్వపు ప్రభావం ‘ఆధునిక’ యుగంలో పుట్టిన కొన్ని కొత్త వర్గాలపైన కూడాపడింది. వారిలో రౌడీలు లేక మాఫియా గ్యాంగుల నాయకులు ఒకరు. రౌడీ ముఠా నాయకుడు హత్యకు గురికాగానే (మొదటి తరం వారికది సహజం) అతని సోదరుడో, భార్యో ఆ స్థానాన్ని పొందుతారు. కొత్తవారికి గతంలో ఆ రంగంలో ప్రవేశమూ, నైపుణ్యమూ లేకపోయినా వీరి నాయకత్వానికై అనుచరులు అర్రులు చాస్తూ వుంటారు. పచ్చి ఫ్యూడల్‌ భూస్వాములున్న రాయలసీమలోనే కాక, అభివృద్ధి చెందిన బెజవాడ పట్టణంలో కూడా రౌడీల కుటుంబ వారసత్వం సహజంగా సంక్రమించటం మన సాంస్కృతిక విశేషం.
ఆధునిక పరిశ్రమలలో ఒకటయిన సినిమారంగానికి ఈ జబ్బు విస్తరించటం అత్యంత ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ మొదటి సినిమా విడుదల కాకముందే ఆయనకు అభిమాన సంఘాలు ఏర్చడ్డాయంటే అది వ్యూడల్‌ వారసత్వపు సాంస్కృతిక బలం కాక మరేమిటి? ప్రఖ్యాత సినీ హీరోల, దర్శకుల బిడ్డలుగా పుట్టటం తప్ప ఉచ్చారణ, భావ ప్రకటన ఎరగని వాళ్ళు కూడా మహా నటులని అనిపించుకోగలగుతున్నారంటే, కావాల్సినంత భూస్వామ్య సాంస్కృతిక నేపథ్యం ఎరువుగా ఉప యోగపడుతోంది కనుకనే!!
పుట్టుక కారణంగానే మేధో పరిజ్ఞానమూ, కళా నైవుణ్యమూ, ప్రతిభా సంపత్తి, ఉచ్చనీచాలూ, కులమూ సంక్రమిస్తాయనే కర్మ సిద్దాంతపు ఫ్యూడల్‌ సంస్కృతి విస్తారంగా మనల్ని యింకా ప్రభావితం చేయగలుగుతూనే వుంది కనుక దాన్ని వినియోగించుకుని ప్రయోజనం పొందే వర్గాలు ఇంకా ఇంకా ఆ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాయి.
ఎన్టీరామారావు కొడుకు హరికృష్ణ – భార్య లక్ష్మీపార్వతి కాకుండా అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం పట్ల బాధపడి పోయినవాళ్ళున్నారు. రేపు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మరధం పట్టటానికి సిద్ధంగా సాధారణ ప్రజలే కాదు, పెద్ద పెద్ద నాయకమ్మన్యులే వున్నారు. దీనిని కొందరు అవశేషంగా (ఇంగువ కట్టిన గుడ్డచందంగా) భావిస్తున్నారు. కానీ అది సరికాదు. భూస్వామ్య సంస్కృతి ఒక్కటే దీన్ని కాపాడటం లేదు. భూస్వామ్య వ్యవస్థ ఇంకా బలంగానే వుంది. వలస కాలంనాటి బ్రిటీషు వారి లాగానే మన “ప్రజాస్వామ్య” పాలకులు భూస్వామ్య వ్యవస్థనూ, దాని సమస్త దుర్గుణాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే పార్టీ నాయకుడూ రాష్ట్ర ముఖ్యమంత్రి లేక దేశ ప్రధానమంత్రి ఒకరే అయితే పార్టీలకూ కార్యకర్తలకూ తప్పుగా తోచటం లేదు. ప్రజల రాజకీయ చైతన్యస్థాయి కూడా, సైన్యాధిపతినే రాజుగా చూస్తున్నంత మామూలు విషయంగా భావిస్తున్న స్థితిలో వుంది.
అయితే ప్రజలు వేగంగా మార్పుని కోరుతున్నారు. దోపిడీ వర్గాల రాజకీయ నాయకులు ప్రజల్ని పక్కదారి పట్టించే క్రీడలో బాగా నైపుణ్యం సంపాదిస్తున్నారు. వ్యక్తిగత ఆస్థుల వారసత్వం లాగే రాజకీయ వారసత్వం కూడా సహజ విషయంగా భావించే వెనుకబాటు చైతన్యస్థాయిలోనే ప్రజల్ని ఉంచటానికి, దాదాపు ఎన్నికల పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. భూస్వామ్య వ్యవస్థను, దాని అంగాలను కాపాడుతూ వస్తున్నాయి.
వలస కాలపు వారసత్వం కూడా!
50 సంవత్సరాల క్రితం సామాజ్యవాదులు తెరవెనుకకు తప్పుకున్నా ఆనాటి విధానాలనే భారతదేశంలోని పాలక వర్గాలూ వారి రాజకీయ గ్రూపులూ అనుసరిస్తూ వస్తున్నాయి. ఒకనాటి పెట్టుబడిదారీ వర్గాలు రాచరికం యొక్క మూల వ్యవస్థ అయిన భూస్వామ్యాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని తమ తమ దేశాల్లో నెలకొల్పుకున్నాయి. ప్రపంచంలో అనేక ప్రగతిశీల మార్పులకు ప్రేరణగా కూడా అవి నిలిచాయి. వాటిల్లో 1789లో జరిగిన ఫ్రెంచ్‌ విప్లవం చాలా ప్రాముఖ్యత గలది. కానీ పెట్టుబడిదారీ విధానం తన విపరీత పారిశ్రామిక ఉత్పత్తి వేగం ఫలితంగా సంక్షోభంలో కూరుకుపోయి, పెట్టుబడిదారీ దేశాల మధ్య పోటీ పెరిగి తప్పనిసరిగా ప్రపంచ వ్యాపితంగా మార్కెట్లను కొల్లగొట్టటానికి వలస విధానాన్ని, తదనంతరం సామ్రాజ్య వాద పద్ధతులనీ అనుసరించవలసివచ్చింది.
అక్కడి నుండీ అవి ప్రపంచంలో అభివృద్ది నిరోధక పాత్రనూ, వెనుకబడిన దేశాలను అణచివుంచే పాత్రనూ నిర్వహిస్తూన్నాయి. పెట్టుబడిదారీ వర్గం ఏ భూస్వామ్య ఆర్థిక రాజకీయాలను (రాచరికాన్ని) విప్లవాత్మకంగా ఓడించిందో, తమ వలసలూ, పలుకుబడి గల దేశాల్లో వాటినే కాపాడే పాత్రను పోషిస్తూ వస్తున్నది. వెనుకవడిన దేశాలు భూస్వామ్య విధానాన్ని అంతం చేసి పెట్టుబడిదారీ దేశాలుగా అభివృద్ధి చెందితే అవి ప్రపంచ గుత్తాధిపతులుగా వున్న (అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్సు, జపాన్‌, తదితర) సామ్రాజ్య వాద దేశాలకు పోటీగా నిలిచే ప్రమాదం ఉంటుంది. కనుక చారిత్రకంగా కాలం చెల్లిన భూస్వామ్య విధానాన్ని కాపాడాల్సిన అనివార్య అభివృద్ధి నిరోధక కర్తవ్యం సామ్రాజ్యవాదులపై పడింది.
పెట్టుబడిదారీ విధానాన్ని అంతమొందించగల కార్మికవర్గం పైనే భూస్వామ్యాన్ని, దాని రక్షకులుగా ఉన్న సామాజ్యవాదాన్ని కూడా నిర్మూలించే బాధ్యత పడింది. రష్యా, చైనా దేశాల్లో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు విజయవంతమైన పిదప శ్రమ జీవుల రాజ్యంగా అవి నిలదొక్కుకోగలిగినంత కాలం పెట్టుబడిదారీ దేశాలకు సవాలుగా నిలిచాయి. వెనుకబడిన దేశాల ప్రజలకు ఆశాజ్యోతిగా వెలుగొందాయి. అవి
(రష్యా-చైనా) ఓటమికి గురై పెట్టుబడి దారీ దేశాలుగా రూపొందినపుడు కూడా పెట్టుబడిదారీ దేశాల మధ్య నుండే పోటీలో నిలిచాయి. 40 సంవత్సరాలుగా రష్యాదేశం అటు వంటి స్థితిలోనే వున్నది.
మనదేశాన్ని పరోక్షంగానే అయినా ఆర్థికంగా అదుపులో ఉంచుకుంటుంది. సామ్రాజ్యవాద దేశాలు భూస్వామ్య విధానాన్ని కాపాడే విధానాలనే పాటిస్తున్నాయి. సరళీకృత నూతన ఆర్థిక విధానాలు సంస్కరణలు పేరుతో సాగుతున్న సామ్రాజ్యవాద దోపిడీని మరింత తీవ్రతరం చేస్తూ తమ పట్టుని బలోపేతం చేసుకుంటున్నాయి. చారిత్రకంగా ఏనాడో కాలం చెల్లిన భూస్వామ్య విధానం సామ్రాజ్యవాదుల, వారి దళారీల అండదండలతో బతికి బట్టకట్టగలగుతోంది. కనుకనే దాని యొక్క రాజకీయ రూపమైన వారసత్వ రాజకీయాలు సహజమైనవిగా భావించే సంస్కృతి కొనసాగ గలుగుతోంది.
వ్యక్తిగత ఆస్తుల వర్గ సమాజం పుట్టిన కాలం నుండీ వారసత్వపు రాజకీయాలున్నాయి. కానీ పెట్టుబడిదారీ విధానం “ఆస్తిని మాత్రమే వారసత్వపుటవకాశంగా మిగిల్చి మిగిలిన వ్యవస్థల్లో (రాజకీయ, సాంఘిక, సంస్కృతిక) విష్ణవాత్మక మార్చులు తెచ్చి వారసత్వపు అవకాశాల్ని ఆ రంగాలలో సాపేక్షంగా తొలగించింది. భూస్వామ్య విధానం బలంగా కొనసాగుతున్న వెనుకబడిన దేశాలలో అన్ని రంగాలలో, ముఖ్యంగా రాజకీయాలలో కూడా పాత రాచరికం ప్రజాస్వామ్యం ముసుగులో ప్రస్ఫుటమవుతూనే వున్నది.
భూస్వామ్య-సామాజ్యవాదుల కలయిక మొత్తం రాజకియ వ్యవస్థనే దుర్గంధ భూయిష్టం చేసి అత్యంత అసహ్యకరంగా తయారు చేశాయి. ప్రజాస్వామిక ఎన్నికలలో డబ్బు, కులం, మతం, రౌడీయిజం, సారా ముఖ్యపాత్రను పోషించటానికి కారణం ఈ అపవిత్ర సంకర కూటమే!!! ప్రజలు రాజకీయాలంటేనే వాంతి చేసుకునేంతగా అవి కుళ్ళి పోయాయి.
కొంతమంది ఉదార ప్రజాస్వామిక వాదులు రాజకీయ వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తేవాలని ప్రతిపాదిస్తున్నారు. అవి అవసరమే. కానీ మురుగును నిర్మూలించకుండా దాని దుర్గంధంపై మాత్రమే పోరాటం చేస్తే, శవానికి సెంటు రాసినట్టే అవుతుంది గదా! అందుకే భూస్వామ్య సామ్రాజ్యవాదుల అపవిత్ర కలయికతో కుళ్ళి కంపుకొడుతున్న ఈ వ్యవస్థను నూతన ప్రజాస్వామిక రాజకీయాలతో ప్రక్షాళన చేయాలి. దానికి విప్లవాత్మక ప్రజాపోరాటాలు తప్ప మరే దగ్గర దారీ లేదు.
(1977 నుండి జనసాహితి నిర్వహణలో వెలువడుతున్న ప్రజాసాహితి 1998 జనవరి (195వ) సంచిక నుండి)