ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన మరియు పరిరక్షణకు సంబంధించిన కేసుల విచారణ, క్రొత్త కేసుల స్వీకరణకు గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 26 మరియు 27 తేదీలలో క్యాంపు కోర్ట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి తెలిపారు.
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులు దండే సుబ్రహ్మమణ్యం ( జ్యుడిషియల్ ) డా. గోచిపాత శ్రీనివాసరావు ( నాన్ జ్యుడిషియల్ ) లు మానవ హక్కుల ఉల్లంఘన మరియు పరిరక్షణకు సంబంధించి క్యాంపు కోర్ట్ నిర్వహించడం జరిగింది. నేడు నిర్వహించిన క్యాంపు కోర్ట్ లో 37 కేసుల విచారణ జరుగగా, అందులో 15 కేసులు తుది తీర్పు వెలువరించి పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి తెలిపారు. వాదప్రతి వాదనలు విని రెండు కేసులలో తీర్పును రిజర్వు చేయడం జరిగిందని, తుది తీర్పు ఇవ్వవలసి వున్నదన్నారు. తదుపరి విచారణ నిమిత్తం 20 కేసులు వాయిదాలు వేయడం జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి సంపర వెంకటరమణ మూర్తి, క్యాంపు కోర్ట్ నోడల్ అధికారి మరియు విభాగాదికారి బొగ్గరం తారక నరసింహ కుమార్, కమిషన్ కార్యాలయ ఉద్యోగులు, కక్షిదారులు పాల్గొన్నారు.