మీ దోపిడీలను, దందాలను వెలికితీస్తే చంపేస్తారా?
దాడులు, బెదిరింపులతో జర్నలిస్టుల గొంతు నొక్కలేరు
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిపై , వైసీపీ నేతల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై వైసీపీ రౌడీలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియా ప్రతినిధిపై మంత్రి జయరామ్ వర్గీయుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలు వాహనంతో అడ్డగించి చంపేందుకు ప్రయత్నించారంటే వైసీపీ గూండాలు ఎంత బరితెగించి వ్యవహరిస్తున్నారో అర్దమౌతోంది.
మంత్రి గుమ్మనూరు జయరాం ఆద్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో పేకాట, మట్కా, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించటంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం స్మగ్లింగ్ చేసి ఏరులై పారిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలిసిన నగ్నసత్యాలు. వీటిపై వార్తలు రాస్తే చంపుతారా? వైసీపీ నేతల దందాలు, భూకబ్జాలు, దోపిడీలపై వార్తలు రాయకూడదా?
మీరు ప్రజలను, సహజ వనరుల్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? దాడులు, బెదిరింపులతో జర్నలిస్టులను భయపెట్టలేరు. వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు జర్నలిస్టులు, ప్రజలు సిద్దంగా ఉన్నారు. మీడియా ప్రతినిధిపై హత్యాయత్నం చేసిన మంత్రి జయరాం అనుచరులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.