మహాత్మా గాంధి ఒక స్వేచ్ఛావాది. ప్రభుత్వం వల్ల మంచి కన్నా హాని ఎక్కువ జరుగుతుందని, నెహ్రూ సోషలిజాన్ని తలకు ఎత్తుకోవడానికి దశాబ్దాల ముందే చెప్పాడు.
జూలై 2, 1931, యంగ్ ఇండియాలో గాంధీజీ ఏమి రాశారో చదివితే ఆశ్చర్యపోతారు:
“In the ideal State, therefore, there is no political power because there is no State. But the ideal is never fully realized in life. Hence the classical statement of Thoreau that the government is best which governs the least is worthy of consideration.”
ప్రభుత్వం లేని సమాజం అత్యంత ఆదర్శవంతమైనది. అయితే, ప్రభుత్వ రహిత సమాజ నిర్మాణం, ఈ జీవిత కాలంలో సాధ్యం కాదు. కాబట్టి, అతి తక్కువగా పాలించే ప్రభుత్వం అత్యంత ఉత్తమమైనది.
గాంధీ గారు చెప్పిన ఈ ఒక్క సూత్రాన్ని కనుక మనం అమలు చేసివుంటే.. మనం ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా ఎదిగే వాళ్ళం. ఇంత నమ్మకంగా ఎట్లా చెప్పగలను? మన దేశంలో పదో వంతు లేని తైవాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, సింగపూర్ లను చూడండి మీకు అర్థమవుతుంది.
దురదృష్టవశాత్తు, గాంధీ ఉద్బోధించిన చిన్న ప్రభుత్వాన్ని బుట్టదాఖలు చేసి, సోషలిజాన్ని ఎత్తుకొని దేశాన్ని ఆర్థికంగా నాశనం చేశాడు నెహ్రూ.
అంతే కాదు, గాంధీ గారు ఉద్బోధించిన గ్రామ స్వరాజ్యాన్ని మనం కనుక అమలు చేసి ఉంటే, మన పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ టీచర్లు-స్కూళ్లు, కోర్టులు అన్నీ ప్రజలచే ఎన్నుకోబడ్డ గ్రామ ప్రభుత్వాల ఆధీనంలో ఉండేవి. అప్పుడు ఈ దుర్మార్గపు ప్రభుత్వ ఉద్యోగులు, మన రక్తం జలగల్లా పట్టి పీల్చకుండా ఉండేవాళ్ళు. గ్రామ ప్రభుత్వాలకు వీళ్ళు జవాబుదారీలుగా ఉండేవాళ్ళు. ఈనాటి ప్రభుత్వ అరాచకాలు చాలా వరకు అదుపులో ఉండేవి.
అయితే ఒక స్వేచ్చావాది అయిన గాంధీ సిద్ధాంతంలో, కొన్ని పరస్పర విరుద్ధ భావాలు ఉండటం మూలంగా, స్వేచ్చావాదులలో ఆయన పట్ల కొంత ప్రతికూలత ఏర్పడింది.
ఇందులో రెండు ముఖ్యమైనవి-
మొదటిది గాంధీ గారు ప్రతిపాదించిన మద్యపాన నిషేధం. మనిషికి తన శరీరం మీద పూర్తి హక్కులు ఉండాలి. ఏమి తినాలి, ఏమి తాగాలి అనేది వ్యక్తిగత విషయం. కాబట్టి మద్యపాన నిషేధం స్వేచ్ఛావాద సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకం.
రెండవది ట్రస్టీ షిప్. ఒక వ్యక్తి తను వ్యాపారంలో సంపాదించిన డబ్బు, లేక వంశపారంపర్యంగా సంక్రమించిన సంపదను, స్వచ్ఛందంగా ఒక ట్రస్టీ షిప్-లో పెట్టి పేద ప్రజల బాగోగుల కోసం ఉపయోగించాలని గాంధీ గారు ప్రతిపాదించారు. ఇది గాంధీ గారికి అర్థశాస్త్రం మీద ఉన్న అవగాహనా లేమిని ఎత్తి చూపుతోంది. లాభాపేక్ష చచ్చిపోయిన రోజు, మానవ సమాజం అంతరించిపోతుంది. ఈ మౌలిక జీవన సూత్రాన్ని గాంధీజీ గ్రహించలేక పోయారు.
ఇటువంటి కొన్ని సైద్ధాంతిక లోపాలు ఉన్నప్పటికీ.. గాంధీ గారు, ప్రభుత్వం ఒక హింసాయుత వ్యవస్థ అన్న అత్యంత మౌలిక వాస్తవాన్ని, దాదాపు వంద సంవత్సరాల క్రితమే గుర్తించడం అభినందనీయం.
