– రాజధాని.. మా బతుకు పోరాటం.. 130 ఏళ్ళ మా ఆవేదన, మా ఘోష
– ఇన్నేళ్ళకు రాజధాని వస్తుంటే.. అడ్డుకోవడం ధర్మమా బాబూ..?
– మా వేళ్ళతో మా కళ్ళని పొడుస్తామంటే సహిస్తామా..?
– రాష్ట్ర సంపదనంతా అమరావతిలోనే పెట్టాలనడం ధర్మమా..?
– అమరావతి సెంటిమెంట్ లేదు కాబట్టే.. లోకేష్ ఓడిపోయాడు
– దమ్ముంటే రాజధానిగా విశాఖ వద్దు అని చంద్రబాబు చెప్పాలి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అసమానతలను సరి చేస్తుంటే.. అడ్డుపడతారా..?
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మరెంతకాలం కూలీలుగా, గేటు కీపర్లుగా బతకాలి. రాష్ట్రంలోని ఒక ప్రాంతం అభివృద్ధి చెంది.. మరో ప్రాంతం వారు అభివృద్ధి చెందకపోతే అసమానతలు ఉంటాయి. అభివృద్ధి చెందిన వారు వెనుకబడిన ప్రాంతం ఆస్తులను దక్కించుకుంటున్నారు. ఒకప్పుడు రైతులుగా బతికినవారు.. ఇప్పుడు వాచ్ మెన్లుగా, గేట్ కీపర్లుగా మారిపోతున్నారు. అభివృద్ధిలో అసమానతలు ఉండబట్టే, వెనుకబడిన ప్రాంతంలోని సంపదను సంపన్నులు ఆక్రమించుకుంటున్నారు.
శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు రోడ్డు వెంట ఉన్న సంస్థలు, భూములు ఎవరివి..?. గతంలో ఆ భూములకు యజమానులుగా ఉన్నవారు ఇప్పుడు వారి గేట్ కీపర్లు అయ్యారు. ఇంతటి అసమానతలు ఉన్నప్పుడు, ఇంత తేడాలు ప్రాంతాల మధ్య ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని మార్చడం, సమగ్రాభివృద్ధి చేయడం పాలకుల విధి. రాజ్యాంగం ప్రకారం చూసినా, దానిని పాలకులే సరిదిద్దాలి. రాజకీయ పార్టీలంతా ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అదే చేస్తున్నారు. మేలు చేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో అడ్డుపడుతున్నాయి. దీంతో మా ప్రాంతం వాసుల గుండెలు మండుతున్నాయి.
అటు రాయలసీమ ప్రాంతంలోనూ, ఇటు ఉత్తరాంధ్రలోనూ ఇదే కనిపిస్తుంది. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నాం. విశాఖపట్నం రాజధాని అవుతుంటే.. మీకెందుకు అభ్యంతరం..?. ఇంకా ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందనివ్వకుండా దోచుకోవాలని చూడటం అన్యాయం. మా కోరిక ధర్మం, మా ఆవేదన ధర్మం అని అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్పాలి కదా.. చెప్పకపోగా, ఈ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్వాగతించకపోగా అడ్డుకోవడం ధర్మమా..?
చంద్రబాబు సమాధానం చెప్పాలి
విభజన చట్టం ప్రకారం కేంద్రం, సెక్షన్ 6 కింద నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీలోని మేధావులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, కొన్ని సిఫార్సులు చేస్తే, ఆ సిఫార్సుల్లో విశాఖపట్నంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకోవాలని సూచిస్తే.. వాటిని ఎందుకు పట్టించుకోలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కానీ చంద్రబాబు దానిపై మాట్లాడరు. రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం వేసిన కమిటీని కాదని.. మీకు అనుకూలమైన వారితో కమిటీ వేయించింది వాస్తవం కాదా.. ?. అసలు చంద్రబాబు కమిటీని వేయవచ్చా..?.
నిపుణుల కమిటీ నివేదికను పక్కన పెట్టి, నారాయణ నేతృత్వంలో సుజనా చౌదరి, గల్లా జయదేవ్ లతో పార్టీ కమిటీ వేసి తప్పు దారి పట్టించారు. కాపిటల్ కు కాస్మోపాలిటిన్ వాతావరణం ఉండాలి. విశాఖలో ఆ తరహా వాతావరణం వుంది. అలాంటి విశాఖను వదిలేసి, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఒక ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టి రాజధాని అంటే ఎవరు ఆమోదిస్తారు?. అమరావతి లో ఇతరులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భూమి కొనే అవకాశమే లేదు. అక్కడ ఒక సామాన్యుడు సొంత ఇల్లు కట్టుకోగలడా..?. సామాన్యులు అక్కడ ఉండటానికి అవకాశం లేని వాతావరణం తేవాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాం. అమరావతి సెంటిమెంటే ఉంటే.. అమరావతిని మీరు అభివృద్ధి చేసి ఉంటే, ఆ ప్రాంతంలో మంగళగిరిలో మీ కొడుకు ఎందుకు గెలవలేదు..?
విశాఖే అందరికీ ఆమోదయోగ్యమైన క్యాపిటల్
దేశంలో మహానగరాలుగా ఉన్న కోల్ కత్తా, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో మాదిరిగా స్వేచ్ఛగా బతికే వాతావరణం అమరావతిలో ఉంటుందా…?. అంటే ఉండదు. అదే విశాఖపట్నంలో అన్ని తరగతులవారు, అన్ని కులాల వారు, అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని ప్రాంతాల వారు నివాసం ఉంటున్నారు. అభివృద్ధి చెందిన మహా నగరాల తరహాలో… స్వేచ్ఛగా బతికే పరిస్థితి రాష్ట్రంలో విశాఖపట్నంలోనే ఉంది. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలని కోరుతున్నాం. అమరావతికి ఆ పరిస్థితి లేదు.
ప్రజా మోదం అంతకంటే లేదు. విశాఖనే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రాజధాని నగరం అంటే మధ్యన ఉండాలని కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళకు నా సమాధానం ఒక్కటే.. చెన్నై గానీ, హైదరాబాద్ గానీ, కోల్ కత్తాగానీ.. ఆ రాష్ట్రాలకు మధ్యన ఉన్నాయా..?. అసలు అమరావతికి ఇతర ప్రాంతాల వారు వచ్చే పరిస్థితి ఉందా..?. ఇతరులను అక్కడకు రానివ్వని పరిస్థితి. బతకనివ్వని పరిస్థితి ఉంది. ప్రజల ఆమోదం లేనటువంటి ప్రాంతంలో మీరు రాజధాని పెట్టి.. అదే రాజధాని అని యాత్రల పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఇతరులకు ఎవరికీ చోటు లేని అటువంటి ప్రాంతంలో రాజధాని అని చెబితే.. ఎవరు మాత్రం హర్షిస్తారు.?.
అదేవిధంగా మీ ఆలోచనలకు అనుగుణంగా మీ మనుషులు అక్కడ భూములు కొనుగోలు చేశారు. ఆ విషయాన్ని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలోనే చెప్పారు. దీని వల్ల బోలెడంత ప్రమాదం ఉంది. ఇతరులకు ఎవ్వరికీ చోటు లేని నగరాన్ని తీసుకుని రావాలని మీరు యోచిస్తున్నారు. అందుకే లెజిస్లేటివ్ క్యాపిటల్ ను అమరావతిని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించాం. శ్రీ బాగ్ ఒప్పందంలో ఉన్నటువంటిది కూడా అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదనే. ఇంకోవైపు రాజధానులు మార్చుకుంటూ వెళతారా.. అని మాట్లాడుతున్నవారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడే మారిందా..?. గతంలో మారలేదా..?. చెన్నై నుంచి కర్నూలు.. కర్నూలు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి అమరావతికి రాలేదా.. ఇప్పుడు అమరావతి నుంచి విశాఖకు వస్తే తప్పేంటి..?
విశాఖను రాజధానిగా వద్దు అనటానికి బాబు ఎవరు..?
అమరావతి రాజధాని కావాలని అడిగారంటే ఏమైనా అర్థముంటుంది.. విశాఖను రాజధానిగా వద్దు అని చెప్పటానికి చంద్రబాబు ఎవరు..?. ఆయనకు ఏం అధికారం ఉంది. దమ్ముంటే చంద్రబాబు విశాఖ రాజధానిగా వద్దు అని బహిరంగంగా చెప్పాలి. అమరావతినే మీరు అభివృద్ధి చేసి, మహానగరంగా చేస్తామని చెబితే.. మీ కొడుకు అయినా అక్కడ గెలిచాడా..?. లేదు. ఇక మేం ఉత్తరాంధ్రకు ఏం చేయలేదు అని అంటున్నారు. 1995 నుంచి 14 ఏళ్ళ పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ మాట మాట్లాడటానికి, వారికి వత్తాసు పలికే మీడియాలో ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గు లేదా…? అని అడుగుతున్నాం.
14 ఏళ్ళు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేశారు బాబూ..?
ఉత్తరాంధ్రలో తన 14 సంవత్సరాల్లో బాబు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా? మరి ఈ విషయంలో సిగ్గుపడాల్సింది మీరు కాదా? మేం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. అందులో రెండేళ్ళు కొవిడే. అయినా ఈ మూడేళ్ళలోనే ఎంతో అభివృద్ధి చేశాం. 3 జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. జిల్లాల ఏర్పాటు అభివృద్ధిలో భాగం కాదా. ఆరు జిల్లాల్లో జరిగిన అభివృద్ధి చూడండి. ప్రతి జిల్లాకూ ఓ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా.. అదేవిధంగా ఐటీడీఏల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
ఉద్దానం ప్రాంతంలో మంచి నీటి ప్లాంటుకు రూ. 700 కోట్లు వెచ్చించాం. కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు వంశధార నీరు అందించబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశాం. పలాసలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటు కృషి చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాకు జీవనాడి అయిన వంశధార విషయంలో మీ పాలనలో ఏరోజుకూడా శ్రద్ధ పెట్టలేదు. చివరికి రాజశేఖరరెడ్డి సైడ్ వ్యూయర్ కట్టి.. దారివెంబడి జలాశయాలు నిర్మించి హిరమండలానికి నీరు తెచ్చే ప్రాజెక్టును దాదాపు పూర్తిచేశారు. మీ ఐదేళ్లలో మిగిలిపోయిన చిన్నపాటి పనులు పూర్తిచేయలేకపోయారు. ఒడిశాతో వివాద పరిష్కారానికి ఏనాడూ ప్రయత్నించలేదు. ముఖ్యమంత్రి ఒడిశా వెళ్లి అక్కడ సీఎంతో కలిసి మాట్లాడి, సహకరించండి అని కోరారు. అలాంటిది నేరడి వద్ద బ్యారేజీ కట్టే లోపలే ఈ ప్రాంతానికి మేలు చేయాలని గొట్టాబ్యారేజీ వద్దే ఎత్తిపోతల పెట్టి హిరమండలాన్ని సస్యశ్యామలం చేసే గొప్ప ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. విభజన తరువాత పరిహారం కింద కేంద్రం ఇచ్చిన సంస్థలలో ఈ ప్రాంతానికి ఎనిమిది సంస్థలు రావాలి. కానీ రాలేదు.
క్యాపిటల్.. మా బతుకు పోరాటం
క్యాపిటల్ అన్నది మా బతుకు పోరాటం. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న మా ప్రాంత వెనుకబాటు తనాన్ని పోగొట్టేందుకు వచ్చిన ఒక అవకాశం. 130 ఏళ్ళ ఆవేదన మాది. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. క్యాపిటల్ వస్తే.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాకు వస్తాయి. ఈ ప్రాంతం గుండె ఘోషను, ఆవేదనను చెబితే.. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, విమర్శలు చేస్తారా..?. మా ప్రాంతం వాసుల చెయ్యి పట్టుకుని, మా వేళ్ళతోనే మా కళ్ళు పొడుస్తారా..?. రాష్ట్రానికి ఒనగూరిన సంపదంతా.. రాష్ట్రం మొత్తం పంచాలని రాజ్యాంగంలోనే చెప్పబడింది. దీన్ని డైవర్ట్ చేసేందుకు విశాఖలో భూములపై టీడీపీ, ఎల్లో మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు.
దసపల్లా భూములు అన్నవి ప్రైవేటు భూములని హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చాయి. అటువంటప్పుడు ప్రభుత్వం చేయగలిగింది మాత్రం ఏముంది? . మా స్థానంలో మీరు ఉన్నా ఏం చేసేవారు..?. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వారికి అనుకూలంగా వచ్చింది. ఆతర్వాత కంటెప్ట్ ప్రొసీడింగ్స్ చేపడతామని హై కోర్టు చెప్పడంతో ఆ భూములను అప్పగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంది? దీంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?. ఇందులో ప్రభుత్వం తప్పుగానీ, దోపిడీగానీ ఉందా..?. ఎటువంటి దాపరికం ఇందులో లేదు, ప్రభుత్వ భూమి ఎవరికీ ఇవ్వలేదు. ఇలా ఏ అంశం చూసుకున్నా.. ప్రభుత్వంపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తుంది.
ఒకటికి మించి రాజధానులు ఉండటం కొత్తేమీ కాదు..
క్యాపిటల్ అన్నది ఏ ఒక్కరి జాగీరు కాదు.. మా ప్రాంతానికి వచ్చి, మాకు రాజధాని వద్దు అని చెబితే.. దానిని మాకు చేస్తున్న ద్రోహంగానే చూస్తాం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. 3 రాజధానులు అని అంటే కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా వికేంద్రీకరణే అభివృద్ధికి మార్గం, మంత్రం అని చాటి చెప్పారు. ఒకటికి మించి రాజధానులు ఉండటం ఇదే కొత్త కాదు. ఇదేమీ విచిత్రమూ కాదు. సౌత్, నార్త్ రాష్ట్రాల్లో పలు రాజధానులు ఉన్నాయి. రాజధాని ఎలా ఉండాలనేది… మీరు చెప్పేది క్లోజ్డ్ మోడల్.. మేము చెబుతున్నది విశాలమైనదిగా ఉండాలని. అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలని కోరుతున్నాం.
ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీ ఆందోళనలను విరమించుకోవాలి. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం తీసుకున్న పాలసీ.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ నివేదికలో చేసిన సిఫార్సుల ప్రకారమే వచ్చింది. ఆ సిఫార్సులను అమలు చేయకుండా తప్పు చేసింది చంద్రబాబే. శివరామకృష్ణన్ కమిటీకి, చంద్రబాబు వేసిన నారాయణ కమిటీకు చాలా వ్యత్యాసం ఉంది. నారాయణ కమిటీ అన్నది మీ కనుసన్నల్లో, మీ ఆదేశాలతో, మీ లోపాయికారి ఒప్పందాలను అమలు చేయడానికి వేసిన కమిటీనే తప్ప అందులో ప్రజా ప్రయోజనాలు లేవు.
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా, ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెంది.. మిగతా ప్రాంతం అభివృద్ధి చెందకపోతే.. దాంతో ప్రజల మధ్య అసమానతలు వస్తాయి. అందుకే మేము గొంతు ఎత్తి చెబుతున్నాము. ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయమని. దానిని అడ్డుకుని మా కళ్ళు పొడుస్తామంటే మేం సహించం. ఉద్యమానికి అవసరమైతే.. ముఖ్యమంత్రి అనుమతితో మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం..అని మరోసారి పునరుద్ఘాటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.