విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకం కు శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు శరీరానికి కలిగే ఘాతం విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంతో తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. విద్యుత్ ప్రజల జీవన నాడి. నేడు విద్యుత్ లేని సమాజాన్ని ఊహించుకోవడమూ కష్టమే.
కరెంటును సరైన రీతిలో వాడుకుంటే ఎంత ఉపయోగకరమో, ఏమరుపాటుగా ఉంటే అంతే హానికరం. ఒక ఆంపియర్ కరెంటులో పదో వంతు మానవుడి శరీరంలో మూడు సెకన్ల పాటు ప్రసరిస్తే మరణించే ప్రమాదం ఉంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో 2019లో 22,442 విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోగా- 13,432 మంది చనిపోయారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 908, తెలంగాణలో 735 మంది చొప్పున ఉన్నారు. ఇవికాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మరో 1,990 మంది ప్రాణాలు కోల్పోయారు. సగటున రోజుకు 43 మంది విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వీరిలో అధికశాతం చేతి వృత్తిదారులు, రైతులే కావడం కలవరపరచే అంశం.
రోజుకు 15 మూగజీవాలు విద్యుదాఘాతాలకు బలి అవుతున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) లెక్కలు తెలియజేస్తున్నాయి. సహజంగా లేదా గాలి దుమ్ము, భారీ వర్షాలు, తుపాన్లు వంటివి సంభవించినప్పుడు- నేలపై పడిన తీగలను, స్తంభాలను, సపోర్ట్ తీగలను తాకరాదు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు వెళ్ళకూడదు. విద్యుత్ సమస్యలుంటే నిపుణులైన సిబ్బందికి సమాచారం అందించాలే తప్ప స్థానికులు సొంతంగా మరమ్మతులు చేయకూడదు.
విద్యుత్ తీగల కింద ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు. బోర్లు వేయరాదు. ముఖ్యంగా పట్టణాల్లో చేతికందే దూరంలోనే కరెంటు సరఫరా తీగలు ఉండటం ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతోంది. లైన్ల కింద నుంచి ఎత్తయిన వాహనాలు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ తీగలకు దగ్గరలో పతంగులను ఎగుర వేయకూడదు. పిల్లలకు విద్యుత్ పరికరాల వాడకంపై అవగాహన పెంచాలి. నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ముప్పు సంభవిస్తుందో వివరించాలి.
భారత్‌లో విద్యుత్ సంస్థలు ఏటా మే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తూ ప్రజల్లో, సిబ్బందిలో విస్తృత అవగాహన కల్పిస్తూ ఎందరినో జాగృతం చేస్తున్నాయి. పరికరాల తయారీదారులు, విద్యుత్ సంస్థల క్షేత్రస్థాయి సిబ్బంది, పరిశ్రమల కార్మికులు, వినియోగదారులు భద్రతా ప్రమాణాలు పాటించినట్లయితే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఎల్టీ, హెచ్‌టీ లైన్లను కనిష్ఠంగా 19 అడుగుల ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ కట్టడాలు, చెట్ల నుంచి కనీసం నాలుగు అడుగుల దూరంలో ఏర్పాటు చేయాలి.
ట్రాన్స్ఫార్మర్లను ఆరడుగుల ఎత్తులో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నెలకొల్పాలి. జనావాసాలు, రోడ్లపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలి. వేలాడే తీగలను ఎప్పటికప్పుడు సరిచేయడం, తుప్పు పట్టిన, కాలం చెల్లిన స్తంభాలను మార్చడం ముఖ్యం. విద్యుత్ లైన్లలో మరమ్మతులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేట్లు చూడాలి. విద్యుత్ సిబ్బంది లైన్లపై పని చేసే ముందే ఎర్తింగ్ సరిచూసుకోవాలి.
ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు రెండు ట్రాన్స్ఫార్మర్లను నిశితంగా గమనించాలి, హైవే , జాతీయ రహదారులపై వెలసిన ట్రాన్స్ఫార్మర్లు చెట్లు, తీగలతో కప్పబడి ఉంటున్నాయి. ఇక మారుమూల ఉన్న ట్రాన్సఫార్మర్లు ఎలాఉంటాయో ఊహించగలం. ప్రతి ట్రాన్సఫార్మర్ దగ్గర న్యూట్రల్ సున్నా ఉండాలి కానీ 20 నుండి 60 చూపుతుంటుంది. ఇళ్లల్లో వోల్టేజి 260 ఉంటున్నది, హై వోల్టేజి కారణంగా గృహోపకరణాలు తరచూ మరమ్మత్తులకు గురైతున్నాయి. వినియోగదారులు ఐఎస్ఐ ప్రమాణాలుగల పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలి.
స్తంభం నుంచి అతుకులు లేని సర్వీస్ తీగ నేరుగా మీటర్ వద్దకు వచ్చేలా ఉండాలి. మీటర్‌కు చేరువలో తప్పనిసరిగా ఒక ఎర్త్ పిట్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన విద్యుత్ సరఫరా మొదలయ్యే దగ్గర ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ (ఈఎల్సీబీ) బిగించుకోవాలి. మోటార్లు, ఏసీలు, గీజర్లు, రిఫ్రిజిరేటర్, మిక్సీ తదితర ఉపకరణాలను మూడు పిన్నుల సాకెట్‌తో మాత్రమే వాడాలి. రైతులు ఐఎస్ఐ ప్రమాణాలు గల మోటార్లు, స్టార్టర్లు వాడాలి. వీటి పైభాగాన్ని వైరుతో ఎర్త్ పిట్‌కు అనుసంధానిస్తే- అనుకోకుండా వాటిని తాకినా, విద్యుదాఘాతానికి గురికాకుండా తప్పించుకోవచ్చు.
రైతులు నీటి పైపులు విద్యుత్ లైన్లు కలవకుండా చూసుకోవాలి. వ్యవసాయ పంటల రక్షణ కంచెకు లేదా జంతువుల వేటకు విద్యుత్‌ను వాడరాదు. విద్యుత్ అధికారులు డిపాజిట్, బకాయిలు, వినియోగదారుడిని ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే తప్ప తాము చేయాల్సిన పని చేయటం లేదు. ఏసిడి డిపాజిట్లు నిన్న మెమో ఇచ్చి ఈ రోజు కనెక్షన్ తీస్తున్నామని చెపుతున్నారు. నోటీసు ఇచ్చి రెండు రోజులకు నాలుగుసార్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. హై ఓల్టేజి తో లక్షల రూపాయల విద్యుత్ ఉపకరణాలు బుగ్గిపాలవుతున్న పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించే పనిలో నిమగ్నమై నారు.