-దిగుమతి సుంకాల శాపం
-మళ్లీ సామాన్యుడిపై ధరాఘాతం
– కొద్ది కాలం క్రితమే 50 రూపాయిలు తగ్గిన నూనె ధరలు
– మళ్లీ ఇప్పుడు సామాన్యుడికి ‘మంట’ నూనె
– రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియాలో వర్షాలే కారణమట
– పెరిగిన డిమాండ్ కూడా ధరల మంటకు కారణమేనట
– ముడి పామాయిల్‌పై దిగుమతి టాక్స్ రద్దు
– రైతులను ఆదుకునేందుకే ధరల మంట పెడుతున్నారట
-దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
తగ్గించినంత సేపు పట్టలేదు.. పెంచే నూనె రేట్ల ధరల సంబరం. తగ్గించిన ఆనందం ఆవిరయేందుకు, నెలలు కూడా పట్టలేదు. కొద్దికాలం క్రితమే వంట నూనె ధరను.. 200 రూపాయల నుంచి 150
రూపాయలకు తగ్గించిన కేంద్రం, మళ్లీ వంట నూనె ధరలకు మంట పెట్టబోతోంది. 50 రూపాయల ధర తగ్గించి.. సామాన్యుడి పెదవులపై చిరునవ్వులు పూయించిన మోదీ సర్కారు, సడన్‌గా మళ్లీ రేట్లు పెంచి, మళ్లీ కొత్తగా ‘పాత షాకి’చ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇంతకూ అప్పుడెందుకు తగ్గించారు? ఇప్పుడెందుకు పెంచుతున్నారంటే.. అప్పట్లో ధరల పెరుగుదలపై జనం నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమయింది. ఇప్పుడేమో పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతానికి పెంచడం వల్ల, ఆ భారం వినియోగదారులపై వేయక తప్పదట. అయితే.. ఈ పెంపు ఆయిల్ సీడ్ ధరలు తగ్గడంతో, రైతులను ఆదుకునేందుకేనన్నది కేంద్రం ఉవాచ. ఈ మంట నూనెల కథేమిటో చూద్దాం రండి.
సామాన్యులకు షాకిచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140-150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం వినియోగదారులపైనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో ధరల నియంత్రణలో భాగంగా ముడి పామాయిల్‌పై దిగుమతి ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఆయిల్ దిగుమతి సుంకాలను పెంచడంతో త్వరలో వంటనూనెల ధరలు పెరగనున్నాయి.
ఆయిల్ సీడ్ ధరలు తగ్గడంతో రైతులను ఆదుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది. దేశీయంగా రైతులకు ప్రోత్సహించడానికి క్రూడ్ పామ్ ఆయిల్‌కు, ఆర్బీడీ మధ్య సుంకం వ్యత్యాసం 12 నుంచి 13 శాతం వరకు ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ అధిక మొత్తంలో ఆయిల్‌ను రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి
దిగుమతి చేసుకుంటోంది. అయితే ఆయా దేశాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడం, అలాగే డిమాండ్ పెరిగిపోవడం వంటి అంశాల కారణంగా కూడా వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధరలు తగ్గినప్పుడు పొంగిపోవడం.. పెంచినప్పుడు కుంగిపోవడం మనకు అలవాటే కదా? మరి ఈ మంటనూనెలూ భరించాలి. అంతేగా.. అంతేగా!