– అమిత్ షా అలా.. రాహుల్ ఇలా!
– గతంలో అమిత్‌షా చెప్పులు తీసిన బండి సంజయ్
– తాజాగా ఓ మహిళ చెప్పులు తొడిగించిన రాహుల్
– రెండూ కలిపి మునుగోడు ఓటరుపై సంధించిన కాంగ్రెస్
– అమిత్‌షా-రాహుల్ వీడియో హల్చల్
( మార్తి సుబ్రహ్మణ్యం)
గుండె చప్పుడు మాదిరిగా, ఇదో ఓటు ’ చెప్పు’డు కథ. ‘ప్రచారానికి కాదేదీ అనర్హం. చెప్పులు సైతం’ అన్నట్లుంది మునుగోడులో రాజకీయ ప్రత్యర్ధుల వ్యూహం. ప్రచారపర్వంలో విమర్శలు-ఆరోపణలు- ఆ ఒక్కటీ అడక్కు వాల్‌పోస్టర్లు- ఉత్తుత్తి ఆసుపత్రులు- అన్నీ అయిపోయి, పోలింగు రోజున చివరాఖరకు చెప్పుల దగ్గర కొచ్చి ఆగిపోయాయి.
మునుగోడు పోలింగ్ రోజున ప్రధాన పార్టీలు.. సోషల్‌మీడియా ద్వారా తన మెదడుకు పదను పెట్టి, ఓటర్లను ఆకర్షించే ‘చివరాఖరు వ్యూహాలకు’ తెరలేపాయి. అందులో భాగంగా గతంలో సంచలనం సృష్టించిన, పాత వీడియోలను తిరిగి తెరపైకి తెస్తున్నాయి. వాటిని తాజా ఘటనలతో పోల్చి.. ప్రత్యర్థులకు ఓటు వేస్తే ‘ఇట్లుంటది వాళ్లతోని’అని, చెప్పకనే చెబుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, మహాకాళి ఆలయాన్ని సందర్శించారు. గుడి నుండి బయటకు వచ్చిన సందర్భంలో.. ఆయన చెప్పులను బీజేపీ దళపతి బండి సంజయ్, స్వయంగా తన చేతులతో మోసి మరీ ఆయనకు అందించారు. అది బోలెడన్ని విమర్శలకు గురయింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారంటూ, సంజయ్‌పై టీఆర్ఎస్-కాంగ్రెస్ మండిపడింది. అయితే.. అమిత్‌షా తనకు గురుతుల్యుడని సంజయ్ కౌంటర్ కూడా ఇచ్చారనుకోండి. అది వేరే విషయం.
ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రోజున, మళ్లీ ఆ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా రాహుల్ హైదరాబాద్ జోడో యాత్ర సందర్భంగా, ఒక వృద్ధురాలు కిందపడింది. అక్కడే ఉన్న రాహుల్ ఆమెకు సపర్యలు చేశారు. మంచినీళ్లు ఇచ్చారు. చివరిగా ఆమె చెప్పులు మోసి ఇచ్చారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రోజు, కాంగ్రెస్ సోషల్‌మీడియా విభాగం.. ఈ వీడియోను, అమిత్‌షా చెప్పుల వీడియోను కలిపి, గురిచూసి మునుగోడు ఓటరుపై కొట్టింది. ‘రాజకీయ నాయకుడికి-నాయకుడికి మధ్య తేడా అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపే ప్రయత్నం చేసింది. ’మరి మునుగోడు ఓటరు.. కాంగ్రెస్ ‘చెప్పు’కున్న ఈ వీడియో గోడును ఆలకిస్తారో లేదో చూడాలి.