– కమలం కొనుగోళ్లపై కేసీఆర్ కన్నెర్ర
– ప్రెస్మీట్పెట్టి మరీ వీడియో ప్రదర్శన
– సిట్టింగ్ జడ్జి విచారణ కోరిన మంత్రులు
– తమ పార్టీకి సంబంధం లేదన్న కిషన్రెడ్డి, సంజయ్
– అవన్నీ కట్టుకథలేనని టీఆర్ఎస్పై బీజేపీ ఎదురుదాడి
– కానీ హైకోర్టులో సర్కారు, బీజేపీ భిన్నవాదనలు
– బీజేపీకి సంబంధం లేదన్న ప్రభుత్వ న్యాయవాది
– ఫాంహౌస్ కేసులో బీజేపీ బాధితురాలు కాదని స్పష్టీకరణ
– బీజేపీకి పిటిషన్ వేసే అర్హత లేదన్న వాదన
– ఫాంహౌస్ పెయిడ్ ఆర్టిస్టుల కట్టుకథ అంటూ గతంలో బీజేపీ ఎదురుదాడి
– తమ పార్టీనే బాధితురాలని తాజాగా కోర్టులో బీజేపీ స్పష్టీకరణ
– మరి కేసీఆర్ ఆరోపణలు నిరాధారమేనా?
– కిషన్రెడ్డి ఖండన బూటకమేనా?
– ఇంతకూ నిందితులెవరు? బాధితులెవరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఫాంహౌస్ కేంద్రంగా జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరుగుతున్న విస్మయకర వాదనలు, రాజకీయవర్గాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. ఫాంహౌస్ కథకు దర్శక నిర్మాత బీజేపీయేనంటూ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రెస్మీట్లో దునుమాడారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసి, ప్రజాస్వామ్యాన్ని బొందపెడుతోందంటూ విరుచుకుపడ్డారు. ప్రెస్మీట్లో ప్రదర్శించిన వీడియోలను సుప్రీంకోర్టు, అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
కానీ.. ఫాంహౌస్ కేసుతో తమకెలాంటి సంబంధం లేదని బీజేపీ ఎదురుదాడి చేసింది. అది ఫాంహౌస్ పెయిడ్ఆర్టిస్టులు సృష్టించిన కట్టుకథ అంటూ స్వరంపెంచింది. వాళ్ల నెత్తిన అర్ధరూపాయి పెడితే, పావలాకూ ఎవరూ కొనరని ఎద్దేవా చేసింది. నలుగురితో ప్రభుత్వం వస్తుందా? అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎదురుదాడి చేశారు.
అలా ఎదురుదాడి చేసిన గళాలే ఇప్పుడు హైకోర్టులో స్వరం మార్చాయి. అసలు ఫాంహౌస్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. అసలు బీజేపీ ఈ కేసులో బాధితురాలు కాదు. కేవలం ఓ స్ట్రేంజర్ మాత్రమేనంటూ స్పష్టం చేశారు.
అయితే అటు బీజేపీ మాత్రం ఈ కేసులో తానే బాధితురాలినని వాదించింది. తమ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేసింది. బయట ప్రెస్మీట్లో బీజేపీపై, కేసీఆర్ నిందలు వేస్తే.. కోర్టులో మాత్రం ఫాంహౌస్ కేసులో బీజేపీకి సంబంధంలేదని, ప్రభుత్వం వాదిస్తోందని ఫిర్యాదు చేశారు.
మరి ప్రభుత్వ వాదన ప్రకారం.. కేసుతో బీజేపీకి సంబంధం లేకపోతే, కేసీఆర్ ఆ పార్టీపై ఎలా ఆరోపణల వర్షం కురిపించారు? అంటే సీఎంది వ్యక్తిగత వాదనా? ప్రభుత్వవాదనా? ప్రభుత్వ న్యాయవాది వాదనే నిజమైతే మరి సీఎం కేసీఆర్ వాదన అబద్ధమా?ప్రభుత్వ బీజేపీకి సంబంధం లేదంటుంటే, బీజేపీ ఎందుకు ఆ కేసుపై పోరాడుతోంది? అసలు ఫాంహౌస్ కేసులో నిందితులెవరు? బాధితులెవరు? అన్న సందేహం తెరపైకొచ్చింది.
దేశంలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం, హైకోర్టులో విస్మయకరరీతిలో మలుపుతిరుగుతోంది. ఈ కేసుకు సూత్రధారి కమలదళమేనంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. ఆ మేరకు ఆయన స్వయంగా ప్రెస్మీట్పెట్టి, కొనుగోలుకు సంబంధించిన వీడియో, ఆడియోలను బట్టబయలు చేశారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అంతా ఖండించాలని కోరారు. అటు మంత్రులు కూడా రంగంలోకి దిగి.. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
అయితే సీఎం కేసీఆర్, మంత్రుల ఆరోపణలను కమలదళాలు తిప్పికొట్టాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్పై ఎదురుదాడి చేశారు. అది ‘ఫాంహౌస్ పెయిడ్ ఆర్టిస్టుల కట్టుకథ’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు.
కానీ హైకోర్టులో మాత్రం అటు ప్రభుత్వం-ఇటు బీజేపీ వాదనలు అందుకు భిన్నంగా ఉండటమే అందరినీ విస్మయపరుస్తోంది. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, ఎందుకు పిటిషన్ వేసిందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో బీజేపీ పేరు కూడా లేదని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు.
అంటే.. ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వాదన ప్రకారం.. సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి, బీజేపీపై చేసిన ఆరోపణలు అబద్ధమని, స్వయంగా ప్రభుత్వమే స్పష్టం చేసినట్టయింది. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ప్రభుత్వ ప్రతినిధులుగానే వ్యవహరిస్తారు. వారు చేసే ప్రతి వాదన ప్రభుత్వ పక్షానే ఉంటుంది. కాబట్టి, ఆ కోణంలో చూస్తే ఫాంహౌస్ కేసులో.. సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన ఆరోపణలు, అబద్ధమన్న సంకేతాలిచ్చినట్టయిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అవి కేవలం, బీజేపీపై చేసిన రాజకీయ ఆరోపణలుగానే భావించాలని స్పష్టమయింది.
అయితే అటు బీజేపీ వాదనలు కూడా విస్మయంకరంగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చ ర్చ జరుగుతోంది. ఫాంహౌస్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న బీజేపీ.. ఇప్పుడు కోర్టులో తానే బాధితురాలినని చెప్పడంపై, విస్మయం వ్యక్తమవుతోంది. ఓవైపు స్వయంగా ప్రభుత్వ న్యాయవాదే.. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, తాను బాధితురాలినని బీజేపీ వాదించడమే దానికి కారణం.
కేసీఆర్ చేసిన ఆరోపణల వల్ల త మ పార్టీ చిత్తశుద్ధి, సచ్చీలతని నిరూపించుకోవాల్సిన బాధ్యత, తమపై ఉందన్న బీజేపి వాదన పరిశీలిస్తే.. కిషన్రెడ్డి, సంజయ్, అర్వింద్, బయట చేసిన వాదనకు భిన్నంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో ఈ మొత్తం వ్యవహారంలో.. అసలు నిందితులెవరు? బాధితులెవరన్న ఆసక్తికర చర్చకు తెరలేచినట్టయింది.