Suryaa.co.in

Telangana

ఈనెల చివరిలో అతి పురాతనమైన మెట్లబావి ప్రారంభం

– మంత్రి తలసాని

ఈనెల చివరిలో బన్సీలాల్ పేటలోని ఎంతో అభివృద్ధి చేసిన అతిపురాతనమైన మెట్లబావి ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో గల పునరుద్దరించిన మెట్లబావి, పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి పరిసరాలు మొత్తం తిరిగి పరిశీలించారు.

అధికారులకు పలు సూచనలు చేశారు. మెట్లబావి పునరుద్దరణ పనులను పర్యవేక్షిస్తున్న సాహే సంస్థ నిర్వహకురాలు కల్పన అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషిtsy2 చేస్తుందని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో నగరంలో 44 మెట్ల బావులు ఉండగా, బన్సీలాల్ పేట తో పాటు బాపూఘాట్, గచ్చిబౌలి, సీతారాం బాగ్, గుడి మల్కాపూర్, శివంబాగ్ ప్రాంతాలలో గల పురాతన మెట్లబావులను పునరుద్దరించే పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు.

అందులో భాగంగానే బన్సీలాల్ పేట లోని మెట్లబావి అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. నిజాం కాలంలో ఈప్రాంత ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ బావిని నాగన్నకుంటగా పిలిచేవారని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఈ బావి నిర్వహణను పట్టించుకోకపోవడం వలన వ్యర్దాలతో పూర్తిగా నిండిపోయిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. బావిలో నుండి 57 అడుగుల లోతు మేర సుమారు 500 టన్నులకు పైగా వ్యర్ధాలను తొలగించినట్లు చెప్పారు.

పూర్తిస్థాయిలో వ్యర్ధాలను తొలగించిన అనంతరం బావి స్వచ్చమైన నీటితో నిండిపోయి పూర్వవైభవం వచ్చిందని వివరించారు. ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో HMDA, GHMC ల ఆధ్వర్యంలో సాహే అనే NGO సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ పలు అభివృద్ధి, నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో చిన్న చిన్న వేడుకలను నిర్వాహించుకొనే విధంగా సీటింగ్ తో కూడిన గార్డెన్, యాంపీ థియేటర్ నిర్మాణంతో పాటు పరిసరాలలో నూతనంగా VDCC రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇక్కడకు వచ్చే పర్యాటకుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. స్థానిక ప్రజల సహకారంతోనే ఇక్కడ ఇంత అద్బుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి ప్రశంసించారు. CC కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రానున్న రోజులలో ఎంతో అద్బుతమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందనున్నదనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి సాదిస్తే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోపర్, ఎలెక్ట్రికల్, పోలీస్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE