Suryaa.co.in

Devotional

శివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది

శివ తత్వం లోని కొన్ని విషయాలని పరిశీలిద్దాం

జ్యోతిర్లింగాలు: శివుడిని ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు ( జ్ఞానాన్ని) ప్రసాదించేది.

లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.

ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడు గా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? శివుడు మూడు ప్రళయము లకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం.స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ ( మనసు), కారణ ( అజ్ఞానం)శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది. మూడు : మహాప్రళయం : సమస్తం శివుని లో కలిసిపోవడం. అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.

శివ,విష్ణు,బ్రహ్మ : శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.

మరణం ఒక వేడుక : వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలం లో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ ఆర్తి కి ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.

పంచభూత లింగాలు: దక్షిణ భారతం లోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు,భూమి, ఆకాశం , జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కానిదింకేమైనా ఉందా ?

ఐన్ స్టిన్ శక్తి సూత్రం : శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పైతొడుగులు వేరు, అశాశ్వతం.

రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం,నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే — దొంగ, నురుగు, జీవులు అంతా.. (అద్వైతం)

శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం — శ్రవణ ,మనన, నిధి,ధ్యాసాలు (ధ్యానం) .

అద్వైతం : అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ,స్థితి, మరణం -ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే..

LEAVE A RESPONSE