Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీం తీర్పుతోనైనా చంద్రబాబుకు బుద్ధి రావాలి

-అన్ని ప్రాంతాల అభివృద్ధికే మద్దతు పలుకుతారనే దానికి సుప్రీం తీర్పు ఉదాహారణ
-అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం కావొద్దనేది మా అభిమతం
-అమరావతి రాజధాని పెద్ద స్కామ్‌ 
-మేము అమరావతి ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకం కాదు
-అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలి
-అమరావతి పేరుతో లక్షల కోట్లు సంపాదించేందుకు చంద్రబాబు ప్లాన్‌ వేశారు
-రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామనుకున్నారు
-మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ఇందుకు వికేంద్రీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పే ఉదాహారణగా చెప్పవచ్చు అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎవరైనా అన్ని ప్రాంతాల అభివృద్ధికే మద్దతు పలుకుతారనే దానికి సుప్రీం తీర్పు నిదర్శనమన్నారు. వికేంద్రీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖలో గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు.

వికేంద్రీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా టీడీపీ, దాని తోక పార్టీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బుద్ధి తెచ్చుకోవాలి. రాష్ట్ర విభజన జరిగిన సందర్భం ఏదో అందరికి తెలుసు. ఈ ప్రాంత ప్రజానీకం మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో అమరావతిలోనే రాజధాని పెట్టాలని ఎక్కడా పొందుపరచలేదు. ఆ రోజు జరిగిన రాష్ట్ర విభజనకు తెలంగాణ ఉద్యమం. కేవలం ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరగడంతోనే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను ఒదులుకోవాల్సి వచ్చింది. జరిగిన ఈ ప్రక్రియలను ఉదాహరణగా తీసుకొని, మళ్లీ ఇలాంటి తప్పిదాలు జరగకూడదు. మళ్లీ మిగిలిన ప్రాంతాల్లో ఉద్యమాలు జరగకూడదని ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్తోంది. సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకువచ్చారు. ఈ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయానికి మొదటి నుంచి కోర్టుల ద్వారా అడ్డంకాలు సృష్టిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాం. మళ్లీ దాన్ని రీపిల్‌ చేసుకొని మెరుగైన బిల్లు కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తీర్పుతో పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చించాం. ఈ రోజు సుప్రీం కోర్టులో వచ్చిన తీర్పు హర్షనీయం. సుప్రీం కోర్టు వాదనలపై ఇప్పటికైనా ఆలోచన చేయాలి.

న్యాయస్థానం ఏమైన టౌన్‌ ప్లానరా? హైకోర్టు ప్రభుత్వాన్ని నడుపుతుందా? మీరే పాలిస్తే కేబినెట్, శాసన సభ ఎందుకు అని వ్యాఖ్యానించింది. వీటిపై ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు లాంటి వ్యక్తులు దీనికి ఆటంకాలు సృష్టించడం మానుకోవాలి. అడ్డమైన పాదయాత్రలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లి రెచ్చగొట్టడం మానుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మాకు సమానం. రాష్ట్రంలోని అనిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మేం అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అమరావతితో పాటు అభివృద్ధి చెందాలన్నదే మా విధానం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నదానికి ఇది ఒక ఉదాహరణ. కేవలం మా ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలన్న కొంత మంది వ్యక్తిగత స్వార్థ్యానికి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న వైయస్‌ జగన్‌ అభిప్రాయానికి మధ్య జరిగిన పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు మద్దతుగా చెప్పవచ్చు.

శివరామకృష్ణ కమిటీ, బోస్టన్‌ కమిటి కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పాయి. శివరామకృష్ణ కమిటీ చెప్పిన అంశాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మాకు నారాయణ కమిటీనే శరణ్యం అని చంద్రబాబు వ్యవహరించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కమిటీ వేసి వారు చెప్పినట్లు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? వారు చూపించిన గ్రాఫిక్స్‌ నిజం చేయలేదు. చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించిన మంగళగిరి, తాడికొండ, గుంటూరు మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా బుద్ధి తెచ్చుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తారు చంద్రబాబు? ప్రజలను ఇంకా ఎంతకాలం మభ్యపెడతారు. అమరావతి అన్నది అతి పెద్ద స్కామ్‌. రాజధాని పేరు చెప్పి..ఆ ప్రాంతంలో భూములు కొల్లగొట్టి అతితక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి, అక్కడ రాజధాని వస్తుందని తరువాత ప్రకటించి లక్షల కోట్లు దానిపై సంపాదించాలన్న మీ తాలుక దురుద్దేశం అన్ని కూడా బయటపడుతున్నాయి. మూడు ప్రాంతాల అభివృద్ధి అన్న వైయస్‌ జగన్‌ ఆలోచన విధానాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు.

అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు ఏమైనా అభివృద్ధి చేశారా?. 2001వ సంవత్సరంలో ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు ఉన్నారు. అప్పట్లో దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పాటైతే..అభివృద్ధి చెందిన నగరాల్లో రాజధానులు వచ్చాయి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం అవసరం లేదు. మూడు సార్లు సీఎంగా పని చేసిన అనుభవం అక్కర్లేదు. కనీస జ్ఞానం, ప్రజలను మోసం చేయకూడదనే ఆలోచన ఉండి ఉంటే మీకు ఈ ఆలోచన వచ్చేది. చంద్రబాబు ఆలోచనలు అన్ని కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. నేను, నా మనుషులు, నా సామాజిక వర్గం రాజధానిలో ఉండాలని చంద్రబాబు ఆలోచన చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి 2019 ఎన్నికల్లో టీడీపీకి ఆ రకమైన తీర్పు ఇచ్చారు. అరసవెళ్లి పాదయాత్ర ఏమైంది. ఐడెంటిటి కార్డులు చూపమంటే దాక్కున్నారు. ప్రజల తాలుక మనోభావాలు, ఉద్దేశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు చాలా దురదృష్టకరమని తెలియజేశాం. ఆ రోజు అసెంబ్లీలో చర్చ చేశాం. మాకు సుప్రీంకోర్టుపై అపారమైన నమ్మకం ఉందని ఆ రోజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. శాసన సభ తీసుకున్న నిర్ణయాలు, సీఎం, కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు అడ్డుకోవడం సరైంది కాదని ఆ రోజు చెప్పాం. మూడు నెలలు, ఆరు నెలల్లో రాజధాని కట్టాలనడం సరైంది కాదని సుప్రీం కోర్టు అన్నది. చంద్రబాబు మాదిరిగా గ్రాఫిక్స్‌ చూపినట్లు కాదు..రాజధాని నిర్మాణం అంటే. ఈ ప్రభుత్వం తాలుక, వైయస్‌ జగన్‌ ఆలోచన విధానాన్ని వ్యక్తపరిచే కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

LEAVE A RESPONSE