– చంద్రబాబు మూడురోజుల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పోటెత్తిన జనప్రవాహం
– పథకాల నిలిపివేతపై ప్రతిచోటా చంద్రబాబు వివరణ
– వైసీపీ ప్రచారానికి అన్ని చోట్లా చెక్
– సంపద సృష్టించి మరింత సంక్షేమం ఇస్తానని బాబు భరోసా
– ఇన్చార్జిలు లేని నియోజకవర్గాల్లోనూ జనస్పందన
– గంటలు ఆలస్యమైనా బాబు కోసం ఎదురుచూపులు
– రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేని దుస్థితి
– అయినా అక్కడా తరలివచ్చిన జనసమూహం
– కర్నూలు మాదిరిగానే మేడలు, మిద్దెలెక్కిన ఉత్సాహం
– టీడీపీ అగ్రనేతలకు చంద్రబాబు క్లాసు
– జనం మనతోనే ఉన్నా మీరే జనంతో ఉండటం లేదని సీరియస్
– మీలోనే సమన్వయం లేదని నేతలపై బాబు ఆగ్రహం
– జసమీకరణ చేయకపోయినా జనం ఎలా వచ్చారని ప్రశ్న
– గోదావరి తమ్ముళ్లకు బాబు పర్యటన టానిక్
( మార్తి సుబ్రహ్మణ్యం)
వెళ్లిన రెండు పెద్ద నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలు లేరు. ఉన్న నాయకుల మధ్య సమన్వయలోపం. అయినా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మూడురోజులు జరిపిన.. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఊహించినదానికంటే సక్సెస్ కావడం, తెలుగుతమ్ముళ్లలో జోష్ నింపింది. అది నిరుత్సాహంగా ఉన్న క్యాడర్‌కు, బాబు టూరు టానిక్‌గా పనిచేసింది. అదే సమయంలో టీడీపీ వస్తే ఇప్పటి పథకాలు నిలిచిపోతాయన్న అధికార వైసీపీ ప్రచారానికి చంద్రబాబు ప్రతిచోటా స్పష్టత ఇవ్వడం, టీడీపీ నేతలకు ఆత్మస్థైర్యం ఇచ్చినట్టయింది.
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రెండో జిల్లా పర్యటన సూపర్హిట్టవడం, తమ్ముళ్లలో సమరోత్సాహం నింపింది. చంద్రబాబును చూసేందుకు జనం మేడలు, మిద్దెలు, చెట్లు ఎక్కడం ఆ పార్టీ నాయకత్వంలో మరింత జోష్ నింపింది.
దెందులూరు, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నిడదలవోలు, తాడేపల్లిగూడెం, నూజివీడు నియోజకవర్గాల్లో.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడురోజులు నిర్వహించిన, ఇదేం ఖర్మ
రాష్ట్రానికి’ పర్యటనలో జనం పోటెత్తారు. కీలకమైన నియోజకవర్గాలయిన చింతలపూడి, కొవ్వూరు నియోకవర్గాలకు ఇన్చార్జిల సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ, బాబు సభలు-రోడ్‌షోలకు మాత్రం అనూహ్యమైన స్పందన లభించడం, తెలుగు తమ్ముళ్లను విస్మయపరిచింది.
నిజానికి ఆ రెండు నియోజకవర్గాల్లో, నాయకుల మధ్య అధిపత్యపోరు కొనసాగుతోంది. దానితో జన సమీకరణ ఎలాగన్న సమస్య, టీడీపీ నాయకత్వాన్ని వేధించింది. అయితే జనసమీకరణకు ఎవరూ బాధ్యత తీసుకోకపోయినప్పటికీ, ఆ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలకు, వేలాదిమంది తరలిరావడం పార్టీ నాయకత్వాన్ని ఆశ్చర్యపరిచింది.
దానితో ఉదయం పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబునాయుడు, ఆ రెండు నియోజకవర్గాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జనం మనతోనే ఉన్నారని స్పష్టమవుతోంది. కానీ మీరు మాత్రం వాళ్ల మధ్యలో ఉండి పనిచేయడం లేదు. మీకు బాధ్యత లేదు. జనం మన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న
విషయం వారిలో నాకు స్పష్టంగా కనిపించింది. కానీ మీరు దానిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. ఇకపై మీరంతా జనంలోనే ఉండండి. మీరెవరూ జనసమీకరణ బాధ్యత తీసుకోకపోయినా, అన్ని వేల మంది వచ్చారంటే మీ వైఫల్యం గురించి ఆలోచించండి’ అని క్లాసు తీసుకున్నట్లు సమాచారం.
వాసాలపాడు క్రాస్‌రోడ్స్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ నేతల సమావేశం, గోపాలపురంలో దొండపూడి, పోలవరంలో జరిగిన చంద్రబాబు రోడ్‌షో, సభలకు జనం పోటెత్తారు. రోడ్లన్నీ జనసంద్రంలా
మారాయి. వీటిలో దెందులూరు పర్యటన సూపర్ సక్సెస్ కావడం, చంద్రబాబు పెదవులపై చిరునవ్వులు పూయించింది. నిజానికి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రతిచోటా గ ంటలపాటు ఆలస్యంగా జరిగింది. అయినప్పటికీ జనం గంటలపాటు ఆయన కోసం వేచిచూడటం, పార్టీ నాయకత్వంలో ఉత్సాహం నింపింది.
అయితే.. కర్నూలులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలు- సభలకు, దాదాపు 8 లక్షల మంది హాజరుకాగా.. పశ్చిమ గోదావరిలోని 6 నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షో- సభలకు.. 5 నుంచి 6 లక్షల మంది హాజరయ్యారన్నది ఒక అంచనా. దీన్నిబట్టి గోదావరి జిల్లా కంటే.. కర్నూలు జిల్లా పర్యటనకే ఎక్కువమంది హాజరయ్యారంటే, జనచైతన్యం కర్నూలులోనే ఎక్కువగా ఉందని, పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కాగా చంద్ర బాబు అధికారంలోకి వస్తే.. సంక్షేమపథకాలు నిలిపివేస్తారన్న అధికార వైసీపీ ప్రచారానికి, చంద్రబాబు దాదాపు ప్రతి సభలోనూ స్పష్టత ఇవ్వడం గమనార్హం. తాను సంపద సృష్టించి, మరింత సంక్షేమం అందిస్తానని హామీ ఇచ్చారు. ఫలితంగా.. టీడీపీ అధికారంలోకి వస్తే, ప్రస్తుత పథకాలు నిలిచిపోతాయన్న లబ్థిదారులకు చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్టయింది.
మొత్తానికి చంద్రబాబు మూడురోజుల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన, అనూహ్యంగా ఊహించని స్థాయిలో వచ్చిన జనసంద్రంతో, సక్సెస్ కావడం పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరయింది. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో, నేతల మధ్య అధిపత్యపోరు కూడా స్పష్టంగా కనిపించింది.