-స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలి
-తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేస్తా.
-మంగళగిరి నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
తనపైనా, తెలుగుదేశం అధినేతపైనా, ఆరోపణలు చేయడం పారిపోవడం ఏ1,ఏ2 లకు అలవాటుగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఐదేళ్ల పాలనలో ఒక్క తప్పూ చేయలేదని, ఏ ఆరోపణ అయినా నిరూపించగలిగారా అని వైసీపీకి సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు నమోదు పత్రాలు ప్రజలకి ఇచ్చి వారి సమస్యలను సేకరించారు. స్థానికులు గ్రామంలో తమ సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. తమ ఇళ్లు కూల్చివేతకు నోటీసులు ఇచ్చారని మహిళలు గోడు వెళ్లబోసుకోగా, న్యాయపోరాటం చేసి అండగా నిలుస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 10వేల ఇళ్లు కట్టించి తీరుతానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. నిత్యం అబద్దాలు చెప్పి…అదే నిజం అని జనాల్ని నమ్మించడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడన్నారు. ఎన్నికలకు ముందు తనపై అనేక ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారని…దమ్ముంటే ఏ ఒక్క ఆరోపణ అయినా నిరూపించాలని సవాల్ విసిరారు. స్కిల్ డవలప్మెంట్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం 24 గంటల్లో ఆధారాలు చూపాలని ఛాలెంజ్ చేస్తే పారిపోయిందని ఎద్దేవ చేశారు. నాడు పింక్ డైమండ్ అన్నారు, దసపల్లా భూములు కొట్టేశానన్నారు. అగ్రిగోల్డ్ నేనే చేశానన్నారు, ఫైబర్ గ్రిడ్ లోనూ ఆరోపణలు చేసిన జగన్ రెడ్డి గ్యాంగ్ ఒక్క ఆరోపణ కూడా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల అయ్యిందని, 50 మంది టిడిపి నాయకులపై అక్రమకేసులు పెట్టారని, ఒక్క కేసు అయినా నిలబడిందా అని నిలదీశారు. నెలకి ప్రజాధనం లక్షలు బొక్కుతున్న సాక్షి జీతగాడు సజ్జల ఏ అర్హత, ఏ హాదాతో తెలుగుదేశం నేతలపై ఆరోపణలు చేస్తున్నాడో చెప్పాలన్నారు. ప్యాలెస్ పిల్లి తాడేపల్లి కొంప నుంచి ఇచ్చే కాగితం పట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసిన వారందరిపైనీ పరువునష్టం కేసు వేస్తానని లోకేష్ హెచ్చరించారు. స్టాన్ఫోర్డ్ లో తనతోపాటు చదువుకున్న క్లాస్మేట్స్ ఏడాదికి కోట్ల డబ్బు సంపాదిస్తున్నారని, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ తన లక్ష్యమన్నారు. జగన్ రెడ్డి తనను చూసి వణుకుతున్నారని, అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఐదేళ్లలో చిన్న తప్పు చెయ్యకుండా టిడిపి పరిపాలన సాగిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో 1700 ఫైళ్లు క్లియర్ అయ్యాయని, ఒక్క ఫైలు కూడా నిబంధనలకు విరుద్దంగా ముందుకు వెళ్లలేదన్నారు. జగన్ రెడ్డి ఒక కాపీ క్యాట్ అనీ, జయహో బిసి అనేది టిడిపి స్లోగన్ కొట్టేశారని ఆరోపించారు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించారని, ఇవి దాదాపు 26 ఏళ్లు అవి అమలులో ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లు 26 శాతానికి జగన్ రెడ్డి కారణం కాదా అని ప్రశ్నించారు.
టిడిపి హయాంలో బిసి కార్పోరేషన్ ద్వారా 4 వేల కోట్లు, ఒక్క ఆదరణ ద్వారానే వెయ్యి కోట్లు ఖర్చుపెట్టామని, జగన్ రెడ్డి పాలనలో బీసీల కోసం ఖర్చు చేసింది సున్నా అని వివరించారు. జగన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న నలుగురు రెడ్లకీ బీసీలంటే కక్ష అనీ, పుంగనూరులో రాంచందర్ యాదవ్ అనే జనసేన బీసీ నేత ఇంటిని పెద్దిరెడ్డి తన రౌడీసైన్యంతో ధ్వంసం చేయించడమే దీనికి నిదర్శనమన్నారు. జగన్ రెడ్డి సిఎం అయ్యాక….ఇప్పటికి 24 మంది బిసి నేతలను చంపేశారు…ఇదేనా జయహో బిసి అంటే అని ప్రశ్నించారు.
బీసీలకు 60 కార్పొరేషన్ లు ఇచ్చాం అని చంకలు గుద్దుకుంటున్న వైసీపీ పెద్దలు ఆయా కార్పొరేషన్లకు ఇచ్చిన నిదులు మాత్రం సున్నా అని తెలిపారు. టిడిపి డిఎన్ఎ లోనే బిసి ఉంది…బిసిల గుండెల్లో ఉండేది టిడిపి మాత్రమేనన్నారు. జగన్ బటన్ నొక్కితే, కరెంట్ చార్జీలు,చెత్త పన్ను, ధరలు పెరిగాయన్నారు. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి కల్పించే అమర్ రాజా వంటి సంస్థను పంపేశామని గొప్పగా చెప్పుకుంటున్న సజ్జలకి బుద్ధీ బుర్రా లేదన్నారు. పొల్యూషన్ వల్ల కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నామని వైసీపీ పెద్దలు చెబుతున్నారని, అలా అయితే అతి ఎక్కువ పొల్యూషన్ ఉండే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీని ముందు మూసేయించాలని డిమాండ్ చేశారు.
అమర రాజా, అదానీ, జాకీ సంస్థలను పంపేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి రహస్య జీవో తో అందరినీ తొలగిస్తున్నాడని మండిపడ్డారు.