-జగన్ రెడ్డి అరాచక పాలనపై ఆగ్రహం ఉన్న ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాల ధ్వంసం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఎన్టీఆర్ కు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో అవమానాలు జరిగాయి. రాష్ట్రంలోని అనేకచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైసీపీ గూండాలు వికృతానందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ప్రజలు ఆగ్రహించిన ప్రతిసారీ వారి దృష్టి మళ్ళించేందుకు ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఇలాంటి ఘటనలకు కారణం. గతంలోనూ ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడిన వారిలో ఒక్కరిపైన అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై ఆఘమేఘాల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్న పోలీసులు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తున్న వారిపై ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? అధికార పార్టీకి ఒక న్యాయం మాకో న్యాయమా? వైసీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.