-అప్పులలో ఉన్న వృద్ది స్థూల ఉత్పత్తిలో కనపడటం లేదు
-ఏడాదికి అసలు, వడ్డీ కలుపుకుని రూ.లక్ష కోట్లు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉంది
-వైసీపీ నాయకుల ఆస్తులు పెరుగుతుంటే ప్రజల ఆదాయం తరుగుతోంది
-ఆర్టికల్ 360 ని అమలు చేసి రాష్ట్రంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి
– యనమల రామకృష్ణుడు
జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా దివాలాతీసింది. భవిష్యత్తులో సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేని స్థితికి రాష్ట్రం చేరుకుంటోంది. అభివృద్ధి లేదు. సంక్షేమం శూన్యం. జగన్ రెడ్డి ఆర్దికశాఖను తన చెప్పుచేతుల్లో పెట్టుకుని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేయాలని అధికారులను ఆదేశించడం తప్ప నిధులు ఇవ్వడం లేదు. దీంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. డిసెంబర్ లోపు రోడ్లకు మరమ్మత్తులు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఆ పనులు చేసేందుకు నయాపైసా విడుదల చేయలేదు. ఆర్ధికశాఖ పూర్తిగా సిఎంఓ చేతుల్లోకి వెళ్లిపోయింది.
జగన్ రెడ్డి తన అసమర్ధత కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా బలోపేతమవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. నేడు రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు. బహిరంగ మార్కెట్ లో పరిమితి కంటే ఎక్కువ అప్పులు తీసుకోవడంతో కేంద్రం కూడా అదనపు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతివ్వలేదు. బడ్జటేతర అప్పులు, కార్పొరేషన్ రుణాలు సైతం పరిమితికి మించి చేసేశారు. రోజువారి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తీసుకునే వేస్ అండ్ మీన్స్ పరిమితులు కూడా దాటేశారు. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా రేపోమాపో మూసుకుపోయే పరిస్థితి వచ్చింది. క్లిష్టమైన పరిస్థితులలో వాడుకునే ఓవర్ డ్రాప్ట్ గత ఏడాది 136 రోజులు తీసుకున్నారు. ఈ ఏడాది ఓడీకి వెళ్లకుంటే పని జరిగే పరిస్థితి లేదు. ఓడీ పరిమితులు కూడా దాటిపోయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి ఓడీ తీసుకుంటే దాన్ని 14 రోజుల లోపు చెల్లించాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓడీ ఇప్పటికే 12 రోజులు పూర్తయినాయి. ఇక జగన్ ప్రభుత్వానికి మిగిలింది కేవలం 2 రోజులు మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఓడీ చెల్లించకపోతే ఆర్.బి.ఐ లో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలన్ని మూసేస్తారు. ఇది సంభవిస్తే దేశంలోనే ఆర్ధికంగా అత్యంత క్లిష్టపరిస్థితిల్లోకి వెళ్లిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. రాష్ట్రానికి ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఇప్పటి వరకు దాపురించలేదు. ఇదే మొట్టమొదటిసారి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆర్.బి.ఐ 9 వ తారీఖు నోటీసు ఇచ్చినట్లు కూడా సమాచారం. ఓడీ మూసుకుపోతే బిల్లులు కూడా చెల్లించమని ఆర్.బి.ఐ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఎందుకు బయటపెట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుధ్ది ఉన్న ఆర్.బి.ఐ లేఖను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి.
అప్పులలో ఉన్న వృద్ది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కనపడటం లేదు:
అప్పుల వృద్ధి ఈ ప్రభుత్వం హయాంలో 37.5 శాతంగా ఉంది. కానీ, ఆ మేరకు రాష్ట్ర స్థూల ఆదాయం మాత్రం పెరగడం లేదు. 1956 నుంచి 2019 వరకు 60 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పు 2.57 లక్షల కోట్లు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. రూ.7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్క రోడ్డు గానీ, అభివృద్ది కార్యక్రమంగానీ చేపట్టలేదు. తెచ్చిన అప్పులు ఏం చేశారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన భాద్యత జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఉంది. జగన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంటుంది. జగన్ రెడ్డి తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీ కలుపుకుని ఏడాదికి లక్ష కోట్లు వరకు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉంది.
అసలు, వడ్డీ కలుపుకుని రూ.లక్ష కోట్లు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉంది:
జగన్ రెడ్డి ప్రభుత్వ మూడున్నరేళ్లలో రాష్ట ప్రభుత్వ ఆదాయం సరాసరిన 10 శాతం మాత్రమే వృద్ధి ఉంది. అప్పుల వృద్ధి మాత్రం 37.5 శాతం ఉంది. కట్టాల్సిన వడ్డీ వృద్ధి రేటు 21 శాతం పైనే ఉంది. దీనికి అసలు మొత్తం కలిపితే అది దాదాపు రూ.35 వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే అప్పుల చెల్లింపులు రేటు దాదాపు 95 శాతం కు పెరుగుతుంది. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్దిక వ్యవస్థను కుదేలు చేసినట్లు స్పష్టంగా కనపడుతోంది. రాష్ట్ర రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు.
వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే ప్రజల ఆదాయం తరుగుతోంది:
రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. వైసీపీ నాయకుల ఆదాయం 200 రెట్లు పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రజల ఆదాయం మాత్రం తరుగుతూ ఉంది. రాష్ట్రంలో సహజవనరులు లూటీ అవుతున్నాయి. పరిశ్రమలు జగన్ రెడ్డి అనుచరులకు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల పరం అవుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించాలి.
రాష్ట్రంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించే పరిస్థితులు నెలకొన్నాయి
రాష్ట్ర ఆర్దిక పరిస్థితి చూస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ని ప్రయోగించి ఆర్ధిక అత్యవసరపరిస్థితి విధించే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం దీనిపై వెంటనే స్పందించాలి. లేదంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రానికైన ఆర్దిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వంకు ఆర్ధిక క్రమశిక్షణ అనే మాటకు అర్ధం కూడా తెలియదు. కేంద్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై స్పందించకపోవడంతో ఆర్.బి.ఐ ఈ నెల 9 తొమ్మిదిన రాష్ట్రానికి లేఖ రాసింది. ఈ లేఖను రాష్ట్ర ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.