– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
విభిన్నమైన పాత్రలలో నటించి మూడు తరాల ప్రజల మనస్సుల్లో గుర్తుండే గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కైకాల సత్యనారాయణ మరణ వార్తను తెలుసుకున్న మంత్రి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్ళి పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి నివాళు అరిపించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు 10 :30 కు పార్థివ దేహాన్ని మహాప్రస్థానం కు తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. ఏర్పాట్ల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రలోనైనా జీవించేవారని అన్నారు. సుమారు 777 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు అని, ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బాగా ఇష్టపడే వ్యక్తి సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్,అక్కినేని, కృష్ణంరాజు, కృష్ణ ఏ సినిమా లో నటించిన ఆ సినిమాల్లో కైకాల ఉండేవారని చెప్పారు. ఈ జనరేషన్ లో ఎవరు అన్ని క్యారెక్టర్ లు చేయలేదన్నారు.
అంత గొప్ప నటుడి మరణం బాధాకరం అన్నారు. ఇటీవల కాలంలో ఒకోక్కరిగా జరుగుతున్నసినీ నటుల మరణం తెలుగు ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తీవ్ర దుఖానికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అంత్యక్రియల కు హాజరయ్యేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.