Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం

ఎకో ఇండియాతో రాష్ట్ర ఎన్ హెచ్ ఎం ఎంవోయూ

మంగళగిరి, గుంటూరు జిల్లా: రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆరోగ్య కార్యకర్తల సామర్ధ్యం పెంపుదల కార్యక్రమాల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ న్యూఢిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో అవగాహనా పత్రంపై(ఎంవోయూ) సంతకాలు చేసింది. శుక్రవారం మంగళగిరిలోని ఎపిఐఐసి భవనం, ఐదో అంతస్థులో తన ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం మిషన్ డైరెక్టర్ జె. నివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎల్ బిఎస్ హెచ్ దేవి, ఎకో ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా, డిప్యూటీ జనరల్ మేనేజర్ దీపా ఝా ఈ అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ భల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్య ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సిబ్బందికి ఉచితంగా వర్చువల్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ అవగాహనా పత్రంపై సంతకాలు జరగటానికి ముందు ఎకో ఇండియా బృందం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబుతో భేటీ అయ్యింది. ఈ భాగస్వామ్య ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన ఎకో ఇండియా బృందానికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుదిరిన ఈ ఒప్పందంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE