– హరికృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు పాటి విలువలేకపాయె
– నోముల నర్శింహయ్యకూ అధికార లాంఛనాలతో వీడ్కోలు
– దళిత ఎమ్మెల్యే సాయన్నకు దక్కని అధికార గౌరవం
– సినిమా వాళ్లకంటే తీసిపోయారా?
– అధికార లాంఛనాలతో సాయన్న అనర్హుడా?
– దళిత మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకు నోరు విప్పే దమ్ము లేదా?
– ఇంతకూ సాయన్న చేసిన నేరమేమిటి?
– దళితుడనే చిన్నచూపా?
– ఎమ్మెల్యేల బలం లేదన్న కారణమా?
– అధికార లాంఛనాలకు దళితులు ధర్నాలు చేయాలా?
– సీఎంఓ చెబితే తప్ప ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియల చేయరా?
– ఇదెక్కడి సంప్రదాయం? ఇదేం గౌరవం
– రగులుతున్న దళితజనం
– ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం‘ రోజున జరిగిన ఓ సామాజిక ‘అన్యాయం’
( మార్తి సుబ్రహ్మణ్యం)
సారీ సాయన్న.. క్షమించు! నిన్ను ప్రభుత్వం చివరి చూపులోనూ చిన్నచూపు చూసింది. అందులోనూ ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం‘ రోజున నీ పార్ధివదేహానికి జరిగిన ‘ సామాజిక అన్యాయం’ ఇది. అందరినీ వదలి, ఆకాశంలోకి వెళ్లిన నీకు.. సర్కారు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుందని
భావించాం. ఐదుసార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నీకు మంత్రి పదవి.. కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వకపోయినా… నీ అంత్యక్రియలయినా అధికార లాంఛనాలతో చేస్తుందని ఆశించాం. కానీ అది అత్యాశేనని తేలింది. మా భావన భ్రమేనని తేలిపోయింది. ఎందుకంటే నువ్వు వెలమవి కాదు,రెడ్డివి కాదు, కమ్మవి కాదు, రాజువి కాదు, యాదవుడివి కాదు. కేవలం ఓ దళితుడివి! అందుకే ఈ పాలకులను క్షమించు. బతికున్నప్పుడు చాలా అవమానాలు దిగమింగావు. ఎలాగూ వెళ్లిపోయావు కదా.. ఇది కూడా అలవాటుగా క్షమించెయ్!
మామూలు నాయకుడి మాదిరిగానే నీ పాడె శ్మశాసవాటిక వరకూ తీసుకువెళ్లి, అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన నీకు, సాధారణ అంత్యక్రియలే జరగడం.. మా లాంటి మిత్రుల గుండె పిండేసింది. మమ్మల్నే కాదు. మనసున్న ప్రతి గుండెనూ గాయపరిచింది. నీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని దళితబిడ్డలు, నీ నియోజకవర్గ ప్రజలు, నీ అభిమానులు ధర్నాలు చేసి, అడుక్కునే విషాద దృశ్యం.. నువ్వు చూడకపోవడమే మంచిదయింది. ఇది కూడా చదవండి: స్నేహానికి మరో రూపు సాయన్న
ఎందుకంటే… నీ గెండెకు ఆపరేషన్ చేసినా.. సుగర్‌తో నీ కాలు తీసేసినా.. నువ్వు వేదికలపై, కేసీఆర్ గొప్పతనం గురించి గుండెలవిసేలా చెప్పేవాడివి కదా? పాలకుల నిజరూపం ఇదీ అని తెలిస్తే, బహుశా నీ గుండె అప్పుడే ఆగిపోయేదేమో?! ఎందుకంటే నువ్వు దళితుడివి కదా?! బతికున్నప్పుడు దళిత కార్డును, రాజకీయాలకు ఎలా వాడుకోవాలో తెలియని పిచ్చిమారాజువు కదా?
నీ కంటే ముందు .. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య చనిపోతే, సర్కారు ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది కదా? మరి నీకెందుకు చేయలేదు? సమైక్యాంధ్రలో
మంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ పుత్రరత్నం నందమూరి హరికృష్ణ, రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆయనకూ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు కదా? ఏలూరు ఎంపీగా పనిచేసిన సూపర్‌స్టార్ కృష్ణ, నర్సాపురం ఎంపీ-కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుకూ అలాగే సకల మర్యాదలతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు కదా? సీఎం కేసీఆర్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు కదా?
అంతమందికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన పాలకులు.. మరి నిన్నెందుకు చిన్నచూపు చూశారు? నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేవే కదా? ఎందుకంటే.. నువ్వు దళితుడివి కదా? నీకు కులబలం లేదు. నీ కోసం సర్కారును నిలదీసేవాళ్లెవరూ లేరు కదా? నీ కుటుంబంలో ఆడవారు తప్ప మగ దిక్కు లేదు కదా? నీకు అవమానం జరిగితే భూకంపం సృష్టించేంత కులబలం లేదనా? అదేనా పాలకుల ధైర్యం? నిన్ను కడసారి చూసేందుకు వ చ్చిన మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలకు.. ఇదేం అన్యాయమని పాలకులను ప్రశ్నించే ధైర్యం ఎందుకు లేదు? వారంటే సరే.. చివరాఖరకు దళిత మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీల నోళ్లు ఎందుకు మూతపడ్డాయ్?
సీఎంఓ చెబితేనే అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తారట. మరి జీఏడీ ఏం చేస్తోంది? అదేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న సంప్రదాయాన్ని హుస్సేన్‌సాగర్‌లో కలిపేశారా? మరి నోముల నర్శింహయ్య, కృష్ణ, కృష్ణంరాజు, నందమూరి హరికృష్ణలకు ఏ సంప్రదాయం, ఏ నిబంధనల ప్రకారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు? వారి పాటి ప్రాణం నీది కాదా? వారి ప్రాణాలే అమూల్యమైనవా? ఇలా వ్యక్తులను బట్టి-కులాలను బట్టి గౌరవం మారుతుందా? నిజమేమిటంటే… వారికి కులబలం ఉంది. నీకు లేదు. వారి వెనుక కులనేతలున్నారు. వారి ఓట్లతో పాలకపార్టీలకు బోలెడు అవసరాలున్నాయి. నీకు ఎవరూ లేరు. అదే కదా అసలు తేడా!? నీకు అర్ధమవుతోందా?
నీకు అధికార లాంఛనాలతో.. అంత్యక్రియలు నిర్వహించలేదని తెలిసిన నీ దళితజాతి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు.. ఆ అవమానంపై గళమెత్తకుండా నవరంధ్రాలు మూసుకున్నప్పటికీ.. దళిత జాతిజనం మాత్రం నడిరోడ్డున నిలబడి రోదించింది. ఇదెక్కడి అన్యాయమని గుండెలు బాదుకుంది. ఇదెక్కడి పక్షపాతమని పాలకులను చూపుడువేలితో నిలదీసింది. అధికార లాంఛనాలు అందుకునే అర్హత, మా దళితబిడ్డకు లేదా అని కన్నెర్ర చేసింది. దళితబిడ్డకు పాలకులిచ్చే గౌరవం ఇదేనా అని పిడికిలి బిగించింది. అది చాలు నీకు.
ఎవరెంత గుండెలు బాదుకుంటేనేం? ఎవరెంత కన్నీరు పెడితేనేం? ఎవరెన్ని శాపనార్ధాలు పెడితేనేం?… వీటన్నింటికీ అతీతంగా.. జీవం లే ని మనిషిగా.. నువ్వు నీ కుటుంబసభ్యుల అంత్యక్రియలతో ప్రశాంతంగా వెళ్లిపోయావు. సారీ.. సాయన్న.. నిన్ను క డసారి గౌరవించని ఈ పాలకులను క్షమించు! సర్కారు అధికార లాంఛనాలు సమర్పించకపోయినా..చివరి వరకూ నీతో ఉన్న జనావళి అశ్రునివాళే, నీకు అధికార అంత్యక్రియలు! మరుజన్మలోనయినా.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే అర్హత ఉన్న కులంలో జన్మించు!! నీకు ఇవ్వగలిగే సలహా ఇదొక్కటే!!!