– అమరావతిపై కిషన్‌రెడ్డి యుటర్న్
– ఏపీ రాజధాని అమరావతేనట
( మార్తి సుబ్రహ్మణ్యం)
విశాఖను ఏపీ రాజధానిగా ప్రస్తావించి తాను చిక్కుల్లో పడి, ఏపీ బీజేపీని చిక్కుల్లో నెట్టిన కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి దిద్దుబాటకు దిగారు. తన ఉద్దేశం ‘విశాఖ ఏపీ రాజధాని అని కాదని, విశాఖ వంటి జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్ధి మాధవ్‌ను మళ్లీ ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే ఉపయోగంగా ఉంటుందని చెప్పడమే తన కవి హృదయమ‘ని కిషన్‌రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. దానితోపాటు తమ రాష్ట్ర పార్టీ కూడా… అమరావతి రాజధాని అని స్పష్టం చేసినందున, తామంతా అదే మాటకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
కిషన్‌రెడ్డి ప్రటకనతో ఏపీ కమలనాధులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజీ జరిగిపోయినా, ఆయన ట్వీట్ గుడ్డిలో మెల్లగా సరిపుచ్చుకుంటున్నారు. ఇది తమపై విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పేందుకు అక్కరకొస్తుందని సర్దిచెప్పుకుంటున్నారు.
నిజానికి, కిషన్‌రెడ్డి ప్రటకన తర్వాత వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతోపాటు, ప్రత్యేక హోదా కోరుకుంటున్న సంస్థలు, విశాఖ స్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గాలు సోషల్‌మీడియాలో తమ చేతికి పనిచెప్పారు. దానితో అవి అప్పటికే బాగా వైరల్ అయ్యాయి.
ప్రధానంగా బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నీ.. ‘ఇప్పటికే విశాఖను తెగనమ్మిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రను కూడా మరోసారి తెగనమ్మేందుకు సిద్ధమవుతోంది. కిషన్‌రెడ్డి ప్రకటన తర్వాత ఏపీ రాజధాని విషయంలో కేంద్రం మనోగతం ఏమిటన్నది తేలిపోయింది. దీన్ని బట్టి ఏపీ పట్ల బీజేపీ నాటకాన్ని ప్రజలు గమనించాల’ని కామెంట్లు పెట్టారు.