తెలుగునాట ఒక అద్భుతం ఆవిష్కారమైన రోజు ఇది. 41ఏళ్ల క్రితం ఇదే రోజున తెలుగువారి ఆరాధ్యదైవం, వెండితెర వేల్పు అయిన నందమూరి తారకరామారావుగారు రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీని స్థాపించిన రోజు ఇది. మార్చి 29, 1982న తెలుగుదేశం పార్టీని స్థాపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ అధ్యాయానికి ఎన్టీఆర్ నాంది పలికారు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం అని ఎన్టీఆర్ చేసిన సింహగర్జన తెలుగునాట ప్రతిధ్వనించింది. రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
ఆనాడు రాష్ట్రంలో తీవ్రమైన అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సమాజంలో తీవ్ర అశాంతి నెలకొని ఉన్నది. తీవ్రమైన రాజకీయ అనిశ్చితి ఉన్నది. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి. గరీబోళ్ల ముఖ్యమంత్రిగా పేరు గడిరచిన ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్యను ఎయిర్‌పోర్టులో రాజీవ్‌గాంధీ దారుణంగా అవమానించడాన్ని చూసి ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢల్లీి పెద్దల దగ్గర తాకట్టు పెట్టడాన్ని చూసి సహించలేకపోయారు.
ఇదే నినాదంతో ఆయన రాజకీయ రంగంలో అడుగిడారు. అదేకాక, పరిపాలన అంటే ఏమిటో, ప్రభుత్వం అంటే ఏమిటో సామాన్యులకు కనీసం తెలియని పరిస్థితి. బడుగులు, బలహీనవర్గాలు కనీసం తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అప్పటి పాలనలో పాలకులు ప్రజలను అజ్ఞానం, అంధకారంలోకి నెట్టివేశారు. ఎటు చూసినా పేదరికం, ఉండటానికి గూడు లేదు. పేదలకు కనీసం తినటానికి మూడు పూటలా తిండి కూడా లేనంతటి దుర్భర పేదరికం, తమ ఈ దుస్థితి నుంచి కాపాడటానికి ఎవరైనా రాకపోతారా? అని ప్రజలు దీనంగా ఎదురుచూస్తున్న పరిస్థితి.
ఈ స్థితి నుంచి గట్టెక్కించటానికి వారికి పట్టెడన్నం పెట్టి వారి ఆకలి తీర్చడానికి పేదల జీవితాల్లో వెలుగులు నింపటం కోసం నేనున్నానంటూ ఆపద్భాందవుడులా తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ముందుకు వచ్చారు. పేద ప్రజలను ఉద్ధరించటానికి, రాష్ట్రాన్ని సర్వోతోభిముఖంగా అభివృద్ధి చేయటానికి ఒక మహోన్నత వ్యక్తి ఆలోచనల నుంచి పుట్టిన ఒక మహా శక్తి తెలుగుదేశం.
పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసం. ఎన్టీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం. అప్పుడు జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు ఎన్టీఆర్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అన్నగా ఆదరించారు, హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పర్యటనలో ప్రసంగించిన సభలు రికార్డులు సృష్టించాయి.
చైతన్య రథంపై 60 రోజుల్లో 25వేల కిలోమీటర్లు తిరిగి ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలతో చరిత్ర సృష్టించారు. మూడుకోట్ల మంది ప్రజలను తన ప్రసంగాల ద్వారా ఉత్తేజితులను చేశారు. తెలుగు యువత ఎన్టీఆర్ వెన్నంటి నిలిచింది. తన 60 రోజుల పర్యటనలో ఎన్టీఆర్ ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఉదయం 7 గంటలకు పర్యటన మొదలైతే రాత్రి 2 గంటల వరకు నిర్వీరామంగా పర్యటిస్తూ సభలలో ప్రసంగించారు.
ఆయన ఏ చెట్టు క్రిందనో, రోడ్డు ప్రక్కనో బస చేసేవారు తప్ప హోటళ్లలోగానీ, ఇళ్లల్లో గానీ ఎక్కడా బస చేయలేదు. 1983 జనవరి 8న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 202 స్థానాలు గెలుచుకొని జయపతాక ఎగురవేసింది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సంజయ్ విచార్ మంచ్ 4 స్థానాలు గెలుచుకున్నది. తెలుగుదేశం దెబ్బకు 35సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పాతుకుపోయి ఉన్న ఉద్ధండులు మట్టి కరిచారు.
తెలుగుదేశం అధికారంలోకి రావటంతో రాష్ట్ర పాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయింది. గతంలో పాలకులు తాము అనుభవించటానికే పదవులున్నాయి తప్ప ప్రజలకు సేవ చేయడం అంటే ఏమీటో ఎరుగని పరిస్థితి నెలకొని ఉన్నది. తెలుగుదేశం రాకతో ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో తెలిసింది. పాలన అంటే ఏమిటో చేసి చూపించింది. గ్రామస్థాయి వరకూ ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ.
దేశంలో ఎక్కడా లేని విధంగా మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లింది. పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, రెండు వందలకే వ్యవసాయ విద్యుత్, జనతా వస్త్రాలు మొదలైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించింది. వరి అన్నం అంటే ఏమిటో తెలియని గిరిజనులకు రూ.2లకు బియ్యాన్ని అందించి వారికి దేవుడై ఎన్టీఆర్ నిలబడ్డారు.
దేశానికి 1947 ఆగస్టులో స్వాతంత్య్రం రాగా, తెలంగాణలో మాత్రం ఎన్టీఆర్ రాకతో నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. తెలంగాణలో పటేల్, పట్వారీ, మునుసబ్లు, కరణాలు గ్రామాల్లో రారాజులుగా చలామణి అయ్యేవారు. బడుగులు, బలహీనవర్గాలపై దౌర్జన్యకాండ సాగించేవారు. ఈ విధంగా మునుసబ్లు గ్రామాల్లో నవాబులుగా చలామణి అయ్యి పేదలపై దౌర్జన్యకాండ సాగించేవారు. ఈ అరాచకానికి చరమగీతం పాడాలని ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్ఓ) వ్యవస్థను ప్రవేశపెట్టారు.
తెలుగుదేశం అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే తెలుగుదేశం అనే విధంగా ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విడిపోయిన తరువాత కూడా అభివృద్ధి కొనసాగింది. చంద్రబాబు హయాంలో ఎంతో ముందు చూపుతో రాష్ట్రాభివృద్ధికి పనికి వచ్చే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.
తెలుగుదేశం అంటే ఒక రాజకీయ పాఠశాల. తెలుగుదేశం అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఈ పాఠశాలలో ఒనమాలు దిద్దినవారు జాతీయ స్థాయిలో అనేక పదవులు పొందారు. ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది అంటే అది ఒక తెలుగుదేశానికే సాధ్యమైంది. అంతకుముందు ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రం వరకే పరిమితమై రాజకీయాలు సాగించేవి. కానీ, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు.
కాంగ్రెస్సేతర 7 పార్టీలతో 1988లో ఒక ఫ్రంట్‌ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులు ఎన్టీఆర్. కన్వీనర్‌గా వి.పి.సింగ్ ఉన్నారు. ఈ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 1989లో కాంగ్రెస్‌ను అధికారంనుంచి దించి నేషనల్ ఫ్రంట్‌ను ఢల్లీి గద్దెపై కూర్చోబెట్టారు. 1991 మే వరకు కొనసాగిన కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. తరువాత 1996లో చంద్రబాబు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కొనసాగారు.
కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలిపి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించి దేవగౌడను ప్రధానమంత్రిగా ఆయన ఎంపిక చేశారు. 1997లో దేవెగౌడను తొలగించి ఐ.కె.గుజ్రాల్‌ను ప్రధానమంత్రిగా చంద్రబాబు ఎంపిక చేశారు. 1998 ఎన్నికల వరకు ఐ.కె.గుజ్రాల్ ప్రభుత్వంలో తెలుగుదేశం కేంద్రంలో కొనసాగింది. తరువాత 1999లో తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిరది. అప్పుడు తెలుగుదేశం ఎంపీ బాలయోగి పార్లమెంట్ స్పీకర్‌గా వ్యవహరించారు.
2004 పార్లమెంట్ ఎన్నికల వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతును కొనసాగించింది. ఇదే సమయంలో 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబు ప్రతిపాదించగా ప్రధాని వాజ్‌పేయి ఆమోదం తెలిపారు. తరువాత 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో తెలుగుదేశం బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. అప్పుడు కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయేలో భాగస్వామిగా వ్యవహరించింది.
ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలలో ముఖ్య పదవుల్లో కొనసాగుతున్న వారిలో అత్యధికులు తెలుగుదేశం పార్టీలో ఒనమాలు దిద్దినవారే. తెలుగుదేశం రాకముందు మోతుబరులు, ధనవంతులు, అగ్రకులాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని బడుగులు, బలహీనవర్గాలకు కట్టబెట్టిన ఘనత తెలుగుదేశానిది. పేదరికంతో ఎటువంటి గుర్తింపు లేకుండా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు పదవులు దక్కేటట్లు చేసింది తెలుగుదేశం పార్టీ.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రాకముందు, వచ్చిన తరువాత అని రెండుగా విభజించవచ్చు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వేసిన అభివృద్ధి పునాదులపైనే నేటి తెలుగు రాష్ట్రాలు ముందుకు నడుస్తున్నాయి. తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తేవటానికి ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేస్తే.. అమెరికన్ ప్రెసిడెంట్‌ను, మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్‌గేట్స్‌ను, బ్రిటన్ ప్రధానిని రప్పించడం ద్వారా ప్రపంచపటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించి పెట్టుబడులకు కేంద్రస్థానంగా చంద్రబాబు నిలిపారు. నేడు ఐటీలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలబడి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నదంటే అది ఆనాడు చంద్రబాబు ఐటీకి వేసిన పునాదే కారణం.
ఇక, తెలుగుదేశం 39ఏళ్ల ప్రయాణాన్ని పరిశీలిస్తే.. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటుతో కలిగిన అస్తవ్యస్థ పరిస్థితులను చక్కదిద్దటానికి 1984 నవంబర్ 22న ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేశారు. తరువాత 1985 మార్చి 5న శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరుగగా తెలుగుదేశం 202 స్థానాల్లో గెలుపొంది ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం 71 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుపొందటంతో ప్రతిపక్షంలోకి వెళ్లవలసి వచ్చింది. మళ్లీ 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం 220 సీట్లలో గెలుపొంది అఖండ విజయం సాధించింది.
ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 1995, ఆగస్టులో తెలుగుదేశంలో ఏర్పడిన తిరుగుబాటు కారణంగా ఎన్టీఆర్ రాజీనామా చేయగా, చంద్రబాబు సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 180 స్థానాలలో తెలుగుదేశం గెలుపొందటంతో సెప్టెంబర్ 5వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేశారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం 47సీట్లలోనే గెలుపొందటంతో ప్రతిపక్షంలో చంద్రబాబు కూర్చోవలసి వచ్చింది.
తర్వాత 2009 ఎన్నికల్లో 92 సీట్లలోనే గెలుపొందటంతో వరుసగా రెండోసారి చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నారు. తరువాత రాష్ట్రం విడిపోవటంతో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో 102 సీట్లు, తెలంగాణలో 15సీట్లలో పార్టీ గెలుపొందింది. ఆంధ్రాలో చంద్రబాబు మూడవసారి ముఖ్యమంత్రిగా జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు.
ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఆంధ్రాలో 23 స్థానాలలో, తెలంగాణలో 2 స్థానాలలో గెలుపొంది పరాజయం పాలై ప్రస్తుతం ప్రతిపక్షంలో కొనసాగుతోంది. ఎన్టీఆర్ 7 సంవత్సరాల 7 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగారు, 5 సంవత్సరాలపాటు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 13 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.
2019లో తెలుగుదేశం ఆంధ్రాలో అధికారం కోల్పోయిన తరువాత అక్కడ భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ, అక్రమాలు బడుగు, బలహీనవర్గాలపై అధికార పార్టీ దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం పూర్తిగా ఆగిపోయింది. దీనితో ఉద్యోగాలు లేక యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయటం, వారిని అరెస్టులు చేయటం, నిత్యకృత్యంగా మారింది. 10లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేయటంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రం 40సంవత్సరాల వెనకకు నెట్టబడిరది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.