-నాడు బెదిరింపు.. నేడు బుజ్జగింపు!
– ఎవరినీ ఒదులుకోబోనన్న జగన్
– గతంలో పనిచేయని వారిని వదిలేస్తానని హెచ్చరిక
– ఇష్టం ఉన్న వారే ఉండవచ్చన్న కఠిన వైఖరి
– నేడు మిమ్మల్ని గెలిపించడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
– టికెట్లు రాకపోతే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తానన్న భరోసా
– నియోజకవర్గ పునర్విభజనపై కొత్త ఆశలు రేపిన జగన్
– జగన్‌పై ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి ప్రభావం చూపిందా?
– నలుగురు ఎమ్మెల్యేల ధిక్కరణతో మార్పు వచ్చిందా?
– ఈ నెలాఖరుకు బిల్లులు క్లియరెన్స్ చేస్తానని కొత్త హామీ
– పెఐడిఐగ్ బిల్లులపై ఎమ్మెల్యేల ఆందోళనను జగన్ గుర్తించారా?
– జగన్‌లో ఈసారి కనిపించిన బుజ్జగింపు వైఖరి
– ముందస్తు ఎన్నికలు లేవన్న సంకేతాలు
– అపాయింట్మెంట్ల విషయం ప్రస్తావించని వైనం
– వైసీపీ ఎమ్మెల్యేలలో పెరిగిన సంతోషం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికలకు ఏడాదిముందే గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్న ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ వైఖరిలో మార్పు వచ్చిందా? మునుపటి మాదిరి బెదిరించే తత్వం స్థానంలో బుజ్జగింపు ధోరణి మొదలయిందా? నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఓటమి, నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో, జగన్‌కు అనుభవం వచ్చి తత్వం బోధపడిందా?.. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన భేటీలో జగన్ వైఖరి ఇలాంటి చర్చకే తెరలేపింది.
చాలాకాలం తర్వాత జగన్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఉరుములు, మెరుపులు లేకుండానే ముగియడం పట్ల, ఎమ్మెల్యేలు సంతోషంతో కనిపించారు. గతంలో పనిచేయకపోతే టికెట్లు ఇచ్చేది లేదని,
మీకు అనేక అవకాశాలు ఇచ్చానని ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడిన జగన్.. ఈసారి మాత్రం చాలా సాత్వికంగా, ప్రశాంతంగా ‘నేను మీ వాడిని’, ‘మిమ్మల్ని మళ్లీ గెలిపించడమే నా లక్ష్యం’ అన్న సంకేతాలు పంపించేందుకే ప్రయత్నించడం తమనే ఆశ్చర్యపరిచిందని పలువురు ఎమ్మెల్యేలు చెప్పారు.
ప్రధానంగా.. ఎమ్మెల్యేలు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్న, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ గురించి జగన్ చల్లటి వార్త చెప్పారు. ఈనెలాఖరులోగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తానని చెప్పడం, ఎమ్మెల్యేలను సంతోషపెట్టింది. నియోజకవర్గాల్లో తమ అనుచరులకు కోట్లాదిరూపాయల కాంట్రాక్టులు ఇప్పించిన
ఎమ్మెల్యేలకు, ఆ బిల్లులు ఇప్పటివరకూ రాకపోవడం ఆందోళనగా మారింది. కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తుండటంతోపాటు, కొత్త పనులు చేసేందుకు నిరాకరించడమే దానికి కారణం. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు, పార్ట ప్రాంతీయ సమన్వయకర్తలు, చివరకు సీఎంఓకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు. దీనితో ఎమ్మెల్యేల అసంతృప్తి తెలుసుకున్న జగన్.. వాటికి ముగింపు పలకాలని నిర్ణయించడం, ఎమ్మెల్యేలను సహజంగానే సంతోషపెట్టింది.
ఇక తాజా సమావేశంతో తమ సీట్లకు ఎలాంటి ఎసరు లేదన్న భావన ఎమ్మెల్యేల్లో కనిపించింది. కొంతమంది 60 మందికి టికెట్లు ఇవ్వరని ప్రచారం చేస్తున్నారని, అదంతా దుష్ర్పచారమేనని స్వయంగా జగనే చెప్పడంతో, చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల్లో నిరంతరం ఉండటం ద్వారా, మిమ్మల్ని మళ్లీ నాతో అసెంబ్లీకి తీసుకువెళ్లాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఫలితంగా ‘తాను మీ గురించే ఆలోచిస్తున్నాన’న్న సంకేతాన్ని, సీఎం విజయవంతంగా పంపించగలిగారు.
తాజా సమావేశంలో తమ పార్టీ అధినేతలో, గుణాత్మక మార్పు చూశామని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. నాలుగు ఎమ్మెల్సీలు ఓడిన ఆందోళన ఆయనలో కనిపించలేదని, అలాగే నలుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారన్న ఒత్తిడి కూడా జగన్ ముఖంలో చూడలేదంటున్నారు. పైగా తమకే ఆయన భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఈ అంశంలో మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం భిన్నంగా విశ్లేషించారు.
అయితే.. ఇప్పటిదాకా తన మాటే చెల్లుబాటు అవుతుందన్న ధోరణి ప్రదర్శించిన జగన్.. ఈసారి తాను మీ శ్రేయోభిలాషినన్న సంకేతాలు పంపించేందుకే ఎక్కువ కష్టపడ్డారని ఓ ఎమ్మెల్యే విశ్లేషించారు. ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో.. పనిచేయని వారి స్థానంలో కొత్తవారిని తెస్తామని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ప్రభావమేనంటున్నారు. ఆ ఫలితాలు పెద్ద లెక్కలోకి రావని పైకి చెప్పినా, అంతర్గతంగా మాత్రం ఆ ప్రభావం జగన్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించదని మరి కొందరు ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు.
గతంలో భయం భయంగా జగన్ సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎలాంటి ఆందోళన-భయం లేకుండా హాజరుకావడం, కొత్త పరిణామమని విశ్లేషిస్తున్నారు. ఇంత స్వేచ్ఛగా ఎమ్మెల్యేలు ఎప్పుడూ కనిపించలేదని, పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. జగన్ కూడా నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు అనుభవంతో, చాలా సాత్వికంగా- తమకు నచ్చచెప్పే ధోరణిలోనే మాట్లాడటం కొంతవరకూ మేలేనని అంటున్నారు.
పైగా తమను జనంలో గ్రాఫ్ పెంచుకోమని సలహా ఇచ్చారని, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనయినా టికెట్లు ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ-కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి, తనతో తీసుకు వెళతానని చెప్పడం.. జగన్‌లో వచ్చిన గుణాత్మక మార్పునకు సంకేతమంటున్నారు.
ముందస్తు ఎన్నికలు లేవని, ఏడాదిలోపే ఎన్నికలు జరుగుతాయని చెప్పడం ఊరటగా ు భావిస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గాల్లో కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడం, కొత్త వర్గాలకు చేరవయ్యే సమయం ఉంటుందన్నది వారి భావనగా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, మీకు అవకాశాలు వస్తాయని చెప్పడం ద్వారా.. ఎమ్మెల్యేలలో జగన్ కొత్త ఆశలు చిగురింపచేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా తన మాటే వేదవాక్కని భావించే జగన్‌లో అనూహ్యమార్పు వచ్చిందన్నది మెజారిటీ ఎమ్మెల్యేల భావన.