– గతంలో హైదరాబాద్‌లో విచారణకు ప్రయాణ భారమని వాదన
– దానితో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు
– ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు హాజరుకూ మినహాయింపు కోరిన వైచిత్రి
– విజయవాడలోనే ఉన్న ఎన్ఐఏ కోర్టు
– తాను కోర్టుకు వెళితే ట్రాఫిక్ ఇబ్బందులన్న జగన్
– సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలున్నాయని వాదన
– కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటూ మరో పిటిషన్
– కోడికత్తి కేసులో సీఎం జగన్ బాధితుడే కాదు, సాక్షి కూడా
– హాజరుకాకుండా అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని అభ్యర్ధన
– బెజవాడ కోర్టుకూ హాజరుకాకపోతే ఎలా అని విపక్షాల విమర్శలు
– కోర్టులు ఎన్నిసార్లు మినహాయింపు ఇస్తాయని ప్రశ్న
– వ్యక్తులు ప్రధానమా? వ్యవస్థ ప్రధానమా? అంటున్న నేతలు
– విచారణ తేదీని రెండునెలల ముందు ఇచ్చినా హాజరుకారా?
– కోర్టు విచారణ తేదీ ఇచ్చినా ఆ రోజు సమీక్షలు పెట్టుకోవటం ఏమిటి?
– కోర్టులపై ఇదేనా గౌరవమన్న విమర్శలు
– సీఎం పెళ్లిళ్లకు వెళితే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదా అన్న ప్రశ్నలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కోర్టులకు హాజరుకావడాన్ని ప్రతిష్ఠగా భావిస్తున్నారా? అందుకే ఆయన కోర్టు విచారణలకు హాజరు నుంచి మినహాయింపులు తీసుకుంటున్నారా? సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు తీసుకున్న అంశాలనే, ఎన్ఐఏ కోర్టుకూ చూపించారా? ప్రతి వారం హైదరాబాద్ రావాలంటే భద్రత-ఖర్చులు-అధికార కార్యక్రమాల కారణాలు చూపించిన జగన్.. ఇప్పుడు తన క్యాంపు ఆఫీసుకు, కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకు హాజరు మినహాయింపునకూ అదే కారణం చూపిస్తే ఎలా? విచారణ తేదీని ముందుగానే ప్రకటించినా, అదేరోజు అధికార కార్యక్రమాలు పెట్టుకోవడం ఏమిటి? ఇది కోర్టును ధిక్కరించడం కాదా? అసలు కోర్టు హాజరుకు మినహాయింపు కోరడం ఎందుకు? బాధితుడు-సాక్షి కూడా అయిన తనపై జరిగిన దాడి ఘటన, జడ్జికి వివరించడానికి ఇన్నేళ్ల సమయం ఎందుకు? మరి ఇప్పటికీ బెయిల్ కోసం జైల్లో మగ్గుతున్న శీనుకు మోక్షమెప్పుడు?.. ఇవీ విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు.
ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో.. తనపై కోడికత్తితో జరిగిన దాడిలో గాయపడిన అప్పటి విపక్షనేత- ఇప్పటి సీఎం జగన్, ఎన్ఐఏ కోర్టుకు సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది. విజయవాడలోనే ఉన్న ఎన్ఏఐ కోర్టుకు సైతం హాజరుకాకపోవడంపై, రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
తాను కోర్టుకు హాజరైతే, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని, అదీగాక సీఎంగా సంక్షేమ కార్యక్రమాల సమీక్షకు హాజరుకావలసి ఉన్నందున, తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని, కోర్టును కోరడం చర్చనీయాంశంగా మారింది. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి, ఆయన ద్వారా సాక్ష్యం తీసుకోవాలని పిటిషన్ వేసిన జగన్.. ఆ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని మరో పిటిషన్ వేశారు.
అయితే అడ్వకేట్ కమిషనర్ ద్వారా కూడా సాక్ష్యం తీసుకోవడం, న్యాయప్రక్రియలో భాగమైనప్పటికీ… వ్యక్తిగత హాజరును ప్రతిష్ఠగా తీసుకోవడంపైనే, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణ హాజరు నుంచి, ఇదేవిధంగా మినహాయింపు తీసుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతి వారం హైదరాబాద్‌కు విచారణ కోసం వస్తే ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు, భద్రతా సమస్యలు- వ్యయ ప్రయాసలవుతాయని జగన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దానితో కోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇప్పుడు విజయవాడలో అలాంటి సమస్యలు, ఖర్చు, భద్రతా సమస్యలు లేకపోయినప్పటికీ, మళ్లీ అవే కారణాలు చూపించడంపైనే, విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు కోర్టుకు హాజరుకావడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
సీఎం హోదాలో జగన్.. విజయవాడ, గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో జరిగే వివాహాలకు తరచూ హాజరవుతున్నారని, అప్పుడు కూడా ఎన్ఐఏ కోర్టుకు చెప్పిన సమస్యలే ఉన్నప్పటికీ.. సీఎం వాటికి హాజరవుతున్న విషయాన్ని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం అటు సోషల్‌మీడియాలోనూ చర్చగా మారింది. కోడికత్తి దాడి కేసులో బాధితుడు-సాక్షి కూడా అయిన సీఎం జగన్.. స్వయంగా కోర్టుకు హాజరై, తనపై జరిగిన దాడి ఘటన వివరాలు జడ్జికి వివరిస్తే.. నిందితుడు శీను బెయిల్ పిటిషన్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఇప్పటికి నాలుగుసార్లు కోడికత్తి శీను పిటిషన్‌ను తిరస్కరించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులోనే నిందితుడికి బెయిల్ వస్తే.. కోడికత్తితో దాడి చేసిన నిందితుడు, ఇంకా బెయిల్ రాకుండా జైల్లోనే ఉండటం విషాదమని న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి కోర్టుకు హాజరయి, పౌరుడిగా తన విధి నిర్వర్తిస్తే, అది ఆయన ప్రతిష్ఠను పెంచుతుందని న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. అది ఇతరులకు ఆదర్శంగా ఉంటుందని చెబుతున్నారు.
అందుకు భిన్నంగా..జగన్ ప్రతిసారి హాజరు మినహాయింపు కోరడం, కోర్టులు కూడా వాటిని అనుమతించడం వల్ల.. వేరే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. కోర్టు రెండు నెలల ముందుగానే విచారణ తేదీ ప్రకటించినప్పటికీ.. అదేరోజు అధికారిక కార్యక్రమాలు రూపొందించుకోవడం ఎందుకన్న ప్రశ్నలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే జగన్ తాజాగా వేసిన రెండు పిటిషన్లపై.. గురువారం విచారించనున్న ఎన్ఐఏ కోర్టు, ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠకు తెరలేచింది.